అమ్మకద్రోహం | women empowerment : Unfaithfulness story | Sakshi
Sakshi News home page

అమ్మకద్రోహం

Published Wed, Feb 21 2018 12:25 AM | Last Updated on Wed, Feb 21 2018 9:15 AM

women empowerment :  Unfaithfulness story - Sakshi

పెన్షన్‌కోసం వెళ్లేటప్పుడు కాసేపు కొత్త చీర చుడతారు. తిరిగొచ్చాక లాగేసుకుంటారు. తనను షెడ్డులో పారేస్తారు.

కడుపులో బిడ్డ తిరగబడితే  అమ్మ పొట్ట కోస్తారు. పెరిగిన బిడ్డ తిరగబడినా.. మళ్లీ అమ్మకే కోత! అది గుండెకోత! అమ్మకు బిడ్డపై ప్రేమ ఉంటుంది. అమ్మ ప్రేమకు నమ్మకద్రోహం చేసే బిడ్డలూ ఉంటారు!! అలాంటి కొడుకు కథ ఇది.  ‘పుత్రహింస’ పడిన ఓ అమ్మ వ్యథ ఇది!

‘‘సుచరితా.. అమ్మకు నెయ్యి తీసుకురా... ఇడ్లీ చల్లారిపోతోంది’’ కేకేశాడు ఆనంద్‌ భార్యను.  ‘‘అత్తయ్యా.. ఇదిగోండి’’ అంటూ పరుగుపరుగున వచ్చింది సుచరిత నెయ్యి తీసుకొని.  ఆ హడావుడి అంతా తనకు మామూలే అన్నట్టు ఏమీ పట్టించుకోకుండా తనకు కావల్సిందే తింటోంది సుధ.  టిఫిన్‌ తినడం అయ్యాక ‘తన ఇంట్లోకి’ వెళ్లబోతుంటే.. ‘‘అత్తయ్యా.. ఈ చీర కట్టుకోండి’’ అంటూ ఓ కొత్త చీరను చేతిలో పెట్టింది కోడలు. అదీ ఆశ్చర్యం అనిపించలేదు సుధకు. పెన్షన్‌ వెళ్లేప్పుడల్లా ఇలా  కొత్త చీర చేతిలో పెట్టడమూ పరిపాటే. ఎలాంటి భావమూ లేకుండా ఆ చీర తీసుకొని తన ఇంట్లోకి వెళ్లిపోయింది ఆ పెద్దావిడ. 

తన ఇల్లు ఏంటీ?
అవును. ఇందాక సుధ టిఫిన్‌ తిన్నది తన కొడుకు ఇంట్లో. ఇప్పుడు వెళ్తుంది ఆ ఇంటి ఆవరణలో ఉన్న తన ఇంటికి! రెండు గదుల రేకుల షెడ్డుకి. భర్త ఉన్నప్పుడు బాగా బతికిన సుధ.. ఆయన పోయిన ఈ అయిదేళ్ల నుంచి దాదాపు అనాథగానే జీవనం సాగిస్తోంది. కారణం.. ఆమె కొడుకు! భర్త గవర్నమెంట్‌ జాబ్‌. పెద్దగా ఆస్తులు కూడబెట్టకపోయినా.. ఉన్నదాంట్లో తనకేలోటూ రానివ్వలేదు. కొడుకునూ కష్టపడి చదివించాడు. మంచి ఇల్లు కట్టాడు. భవిష్యత్‌ ముందే ఊహించాడేమో ఆ ఇంటిని తన పేరుమీదే రిజిష్టర్‌ చేయించాడు. భర్త ఉన్నప్పుడు ఏ చింతా లేకుండా ప్రశాంతంగా గడిచింది. ఆయన హార్ట్‌ఎటాక్‌తో చనిపోయాడు. ఆయన బతికి ఉండగా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాదనలేదు. విడిగా ఉంటామన్నా వద్దనలేదు. తండ్రిపోగానే ఇల్లుచేరాడు. ఆపేక్షతో అనుకుంది కానీ, ఆశతో అని అంచనా వేయలేకపోయింది. యేడాదిలోనే ఆ కాంపౌండ్‌లో రేకుల షెడ్డు వేసి తల్లిని అందులోకి పంపించాడు. పూట పూటకు ఇంత తిండి పడేస్తారు అంతే.  మందులు మాకులు ఇతర అవసరాలేవీ చూడరు. తండ్రి పెన్షన్‌ను తల్లి అందుకునే రోజు మాత్రం ఆమెను ఇంటికి పిలిచి సకల మర్యాదలూ చేస్తారు. మూడు నెలలకో కొత్త చీర ఇచ్చి మళ్లీ తీసేసుకుంటారు. ఇప్పుడు జరిగిందీ అదే.. ఆమె పెన్షన్‌ తీసుకునే రోజు అది!

ఏటీఎమ్‌ కార్డు
దగ్గరుండి మరీ పెన్షన్‌ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు తల్లిని కొడుకు. డబ్బులు తీసుకొని వస్తూ తిరుగు ప్రయాణంలో అన్నాడు నెమ్మదిగా.. ‘‘అమ్మా.. ఇక నుంచి ఇలా ప్రతి నెలా వచ్చి అంతంత పెద్ద క్యూల్లో నిలబడి పెన్షన్‌ తీసుకోవాల్సిన కర్మ లేకుండా నీ అకౌంట్‌లోనే డబ్బు పడేట్టు చూస్తాను. ఏటీఎమ్‌ కార్డ్‌ కూడా తీసుకుందాం. నువ్వు ఓ సంతకం చేస్తే చాలు’’ అని! ఎప్పటిలాగే మారు మాటలేకుండా తలూపింది తల్లి. అన్నట్టుగానే నెల తిరిగేలోపు ఆ ఏర్పాట్లు అన్నీ చేశాడు కొడుకు. ఏటీఎమ్‌ కార్డూ వచ్చింది. అయితే అమ్మకివ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. 

అవుట్‌ హౌస్‌లో...
ఓ పని మీద అటుగా వచ్చిన సుధ చెల్లి కూతురు పెద్దమ్మను కలుద్దామని వాళ్లింటికి వచ్చింది. ఇల్లంతా కలియ తిరిగింది. ఆమాటా ఈ మాటా మాట్లాడుతూ పదిహేను నిమిషాలు గడిపింది. అయినా పెద్దమ్మ ఊసెత్తట్లేదెవ్వరు. దాంతో ‘‘ఏ వదినా.. పెద్దమ్మ ఏది? కనపడట్లేదు?’’ ప్రశ్నించింది సుధ చెల్లి కూతురు.  ‘‘అదీ... అత్తయ్యగారు.. మరి’’ అంటూ భర్త వైపు చూసింది నసుగుతూ! తల వంచుకున్నాడు అతను. ‘‘నానీ అవుట్‌ హౌజ్‌లో ఉంటది అత్తా’’ అన్నాడు సుధ మనవడు.  ‘‘అదేం టన్న య్యా.. పెద్దమ్మ అవుట్‌ హౌజ్‌లో ఉండట మేంటి?’’ అంటూ విస్తు పోయింది ఆమె. ‘‘అక్కడైతే అమ్మకు కంఫర్ట్‌ ఉంటుందని’’ నసిగాడు సుధ కొడుకు.  అతని మొహం వంకైనా చూడకుండా గాబరాగా పెద్దమ్మ ఉండే షెడ్డు వైపు పరిగెత్తింది సుధ చెల్లి కూతురు.  వెళ్లడంతోనే ‘‘పెద్దమ్మా’’ అంటూ పెనవేసుకుంది. ఒళ్లంతా కాలిపోతూ సోయిలేకుండా పడుంది సుధ.  ‘‘ఇదేంటి పెద్దమ్మా.. ఒళ్లంతా కొలిమిలా కాలిపోతోంది? జ్వరమా? ఎప్పటినుంచి? మందులు వేసుకుంటున్నావా లేదా?’’ ఆత్రం, కంగారు కలగలసి ప్రశ్నలు వేసింది.  వాటికి సుధ జవాబు చెప్పే పరిస్థితిలో లేదు. గ్రహించిన ఆ పిల్ల వెంటనే తన భర్తకు ఫోన్‌ చేసి పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లింది.  వాళ్లు తన తల్లిని అలా తీసుకెళ్తుంటే భయంతో ‘‘అయ్యో.. అమ్మకు జ్వరం వచ్చిన సంగతి నాకు తెలీదురా.. నేను తీసుకెళ్తాలే హాస్పిటల్‌కి. బావగారికెందుకు శ్రమ’’ అంటూ వచ్చాడు సుధ కొడుకు.  ‘‘ఇందులో శ్రమేముంది అన్నయ్యా.. పెద్దమ్మ నాకూ అమ్మ లాంటిదే. మా అమ్మ ఇలా అవుట్‌ హౌజ్‌లో జ్వరంతో పడి ఉంటే చూస్తూ ఊరుకోను కదా అన్నయ్యా.. పర్లేదు మేం చూసుకుంటాం’’అంటూ అతని మొహమ్మీదే కార్‌ డోర్‌ వేసేసింది ఆమె. 

హింస నుంచి విముక్తి
సుధ ఇప్పుడు తన భర్త కట్టించిన ఇల్లును అద్దెకు ఇచ్చి, ఆ డబ్బు, పెన్షన్‌ డబ్బుతో  ఓల్డేజ్‌ హోమ్‌లో హాయిగా, ప్రశాంతంగా సేద తీరుతోంది. ఎలా సాధ్యమైంది? తన చెల్లెలి కూతురు సలహాతో డొమెస్టిక్‌ వయొలెన్స్‌ ఆఫీస్‌లో కంప్లయింట్‌ ఇచ్చింది సుధ. విచారించిన ఆఫీసర్‌ కేస్‌ను కోర్టుకు పంపారు. సుధ పేరు మీదున్న ఇంటిని కొడుకు తక్షణం ఖాళీచేసి వెళ్లాలని, ఆమె ఏటీఎమ్‌ కార్డ్‌నూ ఆమెకు ఇచ్చేయాలని రెసిడెన్షియల్‌ ఆర్డర్స్‌ను జారీ చేసింది కోర్టు. సుధ లాంటి వాళ్లు పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌యాక్ట్‌ కింద కూడా కేస్‌ వేయవచ్చు.

ప్రాక్టికల్‌గా ఉండాలి
పెద్దవాళ్ల పట్ల నిర్లక్ష్యం, వివక్ష చదువుకోని కుటుంబాల్లోనే కాదు చదువుకున్న కుటుంబాల్లోనూ కనపడుతోంది. కారణం.. పెద్దతరం పిల్లల మీద ఆధారపడి ఉండడం. వాళ్ల బాధ్యత పిల్లలకు భారంగా మారడం. వృద్ధాప్యంలో పిల్లలే కదా తమల్ని చూసుకునేది అని కష్టపడి సంపాదించిందంతా పిల్లల పేరు మీద రాసేసి శేష జీవితాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి పట్టెడు అన్నం కోసం ఎదురుచూడ్డం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. అలాకాకుండా ప్రేమను, ప్రాక్టికాలిటీని వేరువేరుగా చూడాలి. తాము సంపాదించింది అంతా పిల్లల చేతుల్లో పెట్టకుండా పిల్లల వాటాతో పాటూ తామూ ఓ వాటా వేసుకోవాలి. వీలైతే తమ వాటా కింద కొంత ఎక్కువే ఉంచుకోవాలి.  ప్రతి పేరెంట్స్‌ రిటైర్‌మెంట్‌ లైఫ్‌ను పిల్లల మీద ఆధారపడకుండానే ప్లాన్‌ చేసుకోవాలి. అంతా ఇచ్చేసి తర్వాత చట్టం ప్రకారం హక్కును పొందెందుకు కోర్టు చుట్టూ తిరిగి ప్రశాంతతను కోల్పోయేకంటే ముందు జాగ్రత్త తీసుకొని హాయిగా శేషజీవితాన్ని గడపడం మంచిది.
– కళ్యాణ్‌ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌  
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement