ఆది దంపతుల కల్యాణోత్సవం | Mahashivratri Brahmotsavam | Sakshi
Sakshi News home page

ఆది దంపతుల కల్యాణోత్సవం

Published Sun, Feb 24 2019 1:51 AM | Last Updated on Sun, Feb 24 2019 1:51 AM

Mahashivratri Brahmotsavam - Sakshi

ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రంగా... అష్టాదశ శక్తి పీఠంగా ప్రశస్తి పొందిన శ్రీశైలమహాక్షేత్రం భూమండలానికి నాభి స్థానం అని, ముక్కోటి దేవతలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో లింగోద్భవ కాల మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని తిలకించి బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వీక్షించడానికి శ్రీశైలానికి చేరుకుంటారని పురాణ వచనం. భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలంలో అణువణువునా వ్యాపించి ఉందని పురాణ వాఙ్మయం చెబుతోంది. యోగపరంగా అంతఃక్షేత్ర సమన్వయాన్ని చెప్పేటప్పుడు సహస్రార స్థానంగా శ్రీశైలాన్ని చెప్తారు.  అంత గొప్పదైన శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని పద్మపురాణం చెబుతోంది. 

ఇలాంటి సిద్ధక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమై, మార్చి 7 వరకు విశేషవాహన సేవలతో అశేషజనవాహిని మధ్య ఉత్సవ మూర్తుల గ్రామోత్సవం భక్తులను ఆధ్యాత్మిక పరవశులను చేయనుంది. శ్రీశైలమహాక్షేత్రానికి ఉన్న మరొక ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు శ్రీగిరిలో మాత్రమే జరుగుతాయి. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటూ నిర్వహించడం సాంప్రదాయం. చండీశ్వరుని ఆ«ధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 1960లలో రోడ్డు రవాణా వ్యవస్థ లేనప్పుడు కాలినడకన భక్తులు వివిధమార్గాల ద్వారా శ్రీశైలం చేరుకుని మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనేవారు అప్పట్లో పంచాహ్నిక దీక్ష అంటే 5 రోజుల పాటు జరిగేవి. 1990 వ దశకంలో శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకుని నవాహ్నిక దీక్షతో(9రోజులు) 11 రోజుల పాటూ నిర్వహించడం ఆనవాయితీ అయ్యింది. 

లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం
ముల్లోకాలు, సకల చరాచర జగత్తు మహాశివరాత్రి  పర్వదినం నాడు జరిగే లింగోద్భవ కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటుందని అంటారు. మహాశివరాత్రి రోజు రాత్రి 10 గంటల తరువాత శ్రీమల్లికార్జునస్వామికి లింగోద్భావ మహారుద్రాభిషేకం జరుగుతుంది. 11 మంది నిష్ణాతులైన వేదపండితులు, అర్చకులు ఏకకాలంలో మహన్యాసపూర్వకంగా రుద్రమంత్రాలను పఠిస్తుండగా దాదాపు 5 గంటలకు పైగా స్వామివారికి పవిత్రజలాలు, పంచామృతాలు, ఫలోదకాలు, సుగంధద్రవ్యాలతో ఈ రుద్రాభిషేకం జరుగుతుంది

పాగాలంకరణతో  వరుడయ్యే... శ్రీశైలేశుడు
వివాహాలలో పెళ్లికుమారునికి తలపాగా చుట్టడం ఒక సాంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైలాలయంలో పాగాలంకరణ పేరుతో మహాశివరాత్రిన వరుడయ్యే శ్రీ మల్లికార్జునస్వామికి పాగాలంకరణ ఉత్సవమైంది. స్వామివారికి గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖ్యమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ పాగాను అలంకరింప జేస్తారు. పాగాలను సమర్పించే భక్తులు అత్యంత నియమ నిష్ఠలతో రోజుకొక్క మూర చొప్పున 365 మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు.  ఆగమం ఆచారం ప్రకారం పాగాను అలంకరించే వ్యక్తి దిగంబరుడై  పాగాను అలంకరింపజేస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తారు. చిమ్మచీకట్లో పాగాను అలంకరించడం అత్యంత నేర్పుతో కూడుకున్న పని.

బ్రహ్మోత్సవ కల్యాణం
మహాశివరాత్రి నాడు పాగాలకరణ పూర్తి అయిన వెంటనే శ్రీస్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వేదమంత్రోచ్చరణ మధ్య, మంగళవాయిద్యాల నడుమ బాసిక ధారణ, మాంగళధారణ, తలంబ్రాలు, తదితర కార్యక్రమాలతో కల్యాణోత్సవం కమనీయంగా సాగుతుంది. 

మల్లన్న రథోత్సవ వేడుక
మహాశివరాత్రి పర్వదినం నాడు వధూవరులైన శ్రీభ్రమరాంబా మల్లికార్జున  స్వామివార్లను మరుసటి రోజు సాయంత్రం రథంపై అధిష్టింపజేసి ప్రధాన పురవీధిలో అశేష జనవాహిని మధ్య కనులపండువగా రథోత్సవ వేడుక జరుగుతుంది. దీనికి ముందురోజు ప్రభోత్సవం కూడా ఉంటుంది. ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడు ప్రభోత్సవంలో తిరిగి రథవీధిని పరిశీలించడానికే ప్రభోత్సవం జరుగుతుందని అంటారు. 

సదస్యం –నాగవల్లి
బ్రహ్మోత్సవాలలో 9 వ రోజు సాయంత్రం సదస్యంలో నూతన వధూవరులైన భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను వేదమంత్రాలతో స్తుతిస్తారు. ఆ తరువాత జరిగే నాగవల్లిలో అమ్మవారికి మట్టెలు అలంకరిస్తారు.

త్రిశూల స్నానం
ఉత్సవం (ఉత్‌+సవం) అంటే గొప్పయజ్ఞం. యజ్ఞనిర్వహణ సందర్భంగా చివరగా యజ్ఞం పరిపూర్తి అయినందుకు సూచనగా యజమాని అవభృధ స్నానం చేసి, బ్రహ్మోత్సవాలకు 10వ రోజున పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆ తరువాత వసంతోత్సవం, కలశోద్వాసన చేసి, త్రిశూల స్నానం జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో త్రిశూలానికి, చండీశ్వరునికి మల్లికాగుండంలో స్నపనం (పుణ్యస్నానం) చేయిస్తారు. 

ధ్వజావరోహణ 
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవాల ఆరంభం రోజున ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన నంది పతాకాన్ని అవరోహణ చేస్తారు. ఈ అవరోహణతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికినట్లు గుర్తు. 

సకలదేవతాహ్వానపూర్వక ధ్వజారోహణ
బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు సాయంత్రం జరిగే ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆలయప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణచేయడమే ధ్వజారోహణ. ఒక కొత్తవస్త్రం మీద శివుని వాహనం అయిన నందీశ్వరుని అష్టమంగళ చిత్రాన్ని చిత్రీకరిస్తారు. దీన్నే నంది ధ్వజపటం అంటారు. చండీశ్వరుని సమక్షంలో భేరీ  (డోలు వాయి«ధ్యం) çపూజ, నాదస్వరంపై ఆయా రాగాలాపనలతో సమస్త దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ధ్వజస్తంభం పై ఎగురవేస్తారు. ధ్వజస్థంపై ఎగిరే ఈ నందిపతాకమే సకల దేవతలు, యక్ష, గంధర్వ గణాలకు, ముక్కోటి దేవతలకు ఆహ్వానసూచిక. బ్రహ్మోత్సవాలకు వచ్చే దేవతల కోసం ఆయా ప్రదేశాలలో బలిహరణ పేరుతో నివేదన సమర్పిస్తారు.

వాహన దర్శన ఫలం
శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు భక్తులందరికి దర్శనం ఇవ్వడానికి  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనంపై గ్రామోత్సవంలో దర్శనం ఇస్తారు. ఆయా వాహనాలపై స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం వలన ఎన్నో విశేషఫలితాలు లభిస్తాయని ఆగమాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా:
భృంగివాహనసేవ: చేసే పనులలో ఏకాగ్రత. పాప హరణం.
హంసవాహనసేవ: మానసిక ప్రశాంతత. విద్యాప్రాప్తి. 
మయూరవాహన సేవ: శత్రుబాధలు తొలగుతాయి, సంపదలు కలుగుతాయి. 
రావణవాహనసేవ: భక్తిభావాలు పెంపొందుతాయి. శివకటాక్షం లభిస్తుంది. 
పుష్పపల్లకీసేవ: కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం చేకూరుతుంది. 
గజ వాహనసేవ: కష్టాలు తీరిపోతాయి. ఐశ్వర్యం లభిస్తుంది.
నందివాహనసేవ: చేపట్టిన పనులలో విజయం. భోగభాగ్యాలు కలుగుతాయి. 
రథోత్సవం: అరిష్ట నివారణ, ఐశ్వర్య ప్రాప్తి. 
తెప్పోత్సవం: లోకక్షేమం, సకాలవర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి.
అశ్వవాహనసేవ: సమస్యలు తీరిపోతాయి, సంతానం కలుగుతుంది. 

పుష్పోత్సవం శయనోత్సవం
బ్రహ్మోత్సవాలు ముగిశాక చివరి రోజు రాత్రి 11 వ రోజున శ్రీస్వామి, అమ్మవార్లకు పుష్పోత్సవం, ఏకాంత సేవ, శయనోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. 18 రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చించి ఏకాంత సేవ జరిపిస్తారు. తరువాత స్వామి, అమ్మవార్లను శయనింపజేయడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.  
– నేలవల్లి నాగ మల్లేశ్వరరావు,  సాక్షి, శ్రీశైలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement