మా పాప పుట్టిన తర్వాత తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే పరీక్షచేసి హీమోగ్లోబిన్ పాళ్లు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. అప్పటినుంచి నెలనెలా రక్తం ఎక్కిస్తూ ఉండాలని చెప్పారు. మూడేళ్ల తర్వాత ప్లీహం (స్లీ్పన్) తొలగిస్తే ఇలా తరచూ రక్తం ఎక్కించే అవసరం తగ్గుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్ చేయించాం. తర్వాత రెండు నెలలకోసారి రక్తం ఎక్కిస్తున్నారు. మంచి ఆహారం పెడుతూ నెలకోసారి పెనిడ్యూర్ ఇంజెక్షన్ చేయిస్తున్నాం. రక్తం ఎక్కించాక నెలన్నరకే... పాప పాలిపోయి నీరసంగా తయారవుతోంది. ఇలా మాటిమాటికీ రక్తం ఎక్కించే బాధ తప్పదా? దీనికి శాశ్వత చికిత్స లేదా?
సాధారణంగా మన రక్తంలోని ఎర్ర రక్తకణాలు మధ్యన కాస్తంత నొక్కినట్లుగా బిళ్లలలా ఉంటాయి. కానీ మీ పాపకు ఉన్న సమస్య వల్ల తయారయ్యే ప్రక్రియలోనే అవి బంతిలా గుండ్రంగా తయారవుతుంటాయి. పాపకు ఇది పుట్టుకతో జన్యుపరంగా వచ్చిన సమస్య. ఇలా కణాల ఆకృతి భిన్నంగా ఉండటంతో మన శరీరంలోని ప్లీహం (స్పీ›్లన్) వాటిని లోపభుయిష్టమైన కణాలుగా గుర్తించి, ఎప్పటికప్పుడు నాశనం చేసేస్తుంటుంది. అందుకే పాపకు తరచూ రక్తహీనత వస్తోంది. సాధారణంగా ఒక ఎర్రరక్తకణం జీవితకాలం 120 రోజులు. కానీ ప్లీహం ఈ రక్తకణాలన్నింటినీ చాలా ముందుగానే నాశనం చేస్తుండటంతో వాటి సంఖ్య తగ్గిపోయి, తరచూ రక్తహీనత వస్తుంది. అందుకే చికిత్సలో భాగంగా బయటి నుంచి రక్తం ఎక్కిస్తున్నారు.
అలాగే ఉన్న రక్తకణాలు నాశనం కాకుండా కాపాడుకునేందుకు ప్లీహాన్ని కూడా తొలగించారు. ఇక పుట్టిన ఎర్రరక్తకణాలు త్వరత్వరగా నాశనమైపోతున్నాయి. కాబట్టి ఎముక మూలుగ/మజ్జ ఇంకా ఎక్కువెక్కువ ఎర్రరక్తకణాలను తయారు చేస్తుంటుంది. అది అవసరం కూడా. అందుకే దానికి కావాల్సిన మూలవనరులైన ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఐరన్ తదితరాలను మనం మాత్రల రూపంలో బయటి నుంచి ఇస్తుండాలి. దీనివల్ల పుట్టిన ఎర్రరక్తకణాలు ఎంతోకొంత సమర్థంగా ఉంటాయి. ప్లీహాన్ని తొలగించారు కాబట్టి ఒంట్లో నుంచి హానికారక/వ్యాధికారక సూక్ష్మక్రిముల వంటివి త్వరగా బయటకు పోవు. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే ముప్పు ఎక్కువ. దీన్ని నివారించేందుకు పాపకు తరచూ నెలనెలా పెనిడ్యూర్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇది చాలా అవసరం.
►ఇక మీ పాప విషయంలో ప్రతి రెండు నెలలకోసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సి రావడం ఇబ్బందికరమే. మామూలుగా ప్లీహం తొలగించిన తర్వాత కొందరిలో రక్తం ఎక్కించాల్సిన అవసరమే తలెత్తదు. కానీ సమస్య తీవ్రంగా ఉన్న కొద్దిమందిలో మాత్రం ఇలా తరచూ రక్తం ఎక్కించాల్సి వస్తుంటుంది.
►తరచూ రక్తం ఎక్కిస్తున్నప్పుడు ఒంట్లో నుంచి ఇనుమును తొలగించే మందులు వాడుకోవడం తప్పనిసరి. ఎందుకంటే రక్తం ఎక్కించిన ప్రతిసారీ దాదాపు 100–150 మి.గ్రా. ఇనుము మన శరీరంలో పేరుకుపోతుంది. దీన్ని తొలగించేందుకు పాపకు నిత్యం మందులు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇనుము... కాలేయం, గుండె వంటి అవయవాల్లో పేరుకుపోయి వాటిని దెబ్బతీస్తుంది.
►నిజానికి జన్యుపరంగా వచ్చే ఇలాంటి వ్యాధులన్నింటికీ రక్తం ఎక్కించడం తప్పించి, ఇతరత్రా చికిత్స ప్రక్రియలు తక్కువనే చెప్పాలి. ఇలాంటి వారికి కచ్చితమైన చికిత్స ఎముక మూలుగ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్). మిగతా చికిత్సలన్నీ సమస్యను నియంత్రణలోకి తెచ్చేందుకే. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని రక్తవ్యాధుల నిపుణుడిని సంప్రదించండి.
పచ్చకామెర్లకు కారణం ఏమిటి? జాగ్రత్తలు చెప్పండి
మా బాబుకు పదమూడేళ్లు. అతడికి ఈ మధ్య పచ్చకామెర్లు వచ్చాయి. దయచేసి దానికి కారణాలు, జాగ్రత్తలతోపాటు వీలైతే నివారణోపాయాలు కూడా చెప్పగలరు.
రక్తంలోని ఎర్ర రక్తకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురుబిన్ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురుబిన్ పరిమాణం రెట్టింపు అవ్వడం వల్ల వచ్చేవే పచ్చకామెర్లు. వీటినే జాండిస్ అని కూడా అంటారు. కామెర్లు వచ్చిన వారి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. పచ్చకామెర్లు వ్యాధి కాదు. ఇది వ్యాధి తాలూకు ఒక లక్షణం. మనం సాధారణంగా బాధపడే పచ్చకామెర్లు మన శరీరంలోని కాలేయం అనే అవయవం సూక్ష్మజీవుల బారిన పడటం వల్ల వస్తుంది. ఇది రావడానికి మూడు ముఖ్య కారణాలు.
అవి...
1) రక్తంలో ఎర్రరక్తకణాలు అత్యధికంగా విచ్ఛిత్తికావడం. దీన్ని హీమోలిటిక్ జాండీస్ అంటారు.
2) ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి వల్ల చోటు చేసుకున్న బిలురుబిన్ లివర్ కణాలలోకి చేరలేకపోవడం. దీన్ని ‘హెపాటిక్ జాండీస్’ అంటారు.
3) లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్) ప్రవాహమార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవడం. దీన్ని ‘అబ్‌స్ట్రక్టివ్ జాండిస్’ అంటారు. లివర్ ఇన్ఫెక్షన్‌కు గురైనట్లయితే ‘హెపటైటిస్’ అని వ్యవహరిస్తారు. హెపటైటిస్ కేసుల్లో హెపాటిక్ జాండిస్ చోటుచేసుకుంటుంది.
హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు:
►ఇన్ఫెక్షన్
►ఆల్కహాల్
► పౌష్టికాహార లోపం. ఇన్ఫెక్షన్ పరంగా ఐదు రకాల వైరస్‌లను గుర్తించారు. ఇవి... హెపటైటిస్ ఎ, బి, సి, డి.
చికిత్స: నీటి ప్రభావానికి లోనై వచ్చే వ్యాధులలో పచ్చకామెర్లు వ్యాధి ఒకటి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సత్వర నివారణ చర్యలు చేపట్టకుంటే ఇది మన శరీరంలోని అత్యంత ప్రధాన భాగమైన కాలేయాన్ని పనిచేయకుండా చేసి పరిస్థితిని మరింత విషమింపజేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ వ్యాధి వస్తే మళ్లీ రాకూడదన్న నియమం లేదు. దీని నివారణకు ఆహారంలోని కొన్ని నియమాలు పాటించాలి.
►ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడబోసి, చల్లార్చి వాడటం మంచిది. లేదా ఫిల్టర్ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు.
►పచ్చకామెర్లు వ్యాధి సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణం కానివి ఏవీ వాడకూడదు.
►మజ్జిగ బాగా వాడాలి. కొబ్బరినీళ్లు తాగాలి. అరటిపండ్లు బాగా తినాలి.
►మాంసాహారులు మాంసానికీ, చేపలకు దూరంగా ఉండాలి.
►గోంగూరకు దూరంగా ఉండాలి.
ఆవకాయ, మాగాయ లాంటి పచ్చళ్లకు కొన్నాళ్లు వాటికి దూరంగా ఉండాలి.
కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు.
డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీసీనియర్ హిమటాలజిస్ట్, హిమటో ఆంకాలజిస్ట్,
బీఎమ్‌టీ స్పెషలిస్ట్, స్టార్ హాస్సిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment