హోమియో కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. వివాహమై నాలుగేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? - ఈశ్వరి, అమలాపురం
ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు: జన్యుసంబంధిత లోపాలు థైరాయిడ్ సమస్యలు అండాశయంలో లోపాలు; నీటిబుడగలు గర్భాశయంలో సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు డయాబెటిస్ గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు: హార్మోన్ సమస్యలు థైరాయిడ్ పొగతాగడం శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం.
సంతానలేమిలో రకాలు: ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ.ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ: అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ : మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది.
గుర్తించడం ఎలా: తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు.
చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని క్రమంగా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ సమస్యను పూర్తిగా నివారిస్తారు.
సయాటికా అంటే...?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 27 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఏడాదిగా నడుము నొప్పితో బాధపడుతున్నాను. ఇటీవల ఒక్కసారిగా నా కుడికాలి తొడలో నరం పట్టేసింది. దాంతో నేను భరించలేనంత బాధతో విలవిలలాడిపోయాను. సాయంత్రం డాక్టర్‌ని కలిశాను. ఆయన పరిశీలించి నేను ‘సయాటికా’ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పారు. సయాటికా అంటే ఏమిటి? దయచేసి దీనికి శాశ్వత పరిష్కారాన్ని తెలియజేయండి. - శ్వేత, కూకట్‌పల్లి
సయాటికా అనేది ఒక నరం. మన వెన్నుపూస చివరి నుంచి అరికాలి వరకు ఉంటుంది. శరీరంలో ఇదే అతి పెద్ద నరమని చెప్పవచ్చు. ఎక్కువగా బరువులు మోసేవాళ్లు, అదేపనిగా కూర్చొనిగానీ, నిల్చొని గాని ఉండేవారిలో ఇది సయాటికా వ్యాధి కనిపిస్తుంది. ఇక ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నవాళ్లలోనూ ఇది ఎక్కువ. అలాగే ప్రమాదవశాత్తు ఎత్తుపై నుంచి పడినప్పుడు లేదా రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పుడు కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. పడుకునే సమయంలోగానీ, గంటల తరబడి కూర్చొని ఒకేసారి లేచే సమయంలో కాలి తొడ భాగాన నరం పట్టేస్తుంది. అప్పటివరకు ఈ వ్యాధి బారిన పడినట్లు మనకు తెలియదు. మీ విషయంలోనూ అదే జరిగింది. ఇది మొదట్లో సాధారణ నడుం నొప్పిగా అనిపిస్తుంది. చాలామంది కొన్ని పెయిన్‌కిల్లర్స్ వాడి దాని నుంచి ఉపశమనం పొందుతారు. ఈ తర్వాత అదే నొప్పి పిరుదుల మీదుగా తొడ భాగం నుంచి మోకాలి వరకు వ్యాపిస్తుంది. అలాగే నిర్లక్ష్యం చేస్తే అరికాలి వరకు పాకి సమస్యను జటిలం చేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారనేది తెలుసుకొని చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకు మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ విషయాన్ని వైద్యుడికి తెలపండి. అలాగే మీరు ఎంతకాలం నుంచి నొప్పితో బాధపడుతున్నారో కూడా వివరించండి. వైద్యలు మీకు కొన్ని పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్సను అందిస్తారు. సాధారణంగా కొన్ని మందులతో పాటు ఫిజియోథెరపీ లాంటి ప్రక్రియతో ఈ నొప్పిని అదుపులో ఉంచవచ్చు. వాటితోనే చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ జాయింట్స్, డిస్క్‌లలో ఏమైనా గ్యాప్‌ల లాంటివి ఏర్పడినట్లు ఎక్స్-రేలో తేలితే చిన్నపాటి సర్జరీతో వాటిని సరిచేసి మీకు ఉన్న సమస్యను వీలైనంతవరకు తగ్గించవచ్చు. మీరు హైహీల్స్ ధరించకూడదు. అధికబరువులు ఎత్తకూడదు. ఒక్కసారిగా పక్కకు తిరగడం, లేవడం, కూర్చోవడం లాంటివి చేయకూడదు. పడుకునేటప్పుడు మీ మోకాలి దగ్గర దిండు ఉండేలా చేసుకోండి. ఆందోళన అవసరం లేదు.
డా.సునీల్ దాచేపల్లి
సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
డర్మటాలజీ కౌన్సెలింగ్
అది బట్టల వల్ల వస్తున్న అలర్జీ!
నాకు ఒంటి మీద బట్టలు తొడిగి ఉన్న చోట ఎర్రటి ర్యాష్ కనిపిస్తోంది. అక్కడ దురదగా ఉంటోంది. ఇక దుస్తులు కవర్ కాని చోట అంటే ముఖం, మెడ మీద ర్యాష్‌లేదు. ఇక అండర్ గార్మెంట్స్ కవర్ అయ్యే చోట ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - ఒక సోదరి, మహబూబాబాద్
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ‘టెక్స్‌టైల్స్ డర్మటైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. కాంటాక్ట్ డర్మటైటిస్‌లలో ఇది ఒక రకం. ఈ తరహా డర్మటైటిస్‌లో ఒంటితో కాంటాక్ట్‌లో ఉన్న చర్మంపై అలర్జీ వస్తోంది. మీరు దుస్తులు ఉతికే సమయంలో వాటిని సరిగా పిండకపోవడం వల్ల, అక్కడ ఉన్న డిటర్జెంట్ మీ ఒంటిపై కలిగించే అలర్జీతో ఈ సమస్య వస్తుంటుంది. మీరు ఇకపై దుస్తులు ఉతికే సమయంలో డిటర్జెంట్ వదిలిపోయేలా వాటిని పూర్తిగా పిండివేయండి. ఒకవేళ అలాగే వదిలేస్తుండటం వల్ల అదేపనిగా దురద రావచ్చు. అదే కొనసాగుతూ ఉంటే బట్టలు మీ ఒంటికి ఆనుకునే చోట అది ఎగ్జిమాకు దారితీయవచ్చు. ఇక మీ లోదుస్తులు ఒంటికి ఆనేచోట బట్టలతో చర్మానికి కాంటాక్ట్ మరింత ఎక్కువ కాబట్టి అక్కడ ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.
చికిత్స ఇలా: మీరు నోటి ద్వారా మాంటెలుకాస్ట్ కలిగి ఉన్న టెక్సో ఫెనాడిన్ హైడ్రోక్లోరైడ్ మందులను ప్రతిరోజూ ఉదయం, రాత్రి చొప్పున రెండు వారాల పాటు వాడాలి స్నానం చేసే సమయంలో ఆలోవీరా షవర్‌జెల్‌ను వాడాలి వైట్ సాఫ్ట్ పారఫిన్ మాయిశ్చరైజర్‌ను ప్రతిరోజూ ఉదయం, రాత్రివేళల్లో ఒంటిపై రాసుకోవాలి ఈ మాయిశ్చరైజర్‌పైన మొమాటజోన్ ఫురోయేట్, ఫ్యుసిడిక్ అసిడ్ అనే క్రీమ్‌ను రోజూ ఉదయం, రాత్రివేళల్లో రాయాలి. ఇది రెండు వారాల పాటు వాడాలి మీ బట్టలు శుభ్రంగా ఉతికేసుకోవడం అన్నిటికంటే ప్రధానం.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్