తొలుత ఎన్నారై.. ఆ తర్వాత మర్కజ్‌ లింక్‌లే.. | HYderabad Complete One Month Lockdown After Janta Curfew | Sakshi
Sakshi News home page

నగరంలో లాక్‌డౌన్‌ విధించి నెల పూర్తి..

Published Fri, Apr 24 2020 10:14 AM | Last Updated on Fri, Apr 24 2020 10:14 AM

HYderabad Complete One Month Lockdown After Janta Curfew - Sakshi

గ్రేటర్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించి సరిగ్గా నెల రోజులు అవుతోంది. మరి ఇది సత్ఫలితాలు ఇస్తుందా..? వైరస్‌ పెద్ద ఎత్తున విస్తరించకుండా అడ్డుకట్ట వేయగలిగిందా..? ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఇది కీలక పాత్రపోషిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. ప్రభుత్వం సకాలంలో ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే కోవిడ్‌ మహమ్మారి మరింత వేగంగా విస్తరించి వందలాది మంది ప్రాణాలను బలి తీసుకునేదని అభిప్రాయపడుతున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తోంది. లాక్‌డౌన్‌ ప్రకటించి నెల రోజులు దాటింది. కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలనుకంటైన్మెంట్‌ జోన్లుగా విభజించి వైరస్‌ను మరింత కట్టడి చేసింది. ఫలితంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వైరస్‌ విస్తరించకుండా (చైన్‌ ఆఫ్‌ ట్రాన్‌మిషన్‌ బ్రేక్‌) చేయడంలో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ చాలా బెటర్‌గా ఉన్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: చైనాలోని వూహాన్‌ నగరంలోని గత ఏడాది డిసెంబర్‌ 31న తొలిసారిగి కరోనా వైరస్‌ వెలుగు చూసింది. అనతి కాలంలోనే ఇటలీ, ఇంగ్లాండ్, అమెరికా, ఇండోనేషియా తదితర దేశాలకు విస్తరించింది. 2020 ఫిబ్రవరిలో కేరళలో తొలి కరోనా కేసు నమోదు కాగా, మార్చి 2న హైదరాబాద్‌లో తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. తొలుత కేవలం విదేశాల నుంచి వచ్చే వారి నుంచే వైరస్‌ విస్తరిస్తున్నట్లు ప్రభుత్వం భావించింది. ఆమేరకు అప్రమత్తమైంది. మార్చి 18 వరకు వివిధ దేశాల నుంచి సుమారు 70545 మంది శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరందరినీ క్వారంటైన్‌లో ఉంచింది. వీరిలో 447 మందికి వైద్య పరీక్షలు చేయగా, వీరిలో కేవలం ఆరు పాజిటివ్‌ కేసులే నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇండోనేషియా నుంచి డిల్లీ మర్కజ్‌ సభలకు హాజరై..తెలంగాణలోని రామగుండం, కరీంనగర్‌లో పర్యటించిన పది మంది విదేశీయులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం, వీరు అప్పటికే వివిధ ప్రాంతాల్లో పర్యటించడంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. వెంటనే కేంద్రం అప్రమత్తమైంది. 

జనతా కర్ఫ్యూతో మొదలై...ప్రస్తుత లాక్‌డౌన్‌ వరకు..
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు సంఘీభావంగా మార్చి 22న కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ప్రకటించింది. ఆ తర్వాతి రోజు నుంచి మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ ప్రారంభానికి ముందు రోజు వరకు తెలంగాణ వ్యాప్తంగా 27 పాజిటివ్‌ కేసులు నమోదైతే..వీటిలో 13 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనివే. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గక పోగా మరింత పెరిగాయి. దీంతో లాక్‌డౌన్‌ కాలాన్ని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ మూడో తేదీనాటికి విదేశీయులు, ఏడో తేదీ నాటికి మర్కజ్‌ నుంచి వచ్చిన వారు.. 14 వరకు వారికి సన్నిహితుల క్వారంటైన్‌ గడువు ముగుస్తుందని భావించి ఆ మేరకు లాక్‌డౌన్‌ కాలాన్ని ఏప్రిల్‌ 15 వరకు పొడగించింది. అయినా కేసుల సంఖ్య తగ్గక పోగా మరింత ఎక్కువ నమోదవుతుండటంతో ప్రభుత్వం  ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించగా, మే 7వ తేదీ వరకు కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు లాక్‌డౌన్‌ కాలాన్ని పొడగిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.

కంటైన్మెంట్లలో ‘కట్టు’దిట్టం

ఇప్పటి వరకు తెలంగాణలో 943 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే సగానికిపైగా(550) కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఏప్రిల్‌ 12 నాటికి నగరంలో 273 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కేవలం పది రోజుల్లోనే 253పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు మరింత విస్తరిస్తున్న ఈ వైరస్‌ను నియంత్రించాలంటే లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావించి ంది. చైన్‌ ఆఫ్‌ ట్రాన్‌మిషన్‌ బ్రేక్‌ చేయాలంటే మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది. ఆ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటికే పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించింది. పరిపాలనా సౌలభ్యం కోసం వాటిని 152 కంటైన్మెంట్‌ జోన్లుగా విభజించింది. వాటిని రెడ్‌ జోన్లుగా ప్రకటించి, లోపలివారిని బయటికి..బయటి వారిని లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టం చేసింది. 

స్ప్రెడ్‌ జరగకుండా అడ్డుకట్ట
ఒక వైపు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తూనే మరో వైపు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది డోర్‌ టు డోర్‌ పర్యటించి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. తద్వారా ఇప్పటి వరకు పాజిటివ్‌ వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులే కాకుండా వారి ఇంటికి ఇటు, అటుగా ఉన్న అనుమానితులను గుర్తించి వారిని ఐసోలేషన్‌కు తరలించడమే కాకుండా ప్రైమరీ కాంటాక్ట్‌ల నుంచి ఇతరులకు విస్తరించకుండా నివారించగలిగారు. 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారిలోనూ ఆ తర్వాత వైరస్‌ వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పాజిటివ్‌ కేసులకు సన్నిహితంగా ఉన్న వారితో పాటు ఇతర అనుమానితుల కార్వంటైన్‌ టైమ్‌ను 28 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇలా ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేయడం ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్‌ లేకుండా చేయగలిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement