స్త్రీలోక సంచారం | Women empowerment:Violence against children | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Tue, Jun 26 2018 12:11 AM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM

Women empowerment:Violence against children - Sakshi

::: సినిమాలు, రచనల ద్వారా ఇండో–ఫ్రెంచి సంబంధాల అభివృద్ధికి,  మహిళా సాధికారత కోసం, బాలలపై హింస నివారణకు కృషి చేస్తున్న నటి కల్కీ కేక్లాన్‌ ప్రతిష్ఠాత్మకమైన ‘నైట్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌’ అవార్డు అందుకున్నారు. గతంలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, షారుక్‌ఖాన్, ఐశ్వర్యారాయ్‌బచ్చన్‌ వంటి సినీ దిగ్గజాలకు లభించిన ఈ అవార్డును స్వీకరిస్తూ కల్కీ కేక్లాన్‌.. తనను రెండు దేశాల పౌరురాలిగా తీర్చిదిద్దిన తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ::: ప్రస్తుతం అన్ని రంగాల్లో, ప్రతి చోటా పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారని ‘స్టాటిస్టా, 2017’ తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే అన్ని రంగాల్లోని అన్ని విభాగాల్లో మహిళా ఉద్యోగులు తమ సమస్థాయి పురుష ఉద్యోగులకంటే తక్కువ వేతనాన్ని పొందుతున్నారని, ప్రమోషన్‌లు కూడా పురుషులకే ఎక్కువగా లభిస్తున్నాయని పేర్కొంటూ.. ఈ వివక్ష తొలగిపోడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టవచ్చని స్టాటిస్టా అభిప్రాయపడింది.

అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు ఆరాధ్య (6) భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తుందని.. గతంలో చిరంజీవి, రజనీకాంత్‌ల రాజకీయరంగ ప్రవేశంపై ముందే జోస్యం చెప్పిన జ్యోతిష పండితుడు డి. జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌లో ఆదివారం ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వెల్లడించారు. ఆరాధ్య కనుక ఈ దేశానికి ప్రధానమంత్రి అవాలని కోరుకుంటే ఆమె తన పేరును ‘రోహిణి’ అని మార్చుకోవలసి ఉంటుందని కూడా ఆయన అన్నారు ::: కశ్మీర్‌లో తన ప్రభుత్వానికి అకారణంగా మద్దతు ఉపసంహరించుకోవడమే కాక, తిరిగి తమ పైనే ఆరోపణలు గుప్పిస్తున్న బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాపై జమ్మూకశ్మీర్‌ (మాజీ) ముఖ్యమంత్రి, పీడీపీ పార్టీ అధ్యక్షురాలు అయిన మెహబూబా ముఫ్తీ.. ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. ఉమ్మడి ప్రభుత్వ ఎజెండాకు కట్టుబడి ఉన్నప్పటికీ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అదుపు చేయడానికి పీడీపీ ప్రభుత్వం సహకరించడంలేదన్న బీజేపీ ఆరోపణల్ని మెహబూబా వరుస ట్వీట్‌లతో తిప్పికొట్టారు ::: స్వల్పకాలిక ప్రసూతి సెలవులో ఉన్న 37 ఏళ్ల న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి, ఆ దేశ ‘లేబర్‌ పార్టీ’ నాయకురాలు అయిన జసిండా ఆర్డెర్న్‌.. ఆక్లాడ్‌ సిటీ ఆసుపత్రిలో గత గురువారం జరిగిన కాన్పు అనంతరం తొలిసారి ఆదివారం నాడు దేశ ప్రజలకు దర్శనమిచ్చారు.

తన కూతురికి ‘నేవే’అని పేరు పెట్టినట్లు ప్రకటిస్తూ, పదవీబాధ్యతల్లో ఉన్న మహిళలు బిడ్డకు జన్మనివ్వడమన్నది ఇక ఎంతోకాలం వింతా కాదు, విశేషమూ కాదు (నాట్‌ ఎ నావెల్టీ) అని చెప్పడానికే ‘నేవే’ అని నామకరణం చేసినట్లు వివరించారు ::: జీవనోపాధి కోసం వలస వస్తున్న కుటుంబాల్లోని పిల్లలను వేరు చేసి, వారిని ఉంచిన నిర్బంధ కేంద్రాలను సందర్శించేందుకు వెళుతూ, వీపుపై ‘ఐ రియల్లీ డోన్ట్‌ కేర్‌. డూ యూ’ అనే క్యాప్షన్‌ ఉన్న జాకెట్‌ను ధరించి ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిచ్చిన అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను ‘సాటర్‌డే నైట్‌ లైవ్‌’ షో వ్యాఖ్యాత అలెక్‌ బాల్డ్విన్‌ ఈ వారం షోకి ప్రత్యేక  అతిథిగా ఆహ్వానించారు. ఆమె ఏ ఉద్దేశంతో ఆ జాకెట్‌ను ధరించారో, ఆ జాకెట్‌పై ఉన్న కాప్షన్‌ అంతరార్థం ఏమిటో ఆ షోలో మెలానియా స్పష్టం చేసే అవకాశాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement