రాబిన్ హుడ్స్
రెప్పపాటులో నెట్‌లో ఎనిమిది మంది లాగిన్ అవుతున్నారు.
క్షణానికి వంద కామెంట్లు పోస్టవుతున్నాయి.
నిమిషానికి 31500 మంది లైకుల బైకులెక్కి
నెట్ రూట్‌లో పరుగులు తీస్తున్నారు.
ఇరవై నాలుగు గంటల్లో నెట్లో అప్ లోడ్ అవుతున్న ఫొటోలు
ఏకంగా నాలుగు కోట్లు.
ఒక రోజుకి గూగుల్ గోదాములో సమాచారం కోసం
‘సెర్చి’లైట్లు వేసుకుని వెతుకుతున్నవారు ఏకంగా 327 కోట్ల మంది.
ఆకలి తీరడమే అసలైన స్వాతంత్య్రం
ఆగస్టు పధ్నాలుగు పాకిస్తాన్ పుట్టిన రోజు. ఆగస్టు పదిహేను భారత్ పుట్టిన రోజు. ఢిల్లీ - ఇస్లామాబాద్‌లలో నేతలు జెండాలు ఎగరేశారు. వాగా - అటారీ వద్ద కొందరు కొవ్వొత్తులు వెలిగించారు. అటూ ఇటూ జవాన్లు తూటాల సాయంతో మాట్లాడుకున్నారు. కానీ రాబిన్ హుడ్ ఆర్మీ అనే సంస్థకు చెందిన కొందరు యువతీయువకులు మాత్రం కొత్తగా థింక్ చేశారు. ఇరవై ఏళ్ల వయసు దాటని వీరంతా ఈ రెండు రోజుల్లో లక్ష మంది అన్నార్తులకు అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నారు. భారత్‌లో ముంబాయి, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, పుణే ఇంకా చాలా నగరాల్లో ఆకలిపై యుద్ధం ప్రకటిస్తే, పాకిస్తానీ కుర్రాళ్లు కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లో అన్నం పెట్టారు. ఎజెండాలు, ఏ జెండాలూ లేని వీళ్లంతా ఆకలి తీరడమే అసలైన స్వతంత్రమని ప్రకటించారు. రాబిన్ హుడ్ ఆర్మీ పిక్ పేరిట తమ సేవాకార్యక్రమాల ఫోటోలను పెట్టి సమైక్యతా సందేశం వినిపించారు.
ఒక్క అడుగు... ఒక్క అడుగు...
ఆంజనేయుడు సంజీవని పర్వతం కోసం ఎక్కడెక్కడికి వెళ్లాడో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి, బెంగుళూరులోని భీమన హెజ్జె, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేషియా, సౌతాఫ్రికా, టెక్సాస్, ఓహాయో, అలాస్కా, కెనడా, సిరియాలోని ఐన్ దారా మందిరం, బోట్స్వానా, ఆస్ట్రేలియా, బెలిజీ, స్పెయిన్, పెరాగ్వే, రష్యాలకు వెళ్లాడట. అబద్ధం అనుకుంటున్నారా... ఈ ప్రదేశాలన్నిటా పెద్దపెద్ద పాద ముద్రలున్నాయట. అవి ఆంజనేయుడివేనట. కావాలంటే వెళ్లి చూడండి. లేకపోతే www.talkpundit.com చూడండి. శాస్త్రవేత్తల లెక్క ప్రకారం ఇవి రెండు వందల మిలియన్ల సంవత్సరాల నాటివట. అన్నట్టు అమెరికాలోని టాహో చెరువు వద్ద ఆంజనేయుడు షూస్ కూడా వేసుకున్నట్టున్నాడు. జాగ్రత్తగా గమనించండి.
అమ్మ వంటిది అమ్మ ఒక్కటే!
ఓ బిడ్డ పుట్టిందంటే తల్లి మరోసారి పుట్టినట్టే. కొత్త ప్రాణి జననం కోసం దాదాపు మరణం అంచులకు వెళ్లాల్సిందే. మరణం శ్మశాన వైరాగ్యాన్నిస్తే జననం ప్రసూతి వైరాగ్యాన్ని ఇస్తుంది. సిజేరియన్ చేయించుకుని బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లిని హెలెన్ కార్మినా అనే ఓ ఫోటోగ్రాఫర్ ఫొటో తీసింది. ప్రాణాలకు తెగించి, ప్రాణం పోసే అమ్మదనానికి, కళాత్మకత అనే కమ్మదనం జోడించింది ఈ ఫోటో. లక్షల మంది చూశారు. వేల మంది లైక్ చేశారు. మీరూ చూడండి. వందే మాతరం అనండి!!!
ఆఫీసే ఐపీఎల్... అడుగడుగునా చీర్ గర్ల్స్
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో పొలం దున్నేందుకు ఎడ్లు మొరాయిస్తే మన హీరో సిద్ధార్థ ఏం చేశాడు? ఓ అందమైన, అలంకరించిన ఆవును ముందు నడిపించాడు. ఇక ఎడ్లకు ఎక్కడ లేని ఊపు వచ్చేసింది. పొలమంతా దున్నేసింది. చైనా వాడెవడో ఈ సినిమాను చూసేసినట్టున్నాడు. తమ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలో ఉత్పాదకతను పెంచేందుకు ఇదే ఫార్ములాను అమలు చేస్తున్నాడు. ఉద్యోగులకు ఊపు, ఉత్సాహం, ఊరట ఉంటే కానీ ఉత్పాదకత పెరగదని గుర్తించాడు. అందుకే అందమైన చీర్ గర్ల్స్‌ను రంగంలోకి దింపాడు. ఆగండాగండి... ఐపీఎల్ తరహా చీర్ గర్ల్స్ కాదు. వీళ్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కొనిపిస్తారు. కొసరి కొసరి తినిపిస్తారు. పని పూర్తి చేస్తే మెచ్చుకుంటారు. సాయంత్రం కాస్సేపు పింగ్ పాంగ్ (మన టేబుల్ టెన్నిస్) ఆడిస్తారు. దీంతో సదరు కంపెనీల్లో ఉత్పాదకత బాగా పెరుగుతోందని చెబుతున్నారు. అంతా బాగుంది కానీ... ఈ సదుపాయం అబ్బాయిలకేనా? వై షుడ్ బాయ్స్ హావ్ ఆల్ ద ఫన్?
కనిపెంచిన నాన్నకు అమ్మ అయింది
తండ్రి ఆమెకు కెమెరాను ప్రేమించడం నేర్పించాడు. కొన్నాళ్లకు ఆ తండ్రి మాయమైపోయాడు. ఎక్కడికి పోయాడో తెలియదు. ఆమె పెరిగి పెద్దదైంది. 2003 నుంచీ ఆమె పేవ్‌మెంట్‌పై బతుకు గడిపేవారి జీవితాలను డాక్యుమెంట్ చేసే ప్రాజెక్టును చేపట్టింది. 2012లో ఓ హోటల్ ముందు, చిరిగిన బట్టలతో, మాసిన జుత్తుతో, ఎముకల పోగై, మురికికి మారుపేరులా ఉన్న ఓ మనిషి నిలుచుని కనిపించాడు. ఎందుకో ఆ అమ్మాయి కాళ్లు ఆగిపోయాయి. కళ్లు అతడిని జాగ్రత్తగా చూశాయి. గుండె ఉన్నట్టుండి గొంతులోకి ఎగిసి వచ్చింది. క్షణం ఊపిరాగిపోయింది. ఆయన తన నాన్నే. అయితే ఆయనకు మతి స్థిమితం లేదు. మనుషుల్ని గుర్తుపట్టడం లేదు. అప్పట్నుంచీ ఆమెది ఒకే ధ్యాస, ఒకే ధ్యానం. ఆయనను దక్కించుకునేందుకు అహరహం శ్రమించింది. కని పెంచిన నాన్నకు తానే అమ్మ అయింది. ఆఖరికి ఆయన మామూలు మనిషయ్యాడు. మళ్లీ కెమెరా పట్టాడు. హనోలులుకి చెందిన డయానా కిమ్ కథ ఇది. అద్భుతాలు సాధ్యమేననిపించే ఈ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.
అంత అందం నీటి పాలేనా?
ఈ మోడల్స్‌కి జలస్తంభన విద్య తెలుసా? గాజు గోడల స్విమ్మింగ్ పూల్‌లో చటుక్కున దూకి సాగర కన్యల్లా విన్యాసాలు చేస్తూ అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నారు. సాగర కన్యలు ఇక్కడున్నారు. ఇక సాహస వీరులైపోదామా అనుకునేలా చేస్తున్నారు. యానా నెడ్జ్ వెట్ స్కయా అనే ఫ్యాషన్ డిజైనర్ ఏడాది క్రితం చేసిన ఈ జబర్దస్త్ జల ఫ్యాషన్ షో ఇప్పటికీ నెట్ సాగరంలో ఈదులాడేస్తోంది. 14 లక్షల మంది ఇప్పటికే చూశారు. మీరూ చూడండి.