
షర్మిలా టాగోర్, కరీనా కపూర్
అత్తగారూ కోడలూ టీవీల్లో ఒకరినొకరు హింసించుకోవడం కనిపిస్తుంది. నిజ జీవితంలో వారు సఖ్యంగా ఉండరనే అపవాదు ఉంది. కాని ఒక సెలబ్రిటీ కోడలు తన సెలబ్రిటీ అత్తగారితో ఒక రేడియో షో నిర్వహించడం చాలామందిని ఆకట్టుకుంది. ‘ఇష్క్’ రేడియో 104.8 ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో ప్రసారం అవుతోంది. ఇందులో కరీనా కపూర్ ‘వాట్ ఉమెన్ వాంట్’ (స్త్రీలకు ఏమి కావాలి?) అనే షో చేస్తోంది. మొదటి సీజన్ ముగిసి రెండో సీజన్ ప్రారంభం కాగా మొదటి ఎపిసోడ్‌లో తన అత్తగారూ సైఫ్ అలీ ఖాన్ తల్లి అయిన షర్మిలా టాగోర్‌తో సంభాషించింది. పది నిమిషాలకు పైగా సాగిన ఈ షోను యూ ట్యూబ్ ప్రచారం కోసం వీడియోగా కూడా అందుబాటులో ఉంచారు. కరీనా, షర్మిలా పక్కపక్కన కూచుని మాట్లాడుకోవడం అభిమానులను కుతూహలపరిచింది.
‘మీరు స్త్రీగా మీ కెరీర్‌ను కుటుంబాన్ని ఎలా అనుసంధానించుకున్నారు’ అని కరీనా అడిగితే ‘నా సినిమాలను మానుకోవడం ద్వారా’ అని షర్మిలా సమాధానం ఇచ్చారు. ‘పని చేసే భార్ య ఉన్నప్పుడు ఇంట్లో ఉండే భర్త– అంటే హౌస్ హజ్బెండ్స్ ఉండటం మన సమాజం అంగీకరించదు. అలా భర్తను ఇంట్లో ఉంచితే భార్యను తప్పుగా చూస్తుంది. స్త్రీలు అలా తప్పుగా చూడబడటాన్ని అంగీకరించరు. కనుక తాము ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ భర్తను పనికి పంపుతారు. నేను కూడా అలాగే చేయాల్సి వచ్చింది’ అని షర్మిలా అన్నారు. ‘కూతురికి కోడలికి తేడా ఏమిటి?’ అని కరీనా అడిగితే ‘కూతురు గురించి మనకు తెలిసి ఉంటుంది. కోడలి గురించి తెలియదు. మెల్లగా తెలుసుకోవాలి. అందుకు సమయం వెచ్చించాలి.
ఓర్పు వహించాలి’ అని షర్మిల చెప్పారు. ‘కోడలిగా అడుగుపెట్టినప్పుడు నేను కూడా ఇబ్బంది పడ్డాను. నేను బెంగాలీని రైస్ తింటాను. టైగర్ (పటౌడి–భర్త) వాళ్లు రొట్టె తింటారు. నాకు చేపలు ఇష్టం. టైగర్‌కు ఇష్టం ఉండదు. ఇవన్నీ నడిచాయి. వీటిని అత్తాకోడళ్లు ఇద్దరూ అర్థం చేసుకోవాలి’ అని ఆమె అన్నారు. ఇద్దరూ కరీనా కుమారుడు తైమూర్ గురించి సోషల్ మీడియా ప్రదర్శిస్తున్న అటెన్షన్ గురించి కొద్దిగా ఆందోళన పడ్డారు. ‘మీ (నలుగురు) మనమలలో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం’ అని షర్మిలను అడిగితే ‘అమ్మో... ఒకరినని ఎలా చెప్పడం.. నలుగురూ నాలుగు విధాలా ఇష్టం’ అని చెప్పారామె. సైఫ్–అమృతాసింగ్‌ల కుమార్తె అయిన సారా ఇప్పుడు హీరోయిన్‌గా సఫలం కావడం పట్ల షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. అత్తాకోడళ్ల ఈ సంభాషణలో ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడుకోవడం మంచి విషయంగా అనిపించింది. చాలామంది ఇలాగే ఉంటారని ప్రచారం చేయాల్సిన అవసరం కూడా కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment