అందుకే అప్పుడు బరువు పెరిగాను : నమిత | Namitha Special Interview With Sakshi | Sakshi
Sakshi News home page

నమితానందం

Published Sun, Oct 13 2019 12:02 AM | Last Updated on Sun, Oct 13 2019 12:24 PM

Namitha Special Interview With Sakshi

నమిత అభిమానులకు శుభవార్త!ఆమె బోలెడంత లాస్‌ అయ్యారు! కంగారు పడకండి. నమిత లాస్‌ అయింది డబ్బు కాదు. వెయిట్‌ లాస్‌!! బరువు తగ్గి, మెరుపుతీగ అయ్యారు నమిత. తారలు వెయిట్‌ తగ్గితే.. ఇండస్ట్రీలో వెయిట్‌ పెరుగుతుంది. ‘సొంతం’తో ఎంట్రీ ఇచ్చి.. ‘సింహా’ తర్వాత కొంచెం ఒళ్లు చేసిన నమిత సన్నబడి, మళ్లీ ఇప్పుడు సౌత్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు.. ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్‌..!

రెండేళ్ల క్రితం పెళ్లప్పుడు బొద్దుగా ఉన్నారు. ఈ మధ్య బరువు తగ్గారు. సినిమాల కోసమా?
నమిత: బరువు తగ్గడానికి ముఖ్య కారణం కొన్ని పెద్ద సినిమాలు అంగీకరించడమే. వచ్చే ఏడాది మేలో ఈ సినిమాలు ఆరంభమవుతాయనుకుంటున్నాను. అందుకే టైమ్‌ తీసుకొని బరువు తగ్గుతున్నాను. ప్రతి రోజూ ఉదయాన్నే ఐదున్నరకే నిద్ర లేస్తున్నాను. రోజు మార్చి రోజు యోగా, జిమ్‌ చేస్తున్నాను. వారానికి ఆరు రోజులు చేస్తున్నాను. ఒక్క రోజు సెలవు తీసుకుంటున్నాను. బరువు తగ్గడానికి మరో కారణం ఆరోగ్య సమస్యలు. నిజం చెప్పాలంటే నేనెప్పుడూ ఓవర్‌ వెయిట్‌ని ఎంజాయ్‌ చేయలేదు.

ఉన్నట్లుండి ఎందుకు బరువు పెరిగారు?
ఆడవాళ్లకు హార్మోన్స్‌ సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యల వల్లే నేను విపరీతంగా బరువు పెరిగాను. మన సమస్యలను మనం తెలుసుకోగలగాలి. నేను, నా భర్త (వీర్‌) నా శరీరంలోని సమస్యకు మూలం ఏంటి? అనే దగ్గర నుంచి వర్కౌట్‌ చేయడం మొదలుపెట్టాం. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే తాత్కాలిక పరిష్కారం కోసం చూస్తాం. కానీ మేం శాశ్వత పరిష్కారం కావాలనుకున్నాం. ఈ ఏడాది జనవరి నుంచి జిమ్, యోగా మొదలుపెట్టాను. కొత్త డైట్‌ని ఫాలో అవుతున్నాను. 2011 నుంచి 2016 వరకూ డిప్రెషన్‌లో ఉన్నాను. 2017లో నార్మల్‌ అయ్యాను. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మద్యానికి బానిస కావొచ్చు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మానసికంగా వేరే స్థితికి వెళ్లొచ్చు.

లక్కీగా నేను ఆధ్యాత్మికం వైపు వెళ్లాను. ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అలాంటి సమయంలో వీర్‌ నా జీవితంలోకి వచ్చాడు. తను నా బ్యాక్‌బోన్‌లా మారిపోయాడు. నాలో చాలా స్ఫూర్తి నింపాడు. వీర్‌ లైఫ్‌ స్టయిల్‌ చాలా నేచురల్‌గా ఉంటుంది. అన్నీ ఆర్గానిక్, హెర్బల్స్‌ని తీసుకుంటాడు. ఇంగ్లీష్‌ మెడిసిన్‌ని ఇష్టపడడు. కెమికల్స్‌ ఎక్కువ ఉండవు. నన్ను కరెక్ట్‌ దారిలో పెట్టాడు. డాక్టర్స్‌ను సంప్రదించాం. సహజమైన పద్ధతిలో బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టా.

ఈ బరువు తగ్గే విషయంలో మిగతా స్త్రీలకు ఉపయోగపడే టిప్స్‌ ఏమైనా?
ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. నాకు పీసీఓడి, థైరాయిడ్‌ సమస్యలున్నాయి. వంశపారంపర్యం కూడా ఉంది. వీటన్నింటికి తోడు డిప్రెషన్‌తో బాధపడ్డాను. ఆ సమయంలో ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం అనే దాని మీద శ్రద్ధే ఉండదు. అలా బరువు పెరిగాను. వీర్‌ సపోర్ట్‌తో నా ఆరోగ్య సమస్య గురించి తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ తమ సమస్యని తెలుపుకోవాలి. బయటకు చెప్పడానికి మొహమాటపడకూడదు. డాక్టర్‌ దగ్గరికెళ్లడానికి సిగ్గుపడకూడదు. అప్పుడే మన సమస్యను మనం అధిగమించగలుగుతాం.

ఎంత బరువు తగ్గారు? మీ డైలీ డైట్‌ ఏంటి?
పది కిలోలు తగ్గాను. ఇంకో 7 కిలోలు తగ్గాలనుకుంటున్నాను. మేం రాగి, జొన్నలు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నాం. వీటి ప్రభావం లాంగ్‌ రన్‌లో ఎక్కువ ఉపయోగపడుతుంది. నేను ఉదయం నిద్ర లేవగానే ములక్కాడ ఆకుల రసం తీసుకుంటాను. ములక్కాడ ఆకుల రసానికి తేనె, నిమ్మరసం కలుపుతాను. 20 నిమిషాల తర్వాత జీలకర్ర వాటర్‌ తాగుతాను. రాత్రి మొత్తం జీరాను నానబెట్టి ఉదయాన్నే వేడి చేసి, తాగుతాను. మిగిలిన జీరాను నమిలేయాలి. కొంత సేపటి తర్వాత ఒక యాపిల్‌ తింటాను. జిమ్‌ లేదా యోగా నుంచి తిరిగొచ్చాక బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తాను. ముస్లీ, డ్రై ఫ్రూట్స్, మిల్క్‌ లేదా పెరుగు తింటాను.

లంచ్‌లో రాగి ఇడ్లీ, రాగి దోశె లేదా రాగి పనియారమ్‌ తింటాను. బ్రౌన్‌ రైస్‌ తీసుకుంటాను. రెండు గంటల తర్వాత ఒక గ్లాస్‌ కొబ్బరినీళ్లు తాగుతాను. రోజు మొత్తంలో సుమారు 6 నుంచి 7 లీటర్ల నీళ్లు తాగుతాను. రాత్రి డిన్నర్‌లో వెజిటేబుల్‌ సూప్‌ మాత్రమే ఉంటుంది. ఒకవేళ బాగా ఆకలనిపిస్తే మా కుక్‌ను రాగి పనియారం చేయమంటాను. పూండు చట్నీ (వెల్లుల్లిపాయ చట్నీ), కొబ్బరి చట్నీతో తింటాను. పల్లీల చట్నీ అంటే నాకు బాగా ఇష్టం కానీ డైట్‌లో వద్దన్నారు. అందుకే పదిరోజులకోసారి పల్లీ చట్నీ తింటాను.

ఈ డైట్‌ని ఎవరు చెప్పారు?
నా డైట్‌ మొత్తం నా డైటీషియన్, వీర్‌ కలíసి ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం మనందరం చాలా కాలుష్యంలో ఉంటున్నాం. దానివల్ల మనకు కావాల్సిన విటమిన్లు సరిగ్గా అందే అవకాశాలు తక్కువ. అందుకే ఒక్కోసారి విటమిన్‌ టాబ్లెట్లు తీసుకుంటుంటాను. ఇవన్నీ డాక్టర్ల సూచన మేరకే వాడతాను.

ఇదే డైట్‌ను ఎప్పటికీ కొనసాగిస్తారా?
కొనసాగించాలనుకుంటున్నాను. అయితే ఒక సంవత్సరానికి మించి ఇదే డైట్‌ని ఫాలో అవ్వలేననిపిస్తోంది. స్వీట్స్‌ మానేశాను. మధ్యలో కీటో డైట్‌ కూడా పాటించాను. అది నాకు సరిగ్గా వర్కౌట్‌ కాలేదు. మా కజిన్‌ ఒకామెకు బాగా వర్కౌట్‌ అయింది.

నో చాక్లెట్, నో స్వీట్స్‌ అంటే కష్టమేమో?
హార్మోనల్‌ ఇంబ్యాలెన్స్‌ వల్ల నాకు తీపి తినాలనే ధ్యాస పెద్దగా ఉండట్లేదు. లేకపోతే ప్రతి రోజూ డిన్నర్‌ తర్వాత ఏదో ఒక స్వీట్‌ తినాల్సిందే. ఇప్పుడు అలా లేదు. మిస్‌ అయినట్టే లేదు. నేనేనా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. డైట్‌ మొదలుపెట్టిన మూడునెలల తర్వాత మా ఊరికి వెళ్లాను. మా అమ్మగారు హల్వా తయారు చేశారు. మూడు నెలలకు తిన్న స్వీట్‌ అది.

బరువు తగ్గాక శారీరకంగా చాలా మార్పు వచ్చింది. మరి మానసికంగా?
ధ్యానం నన్ను ప్రశాంతంగా మార్చేసింది. నా ఆలోచనల్లో మెచ్యూర్టీ వచ్చింది. మనుషులను, వాళ్ల మనస్తత్వాలను ఇంతకు ముందుకన్నా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎవరి ముందు ఏం మాట్లాడాలి? ఎవరి ముందు ఏం మాట్లాడకూడదు అని తెలుసుకుంటున్నాను. అవన్నీ మెల్లిమెల్లిగా అర్థం అవుతున్నాయి. ఈ మధ్యనే మా చుట్టాల ఇంటికి వెళ్లాను. అందరూ ‘భలే మెరిసిపోతున్నావు’ అన్నారు. నీలో సంతోషం మాత్రమే కనిపిస్తోంది అన్నారు. నా టెంపర్‌ పోయింది. రిలాక్డ్స్‌గా ఉంటున్నాను. కాన్ఫిడెంట్‌గా మారాను. ఈ మార్పు మొత్తం వీర్‌ నా జీవితంలోకి వచ్చిన తర్వాతే.

తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు?
నా కెరీర్‌ను తెలుగు సినిమాతోనే ప్రారంభించాను. తెలుగు పరిశ్రమకు రుణపడి ఉంటాను. మంచి ప్రాజెక్ట్‌ కోసం ఎదురుచూస్తున్నా.

ఈ మధ్య స్టార్స్‌ అందరూ వెబ్‌ సిరీస్‌లో కూడా కనిపిస్తున్నారు. మీక్కూడా ఇంట్రెస్ట్‌ ఉందా?
కథ బావుంటే ఏదైనా ఓకే. మీకు తెలుసో లేదో నేను కవితలు రాస్తుంటాను. నేను, వీర్‌ కలసి కొన్ని స్క్రిప్ట్స్‌ రాశాం. ఆ కథలను సినిమాగా అయినా, వెబ్‌ సిరీస్‌గా అయినా తీయొచ్చు. ప్రొడక్షన్‌ హౌస్‌ మొదలుపెట్టాలనుకుంటున్నాం.

పర్సనల్‌ లైఫ్‌లోకి వస్తే పిల్లలెప్పుడు?
పెళ్లి సమయంలోనే ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాం. మా తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. మా అత్తామామలైతే ‘డైమండ్‌’ అనొచ్చు. చాలా స్వీట్‌గా ఉంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలెప్పుడు అని కంగారు పెట్టరు.

తెలుగింటి కోడులుగా ఉండటం ఎలా ఉంది?
వీర్‌ నాకు ప్రపోజ్‌ చేసినప్పుడు తెలుగు సంప్రదాయ ప్రకారం పెళ్లి జరగాలా? మా గుజరాతీ స్టయిల్‌ వెడ్డింగ్‌ కావాలా అనేది నన్నే నిర్ణయించుకోమన్నాడు. చిన్నప్పటినుంచి గుజరాతీ పెళ్లిళ్లు చాలా చూశా. అవి బావుంటాయి. తెలుగు సంప్రదాయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని తెలుగు స్టయిల్‌లో చేసుకున్నాం. వీర్‌ వాళ్ల అమ్మానాన్నలకు కూడా మా అబ్బాయికి పెళ్ళి అయింది అనే ఫీలింగ్‌ ఉండాలి కదా. నేను ఎప్పుడూ వినని, తెలియని సంప్రదాయాలను చూశాను.

మీ ఫ్యాన్స్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
తెలుగు ఫ్యాన్స్‌ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బ్యాంగ్‌తో తిరిగొస్తాను. నాలుగైదు డిఫరెంట్‌ గెటప్స్‌లో నన్ను చూడబోతున్నారు. ఇకపై విభిన్నమైన రోల్స్‌ చేయనున్నాను. ‘నమిత ఈజ్‌ బ్యాక్‌’ అనేలా మంచి క్యారెక్టర్లు సెలక్ట్‌ చేసుకుంటాను.

అవునూ... మీ భర్తను ‘స్వామీ’ అని పిలుస్తారట?
ఇంతకుముందు వీర్‌ అని పిలిచేదాన్ని. ఆ మధ్యలో వీర్‌ అయ్యప్ప మాల వేసుకున్నాడు. అప్పుడు స్వామీ అని పిలుస్తాం కదా. అలా పిలవడం నాకు బాగా అనిపించింది. అందుకే ఎప్పటికీ ‘స్వామీ’ అని పిలవాలని డిసైడ్‌ అయిపోయాను.

మీ భర్త సపోర్ట్‌ వల్లే మీరు బరువు తగ్గగలిగారా?
అవును. అయితే ప్రాబ్లమ్‌ ఎక్కడ అంటే.. సన్నగా అవ్వాలనే ఆసక్తి భార్యకు కూడా ఉండాలి. భర్త డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లినా భార్య రాననడం నేను చాలా సందర్భాల్లో చూశాను. లావుగా ఉండడంవల్ల ఎక్కువ వయసున్నట్లు కనిపిస్తారు. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లని భర్తలు కూడా ఉంటారు. అప్పుడు వాళ్ల నాన్నలను అడగాలి. వినకపోతే రెండుమూడుసార్లు అడగాలి. లేకపోతే వాళ్లంతట వాళ్లే డాక్టర్‌ని సంప్రదించాలి. ఇంట్రెస్ట్‌ వాళ్లకే ఉండాలి. నా వల్ల కాదు, నాకు అక్కర్లేదు అనుకుంటే ఎవరు ఎంత సపోర్ట్‌ చేసినా ఉపయోగం ఉండదు. తన మార్పు మిగతావాళ్లకు ప్రేర ణ కలిగించాలి.

నమితట్రాన్స్‌ఫర్మేషన్‌ వెనక ఉన్న కారణాలు రెండు. ఒకటి సినిమా. రెండోది వేరేవాళ్లు తనపై చూపించిన ఆసక్తి. ‘ఇంత  బరువు పెరిగారు ఏంటి?’ అని అడిగేవాళ్లు. స్త్రీలు బరువు పెరిగితే వంద సమస్యలు ఉంటాయి. కానీ బయటకు చెప్పలేరు. ఎవరికైనా చెప్పినా పెళ్లయ్యాక పెరుగుతారులే అని కొట్టిపారేస్తారు. తగ్గడానికి ప్రయత్నించరు. వాళ్లకు స్ఫూర్తిగా నమిత ఉండాలన్నది నా ఉద్దేశం.తను సడన్‌గా ఎందుకు లావు అవుతోంది? ఎందుకు తగ్గుతోంది అనే ఆలోచనలో పడ్డాను. మనం తినేదాంట్లో సగం కూడా తినడం లేదు.. మరి ఎలా లావు అవుతోంది? అనుకున్నా. తను ఆరేళ్లు డిప్రెషన్‌లో ఉంది. దాంతో సిస్టమ్‌ దెబ్బతింది. డాక్టర్లను సంప్రదించి ఈ కోర్స్‌ మొదలుపెట్టాం. అందరూ లావు తగ్గటం పెద్ద టాస్క్‌ అనుకోకూడదు. అనుకుంటే తగ్గుతారు. –వీర్, నమిత భర్త

– డి.జి.భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement