ఆత్మ నుంచి ప్రాణం పుడుతుంది
ప్రశ్నోపనిషత్
పిప్పలాద మహర్షి దగ్గరకు వెళ్లిన ఆరుగురు ఋషులలో మొదటివాడు కబంధి ‘మానవులంతా ఎక్కడి నుంచి పుడుతున్నారు?’ అనే ప్రశ్న అడిగాడు. సమాధానం తెలుసుకున్నాడు. రెండోవాడు భార్గవుడు ‘ఒక ప్రాణిని ఎంతమంది దేవతలు పోషిస్తున్నారు’ అని అడిగితే ప్రాణశక్తియే అన్నిటికీ మూలం అని సమాధానం వచ్చింది. వెంటనే కోసల దేశానికి చెందిన అశ్వలాయనుడు ‘గురుదేవా! ప్రాణం ఎక్కడ నుండి పుడుతోంది? అది శరీరంలోకి ఎలా వస్తోంది? శరీరంలో తనకు తాను అయిదు భాగాలుగా విభజించుకుని ఎలా ఉంటోంది? ఎలా శరీరంలో నుంచి వెళ్లిపోతోంది? ప్రాణశక్తి వెలుపలి ప్రపంచాన్ని, లోపలి ప్రపంచాన్ని ఎలా కాపాడుతోంది? అని వరుసగా అయిదు ఉపప్రశ్నలు ప్రాణశక్తి ఉత్పత్తి, వికాసం, నిష్ర్కమణల గురించి చకచకా అడిగాడు.
ఆశ్వలాయనుడి ఉత్కంఠ, హడావిడి చూసి పిప్పలాద మహర్షి చిరునవ్వుతో ‘ఓ కౌసల్యా! నువ్వు చాలా కఠినమైన ప్రశ్నలు అడిగావు. నువ్వు బ్రహ్మిష్ఠుడివై బ్రహ్మజ్ఞానాన్ని జిజ్ఞాసతో అడిగావు కనుక నీకు సమాధానం చెబుతాను. శ్రద్ధగా విను. అర్థం చేసుకో’ అని చెప్పడం ప్రారంభించాడు.
‘నాయనా!
ఆత్మ నుంచి ప్రాణం పుడుతుంది. ప్రతి జీవినీ తన నీడ తనను అనుసరించినట్లు ఆత్మ వెంట ప్రాణం ఉంటుంది. మనస్సు ప్రమేయంతో ప్రాణం శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక చక్రవర్తి ఆయా ప్రాంతాలను పరిపాలించడానికి అధికారులను నియమించినట్టు మహాప్రాణశక్తి తనలో నుండి అయిదు విభాగాలను వేరువేరు పనులకు నియమిస్తుంది. కొన్ని బాధ్యతలు తానే స్వయంగా నిర్వహిస్తుంది. మలమూత్ర విసర్జన అవయవాల బాధ్యతను ‘అపానవాయువు’ చూసుకుంటుంది. కన్ను, చెవి, ముక్కు, నోరు జ్ఞానేంద్రియాల బాధ్యతను తానే స్వయంగా నిర్వహిస్తుంది.
దీనినే ‘ప్రాణవాయువు’ అంటాం. శరీరం మధ్య భాగంలో ఆహార స్వీకరణ, వినియోగం, శరీరం మొత్తానికి సమానంగా చేర్చడం బాధ్యతగా చూసుకోవడానికి నియమింపబడిన దాని పేరు ‘సమాన వాయువు’ ఈ సమాన వాయువు నుండి ఏడు రకాల జ్వాలలతో అగ్ని ఏర్పడుతుంది. దీనినే ‘జఠరాగ్ని’ అంటారు.
నాయనా! ‘ఆత్మ’ దేహంలోని హృదయంలో ఉంటుంది. ఆ హృదయం నుంచి నూటొక్క నాడులు శరీరం అంతా వ్యాపిస్తాయి. ఒక్కొక్క నాడికి వంద ఉపనాడులు ఉంటాయి. ఒక్కొక్క ఉపనాడికి డెబ్బయి రెండు వేల శాఖలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన అన్ని నాడుల్లోనూ సంచరించే ప్రాణశక్తిని ‘వ్యానవాయువు’ అంటారు. ఈ నాడుల్లో ఒక నాడి ఊర్ధ్వముఖంగా పైకి ప్రయాణిస్తుంది. అది ప్రాణులను పైకి తీసుకువెళుతుంది. అందులో సంచరించే ప్రాణశక్తిని ‘ఉదాన వాయువు’ అంటారు. ఇది పుణ్యం చేసిన వారిని పుణ్యలోకాలకు, పాపం చేసినవారిని పాప లోకాలకు తీసుకుపోతుంది. పాపపుణ్యాలు రెండూ చేసిన వారిని మనుష్య లోకానికి చేరుస్తుంది.
కౌసల్యా! మన కంటికి కనపడే సూర్యుడే బాహ్య ప్రాణశక్తి. ఆయన జీవుల కళ్లల్లో కాంతిరూపంలో ఉంటాడు. అదే జీవశక్తి. భూమిపై ఉన్న దైవశక్తి ప్రాణులలో ఉన్న ‘అపానశక్తి’ని అదుపులో పెడుతూ ఉంటుంది. ఆకాశం ‘సమాన వాయువు’ను నడిపిస్తూ ఉంటుంది. సర్వత్రా వ్యాపించిన ప్రాణశక్తి ‘వ్యానవాయువును’ నియంత్రిస్తూ ఉంటుంది. ‘ఉదానవాయువు’ను అగ్ని గమనిస్తూ ఉంటుంది. ఈవిధంగా పంచభూతాలు ప్రాణశక్తి బాహ్యరూపాలుగా బాధ్యతలు వహిస్తాయి. ఉదాన వాయవును చూసే అగ్ని ఏ ప్రాణిలో నశించిపోతుందో ఆ జీవి ఇంద్రియాలు వెంటనే మనస్సులో కలిసిపోతాయి. అతడు మళ్లీ జన్మించే ప్రక్రియ మొదలవుతుంది.
జీవి తాను మరణించేటపుడు తన మనసులో ఉన్న ఆలోచనతో తిరిగి అవయవాలుగా విడిపోయి కొత్త శరీరంలో ప్రాణం పోసుకుంటాడు. ‘ఉదాన ప్రాణశక్తి’ జీవుణ్ణి అతడు సంకల్పించిన చోటుకు తీసుకువెళుతుంది. నాయనా! నేను చెప్పిన క్రమంలో ప్రాణశక్తి ఉత్పత్తి వికాసాలను తెలుసుకున్న వారి వంశం పరంపరగా వర్ధిల్లుతుంది. నశించకుండా శాశ్వతమై కొనసాగుతుంది. దాన్ని గురించి చెప్పే శ్లోకం విను -
ఉత్పత్తి మాయతిం స్థానం, విభుత్వం చైవ పంచధా, ప్రాణస్య విజ్ఞాయామృత మశ్నుతే, విజ్ఞాయామృత మశ్నుత ఇతి. ప్రాణశక్తి ఉత్పత్తిని, వికాసాన్ని, స్థానాలను, ప్రాధాన్యాన్ని, కార్యకలాపాలను తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని తప్పక పొందుతాడు. ముమ్మాటికీ ఇది సత్యం. తెలుసుకో’’ అని పిప్పలాద మహర్షి చెప్పిన ప్రాణశక్తి విశేషాలను అందరూ శ్రద్ధగా విన్నారు. నాలుగవవాడు గార్గ్యఋషి మనిషిలోని జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలను గురించి అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం వస్తుందో వచ్చేవారం చూద్దాం.
- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్