
ప్రిన్సెస్ డయానా పుట్టిన ముప్పైఏళ్లకు జన్మించిన క్రిస్టెన్ స్టెవార్ట్ ఇప్పుడు తన ముప్పై ఏళ్ల వయసులో డయానా ముప్పై ఏళ్ల వయసులోని పాత్రను పోషించబోతున్నారు. ఈ విషయాన్ని ఇంతకన్నా సరళంగా చెప్పాలంటే... ప్రిన్స్‌చార్లెస్‌తో తన దాంపత్యం సవ్యంగా లేదని డయానా గ్రహించిన ఒకనాటి వీకెండ్ చుట్టూ కథను నిర్మించుకుని చిలీ దర్శకుడు పాబ్లో లారెయిన్ తీస్తున్న ‘స్పెన్సర్’ అనే చిత్రంలో క్రిస్టెన్ కథానాయికగా నటిస్తున్నారు. 20 ఏళ్ల వయసులో ప్రిన్స్ చార్లెస్‌తో డయానాకు పెళ్లయింది.
తర్వాత పదేళ్ల కన్నా తక్కువ కాలంలోనే భర్తతో మానసికంగా ఆమె బంధం తెగిపోయింది. తెగిందని రూఢీ అయిన ఆ శని, ఆది వారాలలో డయానా మానసిక స్థితిని ఈ సినిమాలో క్రిస్టెన్ ప్రతిఫలింప జేయబోతున్నారు. బ్రిటన్ యువరాణిగా అభినయించనున్న ఈ అమెరికన్ నటి తన అత్యద్భుతమైన ప్రదర్శనను అలవోకగా ఇవ్వగలదని లారెయిన్ నమ్ముతున్నారు. బహుశా ఆ నమ్మకం రెండు కారణాల వల్ల ఆయనకు కలిగి వుండొచ్చు. ఒకటి స్టీవెన్ నైట్ స్క్రిప్టు ఇంకోటి క్రిస్టెన్ నవ్వు. ఆమె నవ్వితే అచ్చు నవ్వీనవ్వకుండా డయానా నవ్వినట్లే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment