తామరపూల కొలను!
తొంబై ఏళ్ల హంగ్ యాంగూ్యు (చైనా)లో వయసు తాలూకు బడలిక ఏరోజూ కనిపించదు. చురుకుదనానికి నిలువెత్తు రూపంలా ఉంటాడు.
‘‘కారణం ఏమిటి? ఆ రహస్యం మాకు కూడా చెప్పవచ్చు కదా!’’ అని అడిగితే చూపుడు వేలిని తన బొమ్మల వైపు చూపిస్తాడు. తాను రాసిన కవితలను కాస్త గట్టిగానే వినిపిస్తాడు. ‘‘చురుకుదనానికి, బొమ్మలకు సంబంధం ఏమిటి?’’ అనే డౌటు వచ్చే లోపు ‘కళ’ లోని ఔన్నత్యం గుర్తుకు వస్తుంది. మనలో ‘కళ’ జీవించినంత కాలం దేనికి లోటు? ఎప్పుడూ చురుగ్గానే ఉంటాం కదా! యాంగ్యూ స్కూలు చదువు పెద్దగా చదువుకోలేదు. కానీ ‘ఆర్ట్ స్కూల్’ కు మాత్రం ఒక్క పూట కూడా గైర్హాజరు కాకపోయేవాడు.
అతడు చిత్రకారుడు మాత్రమే కాదు... కవి, రచయిత కూడా. యాంగ్యూ బాల్యమంతా ఫెన్‌గూంగ్‌లో గడిచింది. రకరకాల భౌగోళిక అందాలు, జానపద సంస్కృతులతో ఆ ప్రాంతం తనలో కళను పాదుకొల్పింది. స్కల్ప్చర్, గ్లాస్‌వర్క్, ఆయిల్ పెయింటింగ్... ఏదైనా సరే తనదైన ముద్ర అందులో కనిపిస్తుంది. ‘‘కళ అనేది రంగుల్లో నుంచి కాదు, హృదయంలో నుంచి పుట్టేది’’ అంటున్న యాంగ్యూ... బొమ్మలు గీయడంలోనే సేద తీరుతుంటాడు.
యాంగ్యూ చిత్రాల్లో ‘తామరపువ్వు’ కళాత్మక ప్రతినిధిగా కనిపిస్తుంది. అందుకే ఒక అభిమాని ఇలా అన్నారు: ‘‘యాంగ్యూ బొమ్మలను చూస్తుంటే బొమ్మలను చూస్తున్నట్లు కాదు... తామరపువ్వుల కొలనును చూసినట్లుగా ఉంటుంది’’ అని
సాధారణమైన ఇంక్ లైన్స్‌తో బైమియో టెక్నిక్‌లో గీసే యాంగ్యూ బొమ్మలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటాయి.ప్రస్తుతం యాంగ్యూ తాజా ఆర్ట్ ఎగ్జిబిషన్ బీజింగ్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాలో జరుగుతోంది.