నాచురల్ ఫేస్‌మాస్క్
పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డు సొన, ఐదు గ్రాముల పాలపొడి లేదా టేబుల్ స్పూన్ తాజా పాలు ఒక పాత్రలో వేసి బాగా చిలికి ఆ మిశ్రమాన్ని ఫేషియల్ బ్రష్‌తో కళ్ల చుట్టూ, పెదవులను మినహాయించి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోడిగుడ్డుసొన చర్మానికి పోషణనిస్తుంది. తేనె చక్కని నిగారింపునిస్తుంది. ఇది నాచురల్ స్కిన్‌కూ పొడిచర్మానికి కూడా చక్కగా పని చేస్తుంది.
ఆయిలీ స్కిన్ అయితే పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదు మిల్లీలీటర్ల నిమ్మరసం, ఐదు గ్రాముల ఈస్ట్ పౌడర్ లేదా పుల్లటి పెరుగు కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం చర్మగ్రంథుల నుంచి విడుదలైన అదనపు జిడ్డును తొలగిస్తుంది. తెల్లసొన డీప్ క్లెన్సర్‌గా పని చేసి చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. వీటికి తేనె తెచ్చే నిగారింపు కలిసి ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
ముఖం మీద నల్ల మచ్చలు పోవాలంటే... నిమ్మరసంలో కోడిగుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి పట్టించి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగాలి. రాత్రంతా ఉంచడం సాధ్యం కాకపోతే ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఇలా ఇలా వారానికి రెండు - మూడు సార్లు చేస్తుంటే ముఖం మీద ఉన్న మచ్చలు తొలగిపోయి ముఖం తెలుపుదనం సంతరించుకుంటుంది.