అవునన్నా... కాదన్నా..! | law to protect against family violence | Sakshi
Sakshi News home page

అవునన్నా... కాదన్నా..!

Published Tue, Feb 20 2018 12:01 AM | Last Updated on Tue, Feb 20 2018 12:01 AM

 law to protect against family violence - Sakshi

ప్రతీకాత్మక చిత్రం 

‘‘నేను నీ అన్నయ్యనే కదా?!’’ ‘‘అవునన్నా..’’ ‘‘నేను తెచ్చిన సంబంధం చేసుకుంటావా? లేదా?’’ ‘‘కాదన్నా..’’ ‘అవునన్నా, కాదన్నా ఇంట్లో వాళ్లు చెప్పిందే చెయ్యాలి. తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా జీవించాలి..’ అని ఏ మహిళా అనుకోకూడదు.  కుటుంబ హింస నుంచి కాపాడేందుకు ఆమెకు అండగా చట్టం ఉంది.  ఇది అందరూ తెలుసుకోవాలి.  హింస పెట్టేవాళ్లు, హింస పడేవాళ్లూ.. తెలుసుకోవాలి. 

ఇంట్లోకి వెళ్తున్న దీపను ఉక్రోషంగా, కోపంగా చూస్తున్నాడు శ్రీను. దీప అన్నయ్య అతడు. ‘‘ఊ.. ఊ.. చూసింది చాల్లే.. నడువ్‌’’ శ్రీనును అదిలించారు పోలీసులు.  తల కిందికి దించుకుని ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టాడు శ్రీను. ఆ వెంటనే, దీపను అక్కున చేర్చుకొని బోరుమంది ఆమె తల్లి. ‘‘ఊరుకో అమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావ్‌? మీకే కష్టం కలగకుండా చూసుకుంటా!’’.. తల్లిని సముదాయిస్తూ చెప్పింది దీప. కూతురు మాటలకు ఆమె తండ్రి కళ్ల వెంట ఆనందబాష్పాలు రాలాయి.  ‘‘నాన్నా.. నువ్వు కూడానా?’’ అంది తన కళ్లనూ తుడుచుకుంటూ దీప. ‘‘వాడు నిన్ను ఇబ్బంది పెడ్తుంటే నేను అడ్డురాలేదు సరికదా.. కనీసం వాడిని మందలించే ధైర్యం కూడా చేయలేకపోయాన్రా.. నన్ను క్షమించరా తల్లీ.. ’’ కూతురు రెండు చేతులూ పట్టుకున్నాడు దీప తండ్రి. ‘‘ఛ.. అవేం మాటలు నాన్నా.. మీరు నన్ను ఆడపిల్ల అని చూడకుండా అన్నయ్యతో సమానంగా చూసి, మీ బాధ్యతను తీసుకునే హక్కు ఇస్తే చాలు నాన్నా.. ’’ అంది దీప. ఆనందోద్వేగంలో మాటలు రాక  బిడ్డను గుండెలకు హత్తుకున్నాడు ఆ తండ్రి.  అసలు ఆ ఇంట్లో దీప ఎంట్రీకి.. ఆమె అన్న శ్రీను ఎగ్జిట్‌కు కారణం ఏంటి?

అప్పుడే పెళ్లొద్దు
దీప, శ్రీనుల తండ్రి అచ్యుతరావు రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగి. తల్లి సుజాత.. గృహిణి. ఆ ఇల్లు అచ్యుతరావు కట్టిందే. పిల్లలు ఆలస్యంగా పుట్టారు. పైగా శ్రీనుకు, దీపకు మధ్య అయిదేళ్లకు పైగా అంతరం ఉంది. అచ్యుతరావు రిటైరయ్యేనాటికి శ్రీను చదువు మాత్రమే అయింది. దీప డిగ్రీలోకి రాగానే ఆయన పదవీవిరమణ సమయం వచ్చేసింది. దాంతో శ్రీను ఆర్థిక అండా ఆ కుటుంబానికి అవసరమైంది. ఉన్న కాస్త డబ్బును దీప పెళ్లి కోసం దాచి ఆమె చదువు బాధ్యతను కొడుకు మీద పెట్టాడు తండ్రి.దీప చదువులో చాలా చురుకు. పెద్ద చదువులు చదవాలనే ఆకాంక్ష కూడా ఉంది. ఈ క్రమంలో డిగ్రీ కాలేజ్‌ ఫస్ట్‌ వచ్చింది. పీజీకి అప్లయ్‌ చేసింది. సంబంధం తెచ్చాడు అన్న. ‘నాకు అప్పుడే పెళ్లి వద్దు.. చదువుకుంటాను’’ అంది. అదీగాక కాలుకు కొంచెం పోలియో ఉన్న పెళ్లి కొడుకును వెదికాడు.. అతనికి మంచి ఉద్యోగం ఉంది అని. అది అసలే నచ్చలేదు దీపకు. ఎంత చెప్పినా అన్నయ్య వినకపోవడంతో..  ‘‘పెళ్లి నా చాయిస్‌.. ఎప్పుడు చేసుకోవాలి? ఎలాంటివాడిని చేసుకోవాలి అనేది నేను డిసైడ్‌ చేసుకుంటాను. నాకిప్పుడే పెళ్లి ఆలోచనలు లేవు. నేను అందుకు ఇప్పుడు సిద్ధంగా లేను కూడా’’ అని స్పష్టం చేసింది దీప. ఆ మాటతో ఆ అన్న అహం దెబ్బతింది.  ‘‘ఏంటే.. నీ చాయిస్‌? నువ్వు డిసైడ్‌ చేసుకునేదేంటి? చదివిస్తుంది నేను.. నీ పెళ్లి చేయాల్సింది కూడా నేనే. మన అయ్య దాచిన సొమ్ము పెళ్లి టెంట్లకు కూడా సరిపోదు గుర్తుపెట్టుకో’ అని బెదిరించాడు శ్రీను. 

పిచ్చివేషాలు వెయ్యకు
‘‘చదివించినందుకు చాలా థ్యాంక్స్‌ అన్నయ్యా! పీజీ ఫ్రీ సీటే తెచ్చుకుంటాను. నా ఖర్చులకు పార్ట్‌టైమ్‌ జాబ్‌ చూసుకుంటాను. మంచి ఉద్యోగం తెచ్చుకున్నాక.. నువ్‌ నా చదువుకి పెట్టిన డబ్బు కూడా తీరుస్తా. కాని ఈ పెళ్లి చేసుకోమని బలవంతపెట్టకన్నయ్యా...’’ అని బతిమాలింది దీప. ‘‘నోర్ముయ్‌’’ అంటూ చెంప పగలకొట్టాడు శ్రీను.‘‘పిచ్చి వేషాలేస్తే.. కాళ్లు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతా’’ అని అరిచేశాడు. అతని ఉగ్ర రూపం, అహంకారం చూసి నివ్వెరపోయారు తల్లిదండ్రులు. అడ్డొస్తే వాళ్లనూ తోసేశాడు. ‘‘నేను వాళ్లకు మాటిచ్చాను. రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు. అదీ ఫార్మల్‌గా. దాదాపు పెళ్లి ఖరారు అయినట్టే. మర్యాదగా ఒప్పుకో. లేకుంటే బలవంతంగానైనా కట్టబెడ్తా’’.. హెచ్చరించాడు. ‘‘అంతదాకా వస్తే.. చావనైనా చస్తా.. కాని ఈ పెళ్లి చేసుకోను’’ అని అన్నకు చెప్పి ‘‘అమ్మా.. చెప్పమ్మా అన్నయ్యకు’’అని ప్రాధేయపడింది. కాని ఆ తల్లి నోటెంట మాటలేదు.. ఏడుపు తప్ప. ‘‘అమ్మా.. నాన్నా.. ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు. ఒకవేళ మీరూ దానికే వంత పాడితే జీవితంలో మీ మొహం చూడను. దాని బాధ్యత ఆవగింజంతైనా తీసుకోను’’.. తల్లిదండ్రులకూ అల్టిమేటమిచ్చాడు. ‘‘ఒరేయ్‌.. అలా అంటే ఎలారా.. నీ తోడబుట్టింది అది. కాస్త ఆలోచించు.. చదువుకుంటానంటోంది. చదివిద్దాం’’..నచ్చజెప్పబోయాడు తండ్రి. 

గదిలో పెట్టి తాళం!
‘‘చదివించుకోండి.. పెళ్లీ చేయండి.. ఈ క్షణమే నేను  ఇంట్లోంచి వెళ్లిపోతా’’.. బ్లాక్‌మెయిల్‌ చేశాడు శ్రీను.‘‘అంత మాటనుకురా.. ’’ అంది తల్లి బాధగా.‘‘పోతే పోనియ్‌ అమ్మా.. నేను చూసుకుంటా అన్నీ.. ’’ కళ్లు తుడుచుకుంటు అన్నది దీప. అంతే ఆ మాటకు విసురుగా వచ్చి ఆ అమ్మాయిని తన్నాడు శ్రీను. ‘‘చూసుకునేంత పెద్దదానివయ్యావా? చంపేస్తా చెప్పినట్టు వినకపోతే’ అంటూ ఆ అమ్మాయి మీద చేయి చేసుకొని విసావిసా ఆ పిల్లను లాక్కెళ్తూ గదిలో పెట్టి తాళం వేశాడు. కొడుకు ప్రవర్తనకు నిశ్చేష్టులయ్యారు తల్లిదండ్రులు. తేరుకొని వారించినా వినలేదు. ‘‘చెప్పినట్టు వింటే ఈ ఇంట్లో ఉంటుంది. మొండిపట్టు పడితే బయటకు గెంటేస్తా’’ అని చెప్పండి నీ కూతురికి’’ అంటూ బయటకు వెళ్లిపోయాడు శ్రీను. దీప గది తలుపులు బాదుతూనే ఉంది. కాసేపటికి సుజాత డూప్లికేట్‌ కీ తీసుకొచ్చి తాళం తీసి కూతురిని బయటకు పంపిచేసింది. అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు. 

కోర్టు ఆర్డర్స్‌!
ఇంటి నుండి బయటపడ్డ దీప సరాసరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్‌ ఇచ్చింది అన్న మీద. వెంటనే పోలీసులు దీపవాళ్లింటికి వెళ్లారు. అప్పుడే ఇంటికొచ్చిన శ్రీను పోలీసులను చూసి గతుక్కుమన్నాడు. తెల్లవారి పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలనే సమాచారం ఇచ్చి పోలీసులు వెళ్లిపోయారు. దీప ఆ రోజు తన స్నేహితురాలి హాస్టల్‌రూమ్‌లో తలదాచుకుంది. తెల్లవారి దీప కంప్లయింట్‌ను డైరెక్ట్‌గా డీవీ ఫోరమ్‌కు (విమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌కి) పంపారు పోలీసులు. కాలయాపన లేకుండానే దీపను ఇంట్లోనుంచి బయటకు గెంటేయకుండా వెంటనే ఆర్డర్స్‌ ఇచ్చారు. అదే సమయంలో తక్షణమే ఆ ఇంట్లోంచి బయటకు వెళ్లమనే ఆర్డర్స్‌ను శ్రీనుకూ జారీ చేసింది కోర్టు. అంతేకాదు మళ్లీ శ్రీను తన చెల్లెలి మీద దాడి చేస్తాడేమోనన్న ముందుచూపుతో దీపకు రక్షణ ఉత్తర్వులనూ ఇచ్చింది కోర్టు.

ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
మహిళలు తల్లిదండ్రులు, మెట్టినింటి వారి గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో తమపై జరుగుతోన్న హింసను బయటకి చెప్పరు.  సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, పోలీసుల తీరుపై నమ్మకం లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా బయటకి రాలేకపోతున్నారు.  ఇంట్లో సోదరుల నుంచి ఇలాంటి సమస్యలు ఎదురైనా ఏం చేయలేని స్థితిలో ఉంటున్నారు. దీనికి ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒకటే మార్గం. హింసను ఎదుర్కొనే ధైర్యం ఉండేలా మహిళలు సంసిద్ధులవ్వాలి. ఆటవిడుపుగానో లేక అభిరుచికి అనుగుణంగా ఏదైనా సంపాదించుకునేలా మహిళలు ఉండాలి. తమ కంటే చిన్నవారికి ట్యూషన్లు చెప్పడం తదితర మార్గాల ద్వారా సంపాదన వైపు అడుగేయాలి. దీని వల్ల వాళ్లలో తెలియని ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మహిళలు గౌరవంగా బతికేందుకు కావాల్సిన విద్యను తల్లి దండ్రులు వారికి అందించాలి. వారి శక్తి, సామర్థ్యాలు తెలుసుకునే విధంగా ఆ విద్య ఉండాలి.
– శృంగవరపు రచన,  జయహో ఆర్గనైజేషన్‌ ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్, రచయిత్రి
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement