అమ్మకు సాక్షి సలామ్ | mothers day special | Sakshi
Sakshi News home page

అమ్మకు సాక్షి సలామ్

Published Sat, May 9 2015 10:55 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

అమ్మకు  సాక్షి సలామ్

అమ్మకు సాక్షి సలామ్

2015 మదర్స్ డే సందర్భంగా అమ్మలకు
15 సూచనాభివందనాలు

అఆలు అంటే... అమ్మకోసం ఐదు ఆన్సర్లు
 
 1
 
 నాకు నెల రోజుల క్రితం బాబు పుట్టాడు. వాడికి రోజూ పది నుంచి పదిహేనుసార్లు విరేచనాలు అవుతున్నాయి. తల్లిపాలు పడకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని, తల్లిపాలు మాని పోతపాలు పట్టమని చెబుతున్నారు. నేనేం చేయాలో తగిన సలహా ఇవ్వండి.
 - కృష్ణవేణి, తణుకు

బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలకు మించిన ఆహారం లేదు. ఈ వయసు పిల్లల్లో పాలు తాగిన ప్రతిసారి ఇలా విరేచనం అవ్వడం సాధారణం. తక్కువమంది పిల్లల్లోనే పాలు పడవు. పాలు పడుతున్నప్పుడు బాబు బరువు క్రమంగా పెరుగుతుంటే తల్లిపాలు జీర్ణమవుతున్నట్లే. విరేచనాలు అవుతున్నాయనే కారణంతో తల్లిపాలు ఇవ్వడాన్ని ఆపడం ఎంతమాత్రమూ మంచిది కాదు. బాబు బరువు పెరగడం లేదంటున్నారు కాబట్టి ఇతర కారణాల కోసం పిల్లల వైద్యుని సంప్రదించండి.
 
 2
 
 నా వయసు 33. మా బాబు వయసు మూడేళ్లు. వాడు సరిగా అన్నం తినడం లేదు. మూడేళ్లకు ఉండాల్సిన బరువు కూడా లేడు. వాడు అందరిలాగే బరువు పెరగడానికి నేనేం చేయాలో చెప్పండి.
 - సులక్షణ, విజయవాడ

బరువు పెరగకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ అందుకు లోపలి అవయవాలైన మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం... ఈ నాలుగు ప్రధాన అవయవాలకు సంబంధించిన కారణాలు ఏవైనా అయి ఉండవచ్చు. కొన్నిసార్లు జన్యుపరమైన అంశాల వల్ల లేదా వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ఎత్తు/ఆకృతిని బట్టి కూడా బరువు పెరగకపోవచ్చు. పౌష్టికాహార లోపం వల్ల కూడా బరువు పెరగకపోవచ్చు. మీరు ఒకసారి పిల్లల వైద్యుడిని సంప్రదించి, బాబుకు కొన్ని పరీక్షలు చేయించి పై కారణాలలో దేనివల్ల బాబు బరువు పెరగడం లేదో నిర్ధారణ చేసుకోవడం అవసరం.
 
 3
 
ప్రస్తుతం నా వయసు 38. పదేళ్ల క్రితం నాకు కొడుకు పుట్టాడు. కానీ రెండేళ్ల క్రితం ఈతకు వెళ్లి చనిపోయాడు. నాకు మళ్లీ బిడ్డలను కనాలని ఉంది. కానీ... ఈ వయసులో బిడ్డలు పుడితే పుట్టుకతో వచ్చే జబ్బులు వస్తాయని మా దగ్గరి వాళ్లు చెబుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - ఒక సోదరి, నరసరావుపేట
 
వయసు పెరిగాక సంతానాన్ని కనడంలో వచ్చే ముఖ్యమైన సమస్య బిడ్డకు ‘డౌన్స్ సిండ్రోమ్’ రావడం. ఇలాంటి హైరిస్క్ తల్లులు ట్రిపుల్ స్క్రీనింగ్ అనే పరీక్ష చేయించి, మూడోనెల గర్భంలో న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ అనే పరీక్షతో డౌన్స్ సిండ్రోమ్‌ను పసిగట్టవచ్చు. ఈ ఫలితాలు పాజిటివ్ వస్తే ఆమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష ద్వారా ఉమ్మనీరు తీసి దాన్ని జన్యుపరమైన పరీక్షలకు పంపాలి. ఆ పరీక్షలతో పై జబ్బు ఉందోలేదో నిర్ధరించవచ్చు. ఆ ఫలితాలతో తదుపరి చర్యల గురించి ఆలోచించాలి.
 
 4
 
 ఇటీవలే నాకు కూతురు పుట్టింది. ఇది నాకు తొలిచూలు. రొమ్ముపాలే ఇస్తున్నాను. అయితే రొమ్ములో పాలు అయిపోయాయా లేదా అన్నది నాకు తెలియడం లేదు. ఎప్పుడు రొమ్ము మార్చాలో కూడా తెలియడం లేదు. ఈ విషయంలో నాకు తగిన సలహాలు ఇవ్వండి. పాలుపట్టడంలో జాగ్రత్తలు చెప్పండి.
 - స్నేహ, మహబూబ్‌నగర్
 
సాధారణంగా పిల్లలు పాలు తాగడం 10-15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలు పాలు తాగడానికి అలవాటు పడటంలో కాస్త ఆలస్యం కావడం చాలా సాధారణం. చాలామంది పిల్లలు ఒక పక్కనే పాలు తాగి సంతృప్తి చెందుతారు. కానీ కొందరు ఒక పక్క తాగి మళ్లీ మరో పక్క కూడా తాగుతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే చివరలో వచ్చే పాలని హైండ్ మిల్క్ అంటారు. ఈ పాలలో ఎక్కువ క్యాలరీస్ ఉండి, బిడ్డ బరువు పెంచడానికి ఇవి దోహదపడతాయి. సాధారణం శిశువు రోజుకు ఐదారుసార్లు మూత్ర విసర్జన చేస్తూ, బరువు పెరుగుతూ ఉంటే అతడికి తల్లిపాలు సరిపోతున్నాయని భావించవచ్చు. అయితే పాలు పట్టే తల్లులు ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటిస్తే మంచిది.పాలిచ్చే తల్లులు వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం ఎంతో అవసరం.  రొమ్ములను పరిశుభ్రంగా ఉంచుకోవడం బిడ్డకు మేలు చేసే అంశం.సాధారణంగా పడుకొని పాలు ఇవ్వడం కంటే కూర్చుని పాలివ్వడం మంచిది.
 
 5
 
నాకు చిన్నపిల్లలంటే చాలా ప్రేమ. అయితే నా రొమ్ములు చాలా చిన్నవి. పెళ్లయి రెండేళ్లయ్యింది. ఇంకా పిల్లలు లేరు. నాకు మాత్రం ఎప్పుడెప్పుడు గర్భవతిని అవుతానా అని ఆతృతగా ఉంది. ఒకవేళ రేపు నాకు బిడ్డలు పుడితే ఈ రొమ్ములలో బిడ్డకు తగినన్ని పాలు పడతాయా? బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే ఏవైనా ముందుజాగ్రత్తలు ఉండే చెప్పండి. ఇప్పటి నుంచే పాటిస్తాను.
 - ఒక సోదరి, గణపవరం

రొమ్ముల పరిమాణానికి పాలకు సంబంధం లేదు. పాలు బాగా పడటానికి మందులు అంతగా ఉపయోగపడవు. బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే తల్లులు తీసుకోవాల్సిన ఆహారం ఎంతో ముఖ్యం. మంచి పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో మేలు. బిడ్డకు పాలిచ్చే తల్లులు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. మీకు పుట్టబోయే బిడ్డకు పాలు సరిపోతాయా లేదా అని ఆందోళన చెందకుండా, మానసికంగా ఆనందంగా ఉండటం వల్ల పాలు ఉత్పత్తి అయ్యే హార్మోన్లు కూడా బాగా స్రవించి పాలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 
 6
 
కుంకుమపువ్వుతో బిడ్డ రంగు మారుతుందా?
 
మంచి రంగు మాట పక్కన పెడితే... కుంకుమపువ్వును పరిమితంగా తీసుకుంటే దీనితో చాలా పౌష్టికాహార ప్రయోజనాలు మాత్రం ఉన్నాయి. దీన్ని పాలలో చిటికెడుకు మించకుండా తీసుకోవడం సురక్షితం. ఎక్కువ వాడితే గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా వాడితే గర్భస్రావమూ అయ్యే అవకాశం ఉంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది.
 
 7
 
 వేవిళ్ల బాధ మరీ ఎక్కువగా ఉంటే...!

గర్భవతి అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండి, రక్తహీనత లేకుండా, తగినంత హిమోగ్లోబిన్ ఉన్నవాళ్లయితే వాంతుల కారణంగా గర్భధారణ సమయాల్లో పెరగాల్సినంతగా బరువు పెరగకపోయినా... దాన్ని పెద్ద ఇబ్బందిగా పరిగణించాల్సి అవసరం లేదు. అయితే ఐదు నెలల తర్వాత కూడా గర్భిణీ తగినంతగా బరువు పెరగకపోతే మాత్రం అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. వేవిళ్ల సమస్యను ఎదుర్కొనడానికి ప్రధానంగా ఇంటిచిట్కాలు, ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు. అల్లం మురబ్బా  లేదా అల్లం, ఉప్పు, నిమ్మరసం కలిసిన మిశ్రమాన్ని తీసుకోవడంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇదేమీ వేవిళ్లకు ఔషధం కాదు. అయితే వేవిళ్లతో బాధపడేవారికి చాలావరకు ఉపశమనంగా ఉంటుంది.
 
 8
 
ప్రసవం ముందు రోజుల్లో కాళ్ల వాపులుంటే...?

గర్భవతుల్లో కాళ్ల వాపు వచ్చే కండిషన్‌ను జెస్టెషనల్ అడిమా అంటారు. మామూలుగానైతే దీని గురించి ఆందోళన పడాల్సిందేమీ లేదు. అయితే ఇలా వాపు వస్తున్న గర్భవతుల్లో హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఏదైనా ఉందేమో చూడాలి. ఇక మన భారతీయ మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ.  మహిళల్లో హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 11 ఉండటాన్ని ఒక మోస్తరుగా సాధారణంగా పరిగణిస్తుంటాం. అయితే కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం చాలా సాధారణం. ఇక కొందరు మహిళల్లో గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు, వాళ్లలో కూడా కాళ్లవాపులు ఉండవచ్చు. వాళ్లు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి.
 
 9
 
గర్భవతులు ఇద్దరి కోసం తినాలా...

గర్భవతులు తమ కోసం... కడుపులో ఉన్న బిడ్డ కోసం... ఇలా ఇద్దరి కోసం తినాలంటూ చాలామంది అంటుంటారు. కడుపులోని బిడ్డ తన ఆహారాన్ని తల్లినుంచి ఎలాగైనా గ్రహిస్తుంటాడు. కాబట్టి సాధారణ బరువు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు మామూలుగానే తింటే సరిపోతుంది. అంటే బరువు తక్కువగా ఉన్నవారు మినహా మిగతా వారంతా ఇద్దరి కోసం తినడం సరికాదని గ్రహించాలి.
 
 
 10
 
 గర్భవతులకూ, కడుపులో బిడ్డకూ స్కానింగ్‌తో ప్రమాదమా?

అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కేవలం శబ్దతరంగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌లోలా ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలను ఉపయోగించరు. ఈ శబ్దతరంగాలు ప్రమాదరహితమైనవి. ఇవి ఎంత ప్రమాదరహితమైనవంటే... అవసరాన్ని బట్టి ఒక్కోసారి ప్రతిరోజూ డాప్లర్ స్కానింగ్ చేయించాల్సి కూడా రావచ్చు. అప్పుడు కూడా ఇవి ప్రమాదాన్ని కలిగించవని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిరభ్యంతరంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే పుట్టబోయే బిడ్డ... ఆడా, మగా అని మాత్రం అడగవద్దు.
 
 11
 
ఏవి పురిటి నొప్పులు...? ఏవి కావు?

గర్భసంచి కండరాల్లోని సంకోచ-వ్యాకోచాల్లో ఏవి పురిటి నొప్పులో గుర్తించడానికి ఒక గుర్తు ఉంటుంది. సంకోచ సమయంలో పొట్ట కండరాలు గట్టిబడటంతో పాటు నొప్పి నడుము వెనక భాగం నుంచి మొదలై క్రమంగా ముందు భాగంలో తొడల వరకు (సరిగ్గా చెప్పాలంటే ప్యూబిక్ బోన్ వరకు) వ్యాపిస్తుంది. పురిటి నొప్పులుగా వచ్చిన నొప్పులు ఒకసారి వచ్చాక అదేపనిగా రాకుండా... వస్తూ, తగ్గుతూ ఉంటాయి. ఈ పురిటినొప్పులు పూర్తి ప్రభావపూర్వకంగా ఉన్నప్పుడు గర్భసంచి ముఖద్వారం (అంటే సర్విక్స్) తెరచుకుంటూ ఉంటుంది. అంటే గర్భసంచి పైభాగం (ఫండస్) ముడుచుకుంటూ, ముఖద్వార (సర్విక్స్) భాగం తెరచుకుంటూ ఉండేవి నిజమైన పురిటి నొప్పులన్నమాట.
 
ఉఊలు అంటే... ఉవిదలతో ఊఁ కొట్టించే వివరాలు
 
 12
 
అమ్మలూ... మానసిక సమస్యలు!

 ప్రసవం తర్వాత హార్మోనల్ మార్పుల వల్ల గానీ లేదా శారీరక, మానసిక సమస్యల వల్లగాని కొత్తగా తల్లులైన చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు వస్తాయి. కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తారు. దీన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. పోస్ట్ పార్టమ్ సమస్యలు సైకోసిస్, యాంగ్జైటీ డిజార్డర్స్... ఇలాంటి చాలా రకాల మానసిక సమస్యలు కనిపించవచ్చు. చాలామంది తల్లుల్లో అవి త్వరగానే వాటికవే తగ్గిపోతాయి. కానీ కొందరిలో మాత్రం అవి దీర్ఘకాలం కొనసాగుతాయి. వాటకవే తగ్గిపోయే సమస్యలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఒక జబ్బుగా పరిణమించేవాటిలో మాత్రం చికిత్స చేయాల్సి ఉంటుంది. మరి తల్లులకు చికిత్స చేస్తే ఆ మందులు పాల (బ్రెస్ట్ మిల్క్)లోకి ఇంకే ప్రమాదం ఉంటుంది. అందుకే పాలలోకి ఇంకని మందులనే సైకియాట్రిస్ట్‌లు ఇస్తారు. కొందరి ఈసీటీ అనే ఎలక్రో కన్వల్సివ్ థెరపీ అనే చికిత్స ఇస్తారు. ముందుగానే మానసిక సమస్యలు ఉండటం, మునుపటి ప్రసూతి సమయంలో ఇలాంటి సమస్యలు రావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి సమస్యలు ఉండటం అనే అంశాలు తల్లుల్లో మానసిక సమస్యలు వచ్చేందుకు రిస్క్ ఫ్యాక్టర్లు. వీరి విషయంలో తల్లి వల్ల బిడ్డకు హాని జరగకుండా జాగ్రత్తగా ఉండాలి.
 
 13
 
రొమ్ములు తడుముకున్నప్పుడు గడ్డలుంటే..?
 
ఇది చాలామంది యువతులలో నెలకొనే సర్వసాధారణమైన అపోహ. యువతులు, బాలికలలో ఇలాంటి గడ్డలు రావడం సహజం. వీటిని బ్రెస్ట్ లంప్స్ అంటారు. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా లేదు. చిన్న వయసులో బ్రెస్ట్ క్యానర్ రావడం చాలా అరుదు. రొమ్ములో గడ్డలు, రొమ్ములో నొప్పి, చనుమొ నల నుండి డిశ్చార్జి, రుతుస్రావానికి ముందు నొప్పి మొదలైనవన్నీ రొమ్ముకు సంబంధించిన సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. దీని వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం చాలా తక్కువ. అరకొర సమాచారం, క్యాన్సర్‌పై పరిపూర్ణమైన అవగాహన లేనందునే ఇటీవల కాలంలో బ్రెస్ట్ లంప్స్‌పై యువతులు విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. మా వద్దకు వస్తున్న యువతులలో ఎక్కువ మందికి ఇదే సమస్య. రొమ్ముకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుగా వాటి గురించి కుటుంబ సభ్యులకు తెలిపి, ఆ తర్వాత వైద్యుడిని సంప్రదించాలి. సమగ్రమైన పరీక్ష లేదా కొన్నిసార్లు ఆల్ట్రాసౌండ్ వంటి చిన్నపాటి టెస్ట్ ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఈ సమస్యలో చాలామందికి చికిత్స కూడా అవసరం ఉండదు. కొన్నిటికి మాత్రం చిన్నపాటి శస్త్రచికిత్సతో సమస్య తీరిపోతుంది.
 
 14
 
గర్భవతుల్లో రక్తహీనత...

రక్తహీనత అనే కండిషన్‌లో రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తగ్గడం వల్ల కలుగుతుంది. మహిళల్లో ప్రతి డెసిలీటర్‌కూ 11 నుంచి 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండటాన్ని నార్మల్‌గా పరిగణిస్తారు. ఇది 10 నుంచి 10.9 వరకు ఉంటే దాన్ని చాలా మైల్డ్ అనీమియా అని, 7 నుంచి 10 ఉంటే దాన్ని ఓ మోస్తరు అనీమియా, 7 కంటే తక్కువ ఉంటే తీవ్రమైన అనీమియా అని, ఒకవేళ ఆ విలువ 4 కంటే తక్కువ ఉంటే అతితీవ్రమైన అనీమియా అని చెప్పవచ్చు. రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే తొందరగా అలసిపోవడం, నీరసంగా ఉండటం, తలతిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ కళ్లు, నాలుకను డాక్టర్లు పరీక్షిస్తారు. అవి పేలవంగా ఉండటాన్ని బట్టి రక్తహీనతను అనుమానించి రక్తపరీక్షలు చేయిస్తారు. అయితే చాలామంది రక్తహీనత కోసం హీమోగ్లోబిన్ పాళ్లను మాత్రమే పరీక్షిస్తారు. నిజానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ చేయించాలి. ఈ పరీక్ష ద్వారా రక్తహీనత ఎంత తీవ్రంగా ఉందో తెలియడంతో పాటు అది ఎందువల్ల ఉందో కూడా కొంతమేరకు తెలుస్తుంది. సీబీపీని ఆధారంగా తీసుకుని తదుపరి పరీక్షలను నిర్ణయిస్తారు.
 
 15
 
బిడ్డకిచ్చే పాలు... తల్లికీ మేలు!

 బిడ్డకు పాలివ్వడం అటు కేవలం పాపాయికే కాదు... ఇటు తల్లికీ మేలు చేకూరుస్తుంది. ఉదాహరణకు ...  బిడ్డకు పాలు పట్టినంత కాలం గర్భధారణకు స్వాభావికంగానే అవకాశాలు తక్కువ. అంటే ఒకరకంగా ఇది ప్రకృతిసిద్ధమైన గర్భనిరోధక సాధనం. (చాలా సందర్భాల్లో ఇది నెరవేరినా కొన్నిసందర్భాల్లో మాత్రం గర్భధారణ జరగవచ్చు. అందుకే పాలిచ్చే తల్లులూ సెక్స్‌లో పాల్గొంటే గర్భనిరోధక సాధనాలు వాడాలి)  పాలిచ్చే తల్లులకు రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే రొమ్ములో హానికరం కాని నాన్ క్యాన్సరస్ గడ్డలు వచ్చే రిస్క్ కూడా తక్కువే.  మిగతావారితో పోలిస్తే బిడ్డకు పాలు పట్టే అమ్మలకు డయాబెటిస్ వచ్చే అవకాశాలూ తక్కువే. ఒకవేళ వచ్చినా తీసుకోవాల్సిన ఇన్సులిన్ మోతాదు కూడా మిగతావాళ్ల కంటే తక్కువగా ఉంటుందని బ్రిటన్ పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో తేలింది.  మిగతావారితో పోల్చినప్పుడు పాలిచ్చే తల్లుల్లో యుటిరైన్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ.  బిడ్డకు పాలివ్వడం ఆస్టియోపోరోసిస్‌నూ నివారిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement