ఇలా ఉందాం.. ఇది మానేద్దాం | Hyderabad People Neglect Janata Curfew | Sakshi
Sakshi News home page

21 రోజులుఇంట్లోనే గడిపేద్దాం

Published Wed, Mar 25 2020 7:37 AM | Last Updated on Wed, Mar 25 2020 11:50 AM

Hyderabad People Neglect Janata Curfew - Sakshi

కరోనా విజృంభిస్తోంది. ప్రమాదం ముంచుకొస్తోంది. నగరంలో మరో ముగ్గురికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జనంలో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. మరో 21 రోజులు లాక్‌డౌన్‌ను కఠినంగా పాటించాల్సిందే. ఇంటికే పరిమితం కావాల్సిందే. స్వీయ నియంత్రణకు సిద్ధం కావాల్సిందే. లేకుంటే కరోనా కాటేయక మానదు. జనతా కర్ఫ్యూ రోజు ఇంటికే పరిమితమైన సిటీజనులు...లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యాక మాత్రం నిబంధనలు పాటించడం లేదు. రహదారులపైకి యథేచ్ఛగా వస్తున్నారు. ఇచ్చిన రిలీఫ్‌ను సద్వినియోగం చేసుకోకుండా..పెద్ద మొత్తంలో దుర్వినియోగం చేస్తూ..గుంపులు గుంపులుగా వస్తూ కరోనా వ్యాప్తికి ఆజ్యం పోస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉగాది పండగ కొనుగోళ్ల పేరిట భారీగా జనం మార్కెట్లకు తరలిరావడం ఆందోళన కలిగించింది. గుడిమల్కాపూర్, కొత్తపేట, మెహిదీపట్నం రైతుబజార్లు, మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. ఇది ఏమాత్రం సబబు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రానికి పోలీసులుకఠిన చర్యలకు దిగడంతో పరిస్థితి కొంత మారింది. ఇక కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే సోషల్‌ డిస్టెన్స్‌ తప్పనిసరని, పరిస్థితిలో మార్పు రాకుంటే 24 గంటలు కర్ఫ్యూ అమలు చేస్తామని పీఎం, సీఎం హెచ్చరించిన నేపథ్యంలో జనంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది.

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు దృష్టి సారించారు. మంగళవారం నగరంతో పాటు శివారు ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నియంత్రించేందుకు మూడు కమిషనరేట్ల పరిధిలో 180 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టారు. అన్ని ప్రాంతాల్లో మెడికల్‌ షాప్‌లు, వైద్య సేవలు, బ్యాంక్‌ ఏటీఎంలు మినహా అన్నింటిని మూసివేయించారు. బృందాల వారీగా ప్రధాన ప్రాంతాలు, గల్లీల్లో పర్యటించి రహదారులపై ఉన్న అందరినీ ఇళ్లలోకి పంపారు. సోమ, మంగళవారాల్లో లాక్‌డౌన్‌ నిబంధన ఉల్లంఘించిన ఐదువేల మంది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చాలామటుకు కేసులు నమోదుచేశారు. అలాగే ‘కర్ఫ్యూ’ సమయమైన రాత్రి ఏడు గంటలు ప్రారంభం కాగానే..  రహదారులపై రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. ఇళ్లలోంచి బయటకు వచ్చేవారు ప్రధాన రహదారులపైకి రాకుండా, ఇతర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించకుండా అంతర్గత రహదారులపై చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ హైటెక్‌సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో సోమవారం రాత్రి రెండు గంటల వరకు పర్యటించి లాక్‌డౌన్‌ పర్యవేక్షించారు. బయోడైవర్సిటీ, హైటెక్‌సిటీ ఫ్లైఓవర్‌లను మూసివేశారు. అలాగే ఐటీ కారిడార్‌లో అత్యవసర సేవలైన కంపెనీ సిబ్బందికి పోలీసులు పాస్‌లు జారీ చేశారు. అలాగే ఐటీ, ఫార్మా కంపెనీ ప్రతినిధులకు పాస్‌లు జారీచేశామని, అవసరం లేని వారికి సెలువులు ఇచ్చారని సీపీ సజ్జనార్‌ అన్నారు. అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రావొద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

ఎక్కడెక్కడ ఎలా అంటే...
పాతబస్తీలో మంగళవారం ఉదయం ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను ఖరీదు చేశారు. దీంతో ఎక్కడ చూసినా రోడ్లపై జనం రద్దీ కనిపించింది. కొంత మంది ఇష్టానుసారంగా వాహనాలతో రోడ్లపైకి రావడాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ మండలం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. చార్మినార్, బహదూర్‌పురా, మీర్‌చౌక్, ఫలక్‌నుమా ట్రాఫిక్‌ పోలీసులతో పాటు దక్షిణ మండలంలోని లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ ప్రారంభించారు. సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ చేశారు.  
కూకట్‌పల్లిలో హైటెక్‌ సిటీ రోడ్డు, జేఎన్‌టీయూ చౌరస్తా, కూకట్‌పల్లి రహదారి, ఆల్విన్‌కాలనీ చౌరస్తా, వై జంక్షన్, మూసాపేట జంక్షన్, బాలానగర్‌ చౌరస్తాలతో పాటు వివిధ కూడళ్లలో పోలీసులు పహరా కాశారు. రోడ్డుపై వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తూ వారి అవసరాలను బట్టి వాహనాలకు అనుమతి ఇచ్చారు. కొంతమంది ఎలాంటి అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చిన వారిపై జరిమానాలు విధించారు. యువకులు ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు ఉంటే లాఠీచార్జి చేశారు.  
దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కొత్తపేట్, సరూర్‌నగర్, సైదాబాద్, మీర్‌పేట్, పహాడీషరీఫ్‌  తదితర ప్రాంతాలలో రోడ్లపై వాహనాల సందడి ఎక్కువగా కనిపించింది. ఆయా ప్రాంతాలలో రోడ్డుపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వాహనాలు వస్తే సీజ్‌ చేస్తామని హెచ్చరించి పంపారు.  
గోల్కొండ, హుమాయూన్‌నగర్, ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల సిబ్బంది మంగళవారం ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు నిర్వహించారు. లాక్‌డౌన్‌ను పాటించకుండా బైక్‌లపై, కార్లల్లో వచ్చిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి చేతుల్లో ‘ఐ సపోర్ట్‌ లాక్‌డౌన్‌’ అనే ప్లకార్డులు ఉంచి రోడ్డు పక్కన నిలబెట్టారు.  
ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల్లో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌తో కలిసి హోంమంత్రి మహమూద్‌ ఆలీ మంగళవారం పర్యటించారు.  
బాలానగర్‌ డీసీపీ పీవీ పద్మజారెడ్డి జగద్గిరిగుట్ట పీఎస్‌ పరిధిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ముంబై జాతీయ రహదారి మియాపూర్‌ బొల్లారం చౌరస్తాలో వాహనదారులను ఆపి మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరావు తనిఖీ చేశారు. అవసరం లేకుండా బయటకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని హెచ్చరించారు.  

ఆర్టీఏ కొరడా!
ఒకవైపు లాక్‌డౌన్‌  నిబంధనలను కఠినతరం చేసినప్పటికీ  లెక్కచేయకుండా రోడ్డెక్కుతున్న వాహనదారులపై రవాణాశాఖ కొరడా ఝళిపించింది. నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. అత్యవసర వాహనాలు  మినహాయించి రోడ్డెక్కిన ఇతర వాహనాలను అధికారులు జప్తు చేశారు. భారీ ఎత్తున కేసులు నమోదు చేశారు. గత రెండు రోజులుగా సుమారు 500 వాహనాలపైన కేసులు నమోదు చేసినట్లు రవాణా అధికారులు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో  150కి పైగా వాహనాలను జప్తు చేశారు. ఆటోలు, వస్తురవాణా వాహనాలు, వ్యక్తిగత వాహనాలు కూడా  నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నట్లు  రవాణాశాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్ట్‌మెంట్‌ విభాగం  డిఫ్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌  పాపారావు  తెలిపారు. అనవసరంగా తిరిగే వాహనాలపైన మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు  హెచ్చరించారు. ఒకవైపు  కరోనా పట్ల  వాహనదారులకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాటిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా బారి నుంచి కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని  సూచించారు. కేవలం  ప్రభుత్వ బాధ్యతగా  భావించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ సూచనలు,సలహాలకు అనుగుణంగా  వ్యవహరిస్తే కరోనాను అధిగమించగలమన్నారు. ఖైరతాబాద్‌లో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో  ప్రాంతీయ రవాణా అధికారులు దుర్గాప్రసాద్, రాంచందర్, పలువురు ఎంవీఐలు, ఏఎంవీఐలు పాల్గొన్నారు. 

నిలిచిన పౌరసేవలు....
మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలో అన్ని రకాల ఆర్టీఏ పౌరసేవలకు బ్రేక్‌ పడింది. లెర్నింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, బదిలీలు, శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సులు, తదితర సేవల కోసం నిర్దేశించిన స్లాట్‌లను కూడా నిలిపివేశారు. కొత్త వాహనాల నమోదుకు షోరూమ్‌లలోనే వెసులుబాటు కల్పించినప్పటికీ లాక్‌డౌన్‌  దృష్ట్యా ఇప్పటికే వాహనాలు కొనుగోలు చేసిన వారు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం వచ్చే వాహనదారులతో నిత్యం రద్దీగా ఉండే నాగోల్, ఉప్పల్, మేడ్చల్, కొండాపూర్, తదితర డ్రైవింగ్‌ టెస్ట్‌ట్రాక్‌లు దాదాపు నిర్మానుష్యంగా కనిపించాయి. అలాగే  ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌తో పాటు అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ పౌరసేవలు నిలిచిపోయాయి. 

బీఎస్‌–4 పై ప్రతిష్టంభన...
ఈ నెల 31వ తేదీతో ముగియనున్న భారత్‌స్టేజ్‌ (బీఎస్‌)–4 వాహనాల రిజిస్ట్రేషన్‌పైన ప్రతిష్టంభన నెలకొంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బీఎస్‌–6 వాహనాలను మాత్రమే నమోదు చేయనున్నారు. ఇప్పటికే బీఎస్‌–4 వాహనాలను కొనుగోలు చేసి ఇంకా రిజిస్ట్రేషన్లు చేసుకోకుండా ఉన్న వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు పౌరసేవలు నిలిచిపోవడం, మరోవైపు బీఎస్‌–4 వాహనాల గడువు  సమీపిస్తుండడంతో  సందిగ్ధం నెలకొంది. ఈ వాహనాల నమోదుకు గడువు పెంచితే తప్ప పరిష్కారం లభించదు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 50 వేల బీఎస్‌–4 వాహనాలు  శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు అంచనా.

ఇళ్లలో ఉండడం లేదు...
ఇటీవలి కాలంలో విదేశాల నుంచి వచ్చి నగరంలో హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నవారు క్వారంటైన్‌ నిబంధనల్ని పాటించడం లేదని, అలాంటి వారి వల్ల తమకు వ్యాధి ప్రమాదం పొంచి ఉందని సంబంధిత అపార్ట్‌మెంట్ల లోని వారు, పరిసరాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారిలో కొందరు ఉన్నతాధికారులకు, సంబంధిత కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. హోమ్‌ క్వారంటైన్‌ నిబంధనలు పాటించని వారి వివరాలను చిరునామాలతో సహ జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారు జీహెచ్‌ఎంసీకి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు మునిసిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖకు తెలియజేయాలని మునిసిపల్‌ పరిపాలన, పట్టణాభివద్ధిశాఖ  ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు మెయిల్‌ ద్వారా కూడా తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. ఏ ప్రాంతంలోని వారైనా 9154686549, 9154686552, 9154686558, 9154686557 నెంబర్లకు ఫోన్‌ ద్వారా సమాచారమివ్వవచ్చునని సూచించారు.

ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు
తమ అపార్ట్‌మెంట్స్‌లో మూడు రోజుల క్రితం యూఎస్‌ నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నందున తమకు తీవ్ర ఆందోళనగా ఉందని, అపార్ట్‌మెంట్స్‌లోని 39 ఫ్లాట్లలో దాదాపు 300 మందికి వారి నుంచి ప్రమాదం ఉందని సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పౌరుడొకరు అర్వింద్‌కుమార్‌కు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అపార్ట్‌మెంట్స్‌లో చిన్నపిల్లలు, వృద్ధులతోపాటు గర్భిణులున్నారని, హోమ్‌ క్వారంటైన్‌లోని వ్యక్తి నలుగురు కుటుంబసభ్యులతో సహ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఉంటున్నారని ఫిర్యాదు చేశారు. హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్‌చేసినా ఫలితం కనిపించడం లేదని పేర్కొన్నారు.  సదరు వివరాలను మరోమారు పంపించడంతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కూడా ట్యాగ్‌ చేయాలని ఆయనకు సూచించారు. వారి ఫ్లాట్‌కు వచ్చిన ప్రభుత్వోద్యోగుల బృందం ఎలా ఉన్నారని ఆరా తీశారు తప్ప ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని ఆరోపించారు. వారికి కూడా కనీస రక్షణ సామాగ్రి లేదన్నారు. శానిటైజేషన్‌ కార్యక్రమాలు కూడా సరిగ్గా జరగడం లేదని, ఆ కుటుంబం హోమ్‌ క్వారంటైన్‌ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. సెంట్రల్‌  కమాండ్‌ సెంటర్‌కు కూడా కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. వారికి  వైద్యశాఖ రెండు సార్లు కౌన్నెలింగ్‌ ఇచ్చిందని, మరోమారు హెల్త్, పోలీసుశాఖలు కౌన్సిలింగ్‌ ఇస్తాయని పేర్కొందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement