మోదీ కొత్త కేబినెట్‌లో 10 శాతానికి పైగా మహిళా మంత్రులు ఉన్నప్పటికీ... అదా విషయం! ఆరుని మూడుకు తగ్గించడం గురించి కదా.. మరో సుష్మను కేబినెట్ హోదాలోకి తీసుకోకపోవటం గురించి కదా.. ఇప్పుడు మాట్లాడుకోవలసింది!
మాధవ్ శింగరాజు
రాష్ట్రపతి భవన్‌లో గురువారం సాయంత్రం కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మహిళల్లో సుష్మా స్వరాజ్ లేరు! మంత్రివర్గంలో ఆమె లేకపోవడం ఏంటని కాదు ఆశ్చర్యం. ఆమె లేకుండా ఎలా అని! ‘మిస్ యూ సుష్మాజీ’ అని పార్టీలతో నిమిత్తం లేకుండా దేశ నాయకులు, దేశ ప్రజలు ఆమెకు ఇప్పటికీ ట్వీట్‌లు పెడుతూనే ఉన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమే సుష్మను క్రియాశీలక రాజకీయాలకు దూరం చేసినప్పటికీ అది ఏమాత్రం సంభవించవలసిన పరిణామం కాదనే భావన ఈ దేశ ప్రజలు, పూర్వపు మంత్రి వర్గ సహచరులలోనూ ఉంది.మోదీ కొత్త ప్రభుత్వంలో శుక్రవారం నాడు విదేశాంగ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యం జైశంకర్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘‘సుష్మాజీ అడుగుజాడల్లో నడవడాన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
మంత్రిగా ఆయన పెట్టిన తొలి ట్వీట్ అది. ప్రస్తుత మంత్రివర్గంలో సుష్మాస్వరాజ్ కూడా ఉండి ఉంటే మోదీ రెండో ఆలోచన లేకుండా ఆమెకు విదేశాంగ శాఖనే ఇచ్చి ఉండేవారు. గత ఐదేళ్లలో విదేశాంగ మంత్రిగా సుష్మ భారతదేశ దౌత్య సంబంధాలను చక్కబరచడం ఒక్కటే అందుకు కారణం కాదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖలతో కలిసి ఎన్నారై బాధిత భార్యల కోసం ఆమె చక్కటి పరిష్కార విధానాలను రూపొందించారు. ఎన్నారై భర్తలపై స్వదేశంలోనూ, ప్రవాసంలోనూ ఉన్న భార్యలు చేసిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిశీలించి, ఆగడాల భర్తల్ని పట్టి తేవడం కోసం తన యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. ఉపాధి కోసం వలసవెళ్లి బందీలైన వారికి ఒకే ఒక ట్వీట్‌తో తక్షణ విముక్తి కల్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమెకు ‘దేశ ప్రజల ప్రియతమ మంత్రి’ అనే గుర్తింపునిచ్చా యి. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఆమెను భారతదేశపు ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’ అని కీర్తించింది.
అరవై నాలుగేళ్ల ఏళ్ల వయసులో 2016 నవంబరులో మధుమేహం తీవ్రం కావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ‘ఎయిమ్స్’ ఆసుపత్రిలో సుష్మ అడ్మిట్ అయ్యారు. ఆ వివరాలను ట్వీట్ చేస్తూ.. కిడ్నీ ఫెయిల్ అవడంతో తనకు డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారని ఆమె వెల్లడించినప్పుడు అనేక మంది తమ కిడ్నీ ఇస్తామని ముందుకు వచ్చారు! ‘మేడమ్.. మీకు సమ్మతమైతే నా కిడ్నీని డొనేట్ చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేశానికి మీ సేవలు అత్యవసరం’ ఒక యువకుడు ట్వీట్ చేశాడు. జమ్మూలో ఇంజనీరింగ్ చదువుతున్న 24 ఏళ్ల ఖేమ్‌రాజ్ శర్మ అయితే తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ‘‘విదేశాల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది భారతీయులను ఆమె కాపాడారు. ఆదివారాలు కూడా ఆమె మంత్రిత్వ శాఖ కార్యాలయం తెరిచే ఉండేది. సుష్మ చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా నేను నా కిడ్నీ ఇవ్వాలని ఆశపడుతున్నాను’’ అని శర్మ బీబీసీ ప్రతినిధితో అన్నారు. వాటన్నిటికీ ఒకే సమాధానంగా.. ‘‘ఫ్రెండ్స్.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.
మాటలు రావడం లేదు. మీ అందరికీ ధన్యవాదాలు’’ అని సుష్మ ట్వీట్ చేశారు. ఆ ఏడాది డిసెంబరులో సుష్మకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి జరిగింది. మరింత ఆరోగ్యకరమైన పరిసరాల పరిశుభ్రత అనివార్యం కావడంతో తనిక పోటీ చేయబోవడం లేదని ఎన్నికలకు కొన్ని నెలల ముందే సుష్మ ప్రకటించారు. సర్జరీ తర్వాత కూడా రెండేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించిన సుష్మ.. విదేశాల్లో నిస్సహాయ స్థితిలో ఉండిపోయి, సహాయం కోసం చేతులు చాచిన ఎందరినో ఒక తల్లిలా జన్మభూమి ఒడిలోకి తీసుకున్నారు. సుష్మ ఇంతగా తన ప్రభావాన్ని చూపించబట్టే కేంద్ర మంత్రివర్గంలో ఈసారి మహిళలకు దక్కని సముచిత స్థానం గురించి కాకుండా, మంత్రివర్గంలో సుష్మ లేకపోవడం అనే విషయమే ప్రాముఖ్యాంశం అయింది. 78 మంది మహిళా ఎంపీలు ఉన్న ప్రస్తుత లోక్‌సభలో మహిళలకు మోదీ ఇచ్చిన కేబినెట్ హోదాలు మూడంటే మూడు మాత్రమే! స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్, హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్.
ఈ ముగ్గురూ గత లోక్‌సభలోనూ కేబినెట్ మంత్రులుగా ఉన్నవారే. అప్పట్లో వీరితో పాటు సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, ఉమాభారతి.. మొత్తం ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ఉండేవారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, అనుప్రియా పటేల్ సహాయ మంత్రులుగా ఉండేవారు. మొత్తం ఎనిమిది మంది. ఆరు కేబినెట్ హోదాలు. రెండు సహాయ పదవులు. అదిప్పుడు మూడు కేబినెట్ హోదాలు, మూడు సహాయ పదవులుగా కుదించుకుపోయింది. 64 మంది మహిళా ఎంపీలు ఉన్న గత లోక్‌సభతో పోలిస్తే అంతకంటే పద్నాలుగు మంది మహిళా ఎంపీలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత లోక్‌సభలో ఉండాల్సిన మహిళా మంత్రుల సంఖ్య మరీ ఆరైతే కాదు. గత లోక్‌సభలో సుష్మతో సమానంగా మహిళా సంక్షేమం కోసం పని చేసిన మేనకా గాంధీని ప్రస్తుతానికి మోదీ పక్కన ఉంచారు.
గంగాజల ప్రక్షాళన సేవలకు తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్న ఉమాభారతి తనంతట తనే తప్పుకున్నారు. సహాయమంత్రి అనుప్రియా పటేల్ మళ్లీ అదే హోదాలో కొనసాగేందుకు ఆసక్తి చూపలేదు. సహాయ హోదాలోకి మునుపు అదే హోదాలో ఉన్న సాధ్వి నిరంజన్ జ్యోతితో పాటు కొత్తగా రేణుకా సింగ్ సరితను, దేవశ్రీ చౌదరిని తీసుకున్నారు. పాత లోక్‌సభలో 6+2 గా ఉన్న మహిళా మంత్రులు కొత్త లోక్‌సభలో 3+3 అయ్యారు. జాతీయవాద మోదీ ప్రభుత్వానికి ‘మానవీయ’ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన సుష్మాస్వరాజ్ ఇప్పుడు మంత్రివర్గంలో లేని కారణంగా ఆమెపై పడుతున్న ఫోకస్.. మోదీ మంత్రివర్గంలో మహిళల సంఖ్య సగానికి సగం తగ్గడం అనే అంశాన్ని అవుట్ ఫోకస్ చేస్తోందని చెప్పడం కాదిది. కొత్తగా ఎన్నికైన లోక్ సభ మహిళా ఎంపీలలో సుష్మాస్వరాజ్‌లు లేకుండా పోరు.
లేకున్నా, బాధ్యతలు అప్పగిస్తే తయారవుతారు. 1977లో దేవీలాల్ సుష్మపై నమ్మకం ఉంచి పాతికేళ్ల వయసులో ఆ కొత్తమ్మాయికి కేబినెట్ బాధ్యతలు అప్పగించినట్లే మోదీ కూడా కొత్త మహిళా ఎంపీలలో కనీసం మరో ముగ్గురికైనా కేబినెట్ హోదాను ఇస్తే దేశ ప్రయోజనాలకు అవసరమైన శక్తి సామర్థ్యాలు నిరూపితం కావా! 543 మంది సభ్యులున్న లోక్‌సభలో 80 వరకు మంత్రుల్ని తీసుకోవచ్చు. కేబినెట్‌లో ఇప్పుడు 58 మంది ఉన్నారు. ఫస్ట్ టైమ్ మహిళా ఎంపీలలో సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రేణుకా సింగ్, దేవశ్రీ చౌదరి, కాకుండా బీజేపీలో ఫస్ట్ టైమ్‌లు ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్లు కాకున్నా సీనియర్‌లు ఉన్నారు. వాళ్లలోంచి తీసుకోవచ్చు. తీసుకుం టారా?! ∙
Comments
Please login to add a commentAdd a comment