పెట్టుబడికి పండంటి సూత్రాలు.. | Investment principles of cute .. | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి పండంటి సూత్రాలు..

Published Fri, May 9 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

పెట్టుబడికి పండంటి సూత్రాలు..

పెట్టుబడికి పండంటి సూత్రాలు..

చిన్న మొక్క రేప్పొద్దున మహా వృక్షంగా ఎదిగి తియ్యని ఫలాలు ఇవ్వాలన్నా.. చల్లని నీడనివ్వాలన్నా.. ముందుగా నేడు విత్తు నాటడం ముఖ్యం. అది ఎంత ఆలస్యం చేస్తే.. ఫలాలు అందుకోవడానికి అంతే ప్రయాసపడాల్సి వస్తుంది. ఇదే సూత్రం పెట్టుబడులకూ వర్తిస్తుంది.భవిష్యత్‌లో ఆర్థిక కష్టాలు లేకుండా నిశ్చింతగా ఉండాలంటే ఎంతో కష్టించి సంపాదించిన డబ్బును.. ఇన్వెస్ట్ చేసేందుకుకొన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది. వాటిలో కొన్నింటిని గురించి వివరించేదే ఈ వారం ధనం కథనం..
 
 యుక్తవయసులోనే తొలి అడుగు
 సంపాదన మొదలుపెట్టిన తొలినాళ్ల నుంచే ఇన్వెస్టింగ్ మొదలుపెట్టడం కూడా మంచిది. వచ్చే ఆదాయంలో గోరంతే దాచగలిగినా సరే.. క్రమం తప్పకుండా కొనసాగించాలి. కాంపౌండింగ్ ప్రభావంతో అది కొండంత అవుతుంది. అలాగే, ఆర్థిక క్రమశిక్షణ కూడా ఇది అలవరుస్తుంది. చేసిన పెట్టుబడులపై వచ్చిన రాబడులను మళ్లీ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లండి.
 
 మన గురించి తెలుసుకోవాలి ..
 ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా అసలు మీరు ఏ తరహా ఇన్వెస్టరో మిమ్మల్ని గురించి మీరు ప్రశ్నించుకుని, తెలుసుకోవాలి. ఇన్వెస్టింగ్ అనేది ఒక కళలాంటిదే. దీనికోసం మీరు ఎంత సమయం కేటాయించగలరు, ఎంత మేర పరిశోధించగలరు అన్న విషయాలపై అంచనా వేసుకోవాలి.
 
లక్ష్యాలు
మనకంటూ కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వాహనం కొనుక్కోవడమో లేదా ఇల్లు కొనుక్కోవడమో, పిల్లల చదువు, పెళ్లిళ్ల ఖర్చులు, రిటైర్మెంట్ అవసరాలు.. ఇలాంటివెన్నో ఉంటాయి. వీటిలో కొన్ని స్వల్పకాలికమైన, మధ్యకాలికమైన, దీర్ఘకాలికమైన అవసరాలు ఉంటాయి. ఇలా వేటి కోసం ఇన్వెస్ట్ చేయదల్చుకున్నారో నిర్ణయించుకోవాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. నెలవారీ కావొచ్చు..మూణ్నెల్లకోసారి, ఆర్నెల్లకోసారి కావొచ్చు ఎంత డబ్బును ఇన్వెస్ట్ చేయగలరన్నది లెక్క వేసుకోవాలి. ఎలాంటి రాబడులను ఆశిస్తున్నారో చూసుకోవాలి.
 
ఇన్వెస్ట్ చేసే సాధనంపై అధ్యయనం
ఏయే సాధనాల్లో, ఏయే ప్లాన్లలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారో వాటిని గురించి సాధ్యమైనంత సమాచారాన్ని సేకరించండి. ఒకే సాధనం గురించి వేర్వేరు సంస్థలు కల్పించే ప్రయోజనాలు, రాబడులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. సాధనం గురించి, వాటిని అందించే వారి గురించి అవగాహన ఉండాలి.
 
వైవిధ్యం..
ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ సాధనమూ ఏదో ఒక సమయంలో హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. కాబట్టి, ఎప్పుడూ కూడా ఒక దాంట్లో మాత్రమే మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేయకూడదు. రెండు మూడు సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్కులను కొంత తగ్గించుకోవడానికి వీలుంటుంది.
 
గత వైభవం కాదు..
ఇన్వెస్ట్‌మెంట్ సాధనం ఏదైనా సరే.. కేవలం గతకాలపు పనితీరుని బట్టే ఎంచుకోకూడదు. మన మిత్రులో లేక  సన్నిహితులకో దాని ద్వారా బోలెడంత లాభాలొచ్చాయన్న కారణంతో ఆ సాధనం వైపు మొగ్గుచూపడం సరికాదు. మన ఫ్రెండ్‌కి లాభాలొచ్చినంత మాత్రాన మనకూ అలాగే లాభాలొచ్చేస్తాయనుకుంటే  కష్టం. గతకాలపు పనితీరును దృష్టిలో ఉంచుకుని,  భవిష్యత్‌లో అవకాశాలను కొద్దో గొప్పో అంచనా వేసుకోగలిగితే మేలు.
 
 టైమింగ్ ..
 దేనికైనా టైమింగ్ ముఖ్యం. ఏ సాధనంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం.. ఎంత కాలం కొనసాగించగలం, ఎప్పుడు వైదొలగాలనుకుంటున్నాం.. ఇవన్నీ కూడా కీలకమే. కాబట్టి ఈ విషయాల గురించి ముందుగానే కచ్చితంగా ఒక అవగాహన ఉండాలి.
 
 దీర్ఘకాలికం..
 మనం పెట్టుబడులను ఎంత కాలం కొనసాగించగలమన్న దానిపైనే రిస్కులు, రాబడులు ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత రాబడి కోసం ఎంత రిస్కు తీసుకోదల్చుకున్నారన్నదీ కీలకమే. ముందుగానే చెప్పినట్లు.. మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి కాబట్టి.. దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే రిస్కులను కాస్త యావరేజ్ చేసుకోవచ్చు.
 
 ఎక్కువగా ఊహించొద్దు..
 ఎంత ఆశావహంగా ఉన్నా లాభాల విషయంలో వచ్చే దానికన్నా ఎక్కువగా ఊహించుకుని లెక్క వేసుకోవద్దు.
 సాధ్యమైనంత వరకూ తక్కువే రావొచ్చని ఆచితూచి అంచనాలు వేసుకుంటే తప్పులు చేసే అవకాశాలు తగ్గుతాయి.
 
 సహనం.. సమీక్ష
 ఒకోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నిస్పృహ ఆవరించి.. సహనం నశించవచ్చు. కానీ, ఇక్కడ మీరు అసహనంతో ఏ నిర్ణయం తీసుకున్నా మీ కష్టార్జితాన్ని కోల్పోవాల్సి వస్తుందని గుర్తుంచుకుని, సాధ్యమైనంత మేర నిబ్బరంగా ఉండే ప్రయత్నం చేయక తప్పదు. అప్పుడప్పుడు మార్కెట్ పరిస్థితులను బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉండాలి.
 
 గతం గతః
 తప్పులు చేయడం మానవ సహజం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే.. చేతికి వచ్చిన అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఉదాహరణకు.. మీరు తీసుకున్న షేరును ఏదో ఒక రేటుకు అమ్మేసిన తర్వాత.. అది మరింత పెరిగిందనుకోండి. అరెరే మరింత కాలం వేచి ఉండాల్సిందంటూ దాని గురించే ఆలోచిస్తూ సమయం వృథా చేయడం కన్నా ఇతర అవకాశాలను అన్వేషించి అంది పుచ్చుకోవడం ఉత్తమం. తప్పిదాల నుంచి నేర్చుకుని, ఆ అనుభవంతో ముందుకెళ్లాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement