రోజులు ఎంత గంభీరంగా మారినా కొన్ని దుర్గుణాలు మనం వదులుకోలేకపోతున్నాం. మన అంతరాత్మ ముందుమనల్ని మనం నిలబెట్టుకోవడం ఇప్పుడు కావాలి.
గమనించి చూడండి. రైల్వే గేటు పడి ఉంటుంది. రైలు మరికొద్ది నిమిషాల్లో రాబోతున్నదని మనకు అర్థమవుతూనే ఉంటుంది. కాని ఒకడెవడో, మనలో ఒకడెవతో బైక్‌ను గేటు కింద నుంచి దూర్చి హడావిడిగా అవతలి వైపుకు వెళ్లడానికి ప్రయాస పడుతుంటాడు. వాడికి అర్జెంట్ పని ఏమీ ఉండదు. మహా ఉంటే అది అయిదు నిమిషాలపాటు ఆగేదే అయి ఉంటుంది. కాని వాడు గేటు దాటాల్సిందే. అలా దాటి వెళితే, కొంత మంది దాటలేక అటువైపే ఉండిపోతే వాడికి అదొక తృప్తి.
‘బయట పడేయ్... బయట పడేయ్’ అంటుంటారు తల్లిదండ్రులు. కారులో ఉన్న పిల్లలు ఏదో ఒకటి తిని, ఆ రేపర్‌ని చేతిలో పట్టుకుని ఉంటే తల్లిదండ్రులకు ఏమీ తోచదు. దానిని బయట పడేయాలి. కారు ఎక్కడ ఉన్నా.. గుడి ముందు ఉన్నా బడి ముందు ఉన్నా నడి రోడ్డులో ఉన్నా డోర్ దించి ఆ చెత్తను బయట పడేయాలి. కారు శుభ్రంగా ఉంచాలి. చెత్త జనానికి పంచాలి. ఎవరూ ఏమీ అడగరని అలాంటి తల్లిదండ్రులకు అదొక ధైర్యం.
‘చూచూ వస్తోంది’ అంటే ‘ఎక్కడో ఒక చోట పోసెయ్‌రా’ అనే పెద్దలు తప్ప, ఇల్లు వచ్చే వరకూ ఆగు, బయలు దేరే ముందు పోసుకో అని చెప్తున్నారా ఎక్కడైనా? నలభై ఏళ్లు వచ్చినా, యాభై ఏళ్లు వచ్చి జుట్టు తెల్లబడినా ఖాళీ చోటు కనిపిస్తే చాలు దానిని పాడు చేసే హక్కు ఉన్నట్టుగా బయల్దేరే, చెట్టు కనిపిస్తే దానిని టాయిలెట్ కమోడ్‌గా భావించే పుణ్యపురుషులు భయంకరమైన శిక్ష పడుతుందని చెప్తేనో ప్రాణాంతకమైన క్రిమి సోకుతుందని నిర్థారిస్తేనో మాత్రమే మారుతారా? మామూలు సమయాలలో మామూలు మర్యాదలను పాటించలేరా?
భారతీయులు నింపాదిగా జీవనం సాగించే మనుషులు. కాని నింపాదితనం పోయింది. సమయం అంటే అదేదో జేబు నుంచి కారిపోతున్న అతి విలువైన మారకంగా మారిపోయింది. ఏ పనికీ ఒక్క గంట ఓపిక పట్టలేకపోతున్నాము. కరెంటు బిల్లు కట్టడానికి అంత సేపా? డాక్టర్ కోసం వెయింటింగ్‌కి అంత సేపా? సినిమా బుకింగ్ దగ్గర అంత సేపా? ఇలా అనేవారిలో 99 శాతం దేశాన్ని ఏలరు. కనీసం ఒక వార్డును కూడా ఏలరు. కాని త్వరత్వరగా తెమిలిపోవాలి. త్వరత్వరగా ఎక్కడికో వెళ్లిపోవాలి. ఎక్కడికి?
ఇవాళ కరోనా అంటువ్యాధి మన దేశంలో ప్రబలడంలో ఆ వ్యాధికి ఉన్న శక్తి కంటే మన దుర్గుణాలకు ఉన్న శక్తి ఎక్కువ ప్రమాదకరంగా మారేలా ఉంది. గేటు కింద దూరి త్వరగా అవతలికి పోవాలి అనుకునేలాంటి వాడే ఫ్లయిట్ దిగిన వెంటనే పారాసిటిమాల్ వేసుకొని త్వరగా ఇల్లు చేరుకోవాలి అని అనుకుంటాడు. తనకు ఆరోగ్యం బాగలేదని, ఇది ప్రమాదమని, వైద్యులకు సరెండర్ కావాలని అనుకోనివాడు ఏ అదను చూసుకొనో ఫేస్‌బుక్‌లో దేశభక్తి మీద ఉపన్యాసాలు దంచుతుంటాడు. చదువుకు, ఇంగితజ్ఞానానికి సంబంధం లేకపోతే ఎంత చదువుకున్నా అతడు అక్షరాస్యుడు కాగలడా? స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పినా బయట తిరిగి, మాల్స్‌కు తిరిగి, పార్టీలు ఇచ్చి, పార్టీలకు వెళ్లి ఏం చేద్దామని మన ప్రవర్తన? నీ కోసం నువ్వు 14 రోజులు ఇచ్చుకోలేనివాడివి కుటుంబం కోసం దేశం కోసం ఏదో ఒకటి ఇస్తావని ఆశించడం చాలా అసంబద్ధం.
చాలా వీడియోలలో కల్వర్టు మీద వాగు పొంగి ప్రవహిస్తున్నా బైక్ వేసుకు వెళ్లి మునిగిపోయేవాళ్లు కనిపిస్తుంటారు. మనలో చాలామంది స్వభావం అదే. మనకేం కాదని మనదాకా రాదని. అంత మునిగిపోయేది వచ్చినప్పుడు చూద్దాం అని. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు అనంటే నిజంగా ఇవాళ మన రోడ్ల మీద అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేవారి శాతమెంత? వృథాగా తిరిగేవారి శాతమెంత? ఒక వేయిమందికి ప్రాణహాని కలిగితేనే మనకు సీరియస్. ఒకరూ ఇద్దరుగా చనిపోతూ ఉంటే ‘మామూలు విషయం’.
ఇప్పుడు వచ్చిన అంటువ్యాధి ఇంకా సమగ్ర సమాచారం, అంచనా ఇవ్వని వ్యాధి. అది ఏమిటో అర్థమయ్యేలోపే ఎంతో ప్రాణహాని జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో రాబోయే రోజులను అంచనా కట్టుకుని, పరిసరాలలో ఉన్న వారితో మాట్లాడుకుని, పని చోట ఉన్నవారితో చర్చించుకుని క్రమశిక్షణతో, బాధ్యతతో పాడు రోజులను ఎదుర్కొనడానికి సిద్ధమవుతారు.ఇప్పుడు కావలసింది రెండు నెలల పాటు అవసరమయ్యే సరుకులను కొనుక్కుని దాచుకునేవారు కాదు. కనీసం ఇద్దరికైనా జాగ్రత్తలు చెప్పి వారు క్రమశిక్షణ పాటించేలా చూసి తాము క్రమశిక్షణ పాటించేవారు.ఒక మనిషికి ఈ వ్యాధి వస్తే ఆ మనిషికి మాత్రమే నష్టం జరిగే ‘పరిమిత నష్టకారి’ కాదు ఇది. కుటుంబం దాని బారిన పడుతుంది. ఇరుగుపొరుగు దాని బారిన పడతారు. ఒక సమూహమే దాని బారిన పడుతుంది.నిద్ర లేచి కృష్ణ, రామ, అల్లా, జీసస్‌ను తలుచుకోవడం అవసరమే కావచ్చు. కాని స్వీయ క్రమశిక్షణ గురించి సంకల్పం చెప్పుకోవడం కూడా అవసరం.ఎవరు చూడొచ్చారులే నుంచి మన అంతరాత్మ మనల్ని గమనిస్తోంది అనే వరకు ఎదుగుదల అవసరం. అదే ఇప్పుడు దేశానికి శ్రీరామరక్ష.
– కె.సువర్చల
Comments
Please login to add a commentAdd a comment