రాత్రి గజ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు గురువారం సాయంత్రం స్వర్ణరథోత్సవం (రథరంగ డోలోత్సవం) కన్నుల పండువగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత తిరుమలేశుడు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5 నుంచి 6.50 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు అశేష భక్తజన గోవింద నామస్మరణ మధ్య అత్యంత వైభవంగా సాగింది. భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి సేవల్లో పాల్గొన్నారు. ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్ప స్వామి భక్తశిఖామణి హనుమంతునిని వాహనంగా మలచుకుని భక్తులకు దర్శనమిచ్చారు.
గజరాజుపై రారాజు విహారం : రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్వామివారు గజ వాహనంపై ఆశీనుడై భక్తులకు కనువిందు చేశారు. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే తన శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఈ వాహనంపై ఊరేగారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బాపిరాజు, అధికారులు పాల్గొన్నారు.
సరస్వతీదేవిగా దుర్గమ్మ
దసరా ఉత్సవాల్లో గురువారం మూల నక్షత్రం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శ్వేతవర్ణపు చీర ధరించి ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో జపమాలతో హంసవాహనాన్ని అధిరోహించిన సరస్వతీదేవిని వర్షంలోనూ భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. దుర్గమ్మ జన్మనక్షత్రం కావటంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పార్థసారథి సతీసమేతంగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి బాలరాజు, ముఖ్యమంత్రి సతీమణి రాధికారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.
పూల పల్లకిలో మల్లన్న
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీశైల మహాక్షేత్రంలో కాత్యాయని రూపంలో శ్రీభ్రమరాంబాదేవి దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్లు హంసవాహనంపై ఊరేగుతూ వచ్చి పుష్పపల్లకిని అధిష్టించారు. రాత్రి 8 గంటలకు గంగాధర మండపం నుంచి ప్రారంభమైన పుష్ప పల్లకి ఊరేగింపు అంకాలమ్మగుడి, నందిమండపం మీదుగా రథశాలకు చేరుకుంది. అక్కడి నుంచి స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు ఆలయప్రాంగణం చేరుకున్నారు.