విలన్‌ అంటే నేనే గుర్తుకు రావాలి | Navya Rao Introduced as a Villain by Telugu Serial | Sakshi
Sakshi News home page

విలన్‌ అంటే నేనే గుర్తుకు రావాలి

Published Wed, May 15 2019 3:53 AM | Last Updated on Wed, May 15 2019 3:53 AM

Navya Rao Introduced as a Villain by Telugu Serial - Sakshi

తన సంతోషాన్ని మాత్రమే వెతుక్కునే గుణం, నచ్చనివారికి చెడు జరగాలనే తలంపే విలనిజంలో ప్రధానంగా ఉంటుంది. విలన్‌గా నటనలో చాలా వేరియేషన్స్‌ ఉంటాయి. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘ముత్యాల ముగ్గు’ సీరియల్‌లో నందిక క్యారెక్టర్‌ ద్వారా తెలుగు బుల్లితెరపై విలనిజాన్ని చూపుతుంది నవ్య. కన్నడ టీవీ సీరియల్‌లో  రాణించి, తెలుగు సీరియల్‌ ద్వారా విలన్‌గా పరిచయమైన నవ్యారావు పంచుకున్న ముచ్చట్లు ఇవి.

నా ఫ్రెండ్స్, బంధువులతో పాటు మా చెల్లెల్లు కూడా ‘ఎందుకు నెగిటివ్‌ రోల్స్‌ చేస్తావు. నిన్నందరూ బ్యాడ్‌ అనుకుంటారు తెలుసా’ అంటుంటారు. ఇలాంటి క్యారెక్టర్స్‌ వల్ల నటనలో మన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. ఈ విషయం పదే పదే వారికి చెప్పలేక నవ్వేసి ఊరుకుంటాను. పాజిటివ్‌ రోల్స్‌ చేయాలని నాకూ ఉంది. అవకాశం వస్తే తప్పకుండా ఉపయోగించుకుంటాను. 

రియాలిటీ షో
ఎమ్‌కామ్‌ పూర్తయ్యాక ఓ రోజు కన్నడ టీవీలో ఒక జ్యువెలరీ షో కోసం యాంకర్స్‌ కావాలనే ప్రకటన చూశాను. నా ఫొటోలు, వివరాలు వారికి పంపించాను. సెలక్ట్‌ అయ్యాను. అలా టీవీలోకి వచ్చాను. దీని తర్వాత ఒక రియాలిటీ షోకి అవకాశం వచ్చింది. ‘అండమాన్‌లో పట్టణ ప్రజలు ఎలా ఉంటారు’ అనే టాపిక్‌ మీద ఆ షో నడిచింది. అక్కడ ఎవరి తిండి వారు వాళ్లే కష్టపడి సంపాదించుకోవాలి, ఫోన్‌ ఇతరత్రా సదుపాయాలేవీ ఉండవు.

అలాంటి చోట పదిహేను రోజులు ఉండటం చాలా కష్టమైంది. కానీ, వర్క్‌ నచ్చటంతో అంత దూరమైనా లెక్క చేయలేదు. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కన్నడలో ఓ సీరియల్‌ చేశాను. ఆ తర్వాత తెలుగులో ‘ముత్యాల ముగ్గు’ సీరియల్‌కి అవకాశం వచ్చింది. అయితే, పాజిటివ్‌ రోల్‌ కోసం ఎదురుచూస్తున్న నాకు మళ్లీ నెగిటివ్‌ రోలే వరించింది. ముందు కొంచెం నిరుత్సాహ పడ్డాను. తర్వాత నా రోల్‌ ప్రాధాన్యత తెలిసి చాలా సంతోషించాను. 

సరైన ఫీల్డ్‌
మా నాన్నగారు గణేష్‌ టీవీ సీరియల్‌ ఆర్టిస్‌. నేను ఈ ఫీల్డ్‌ రావాలని నాన్నగారు ఎప్పుడూ అనుకోలేదు. నేనూ ముందు ఆలోచించలేదు. చదువు తర్వాత లెక్చరర్‌గా స్థిరపడాలనేది నా ఆలోచన. అయితే, నాన్నగారు అనారోగ్యం కారణంగా చనిపోవడంతో సీరియల్‌ ఆఫర్స్‌ నాకు వచ్చాయి. అమ్మ, చెల్లి ఉన్నారు. నాన్న తర్వాత ఇంటి బాధ్యత నా మీద ఉంది. అందుకే ఆలోచించి సీరియల్‌కి ఓకే చేశాను. కన్నడ సీరియల్‌ తర్వాత ఆరునెలల పాటు ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో ఒక కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌ జాబ్‌లో చేరాను. అక్కడకు వచ్చినవారు నన్ను కలిసి ‘మీరు ఫలానా సీరియల్‌లో నటించారు కదా!’ అని దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుండేవారు. చాలా ఇబ్బంది అనిపించేది. పనిచేసే చోట ఇలాంటి వాతావరణం ఉండకూడదు అనుకున్నాను. ‘ఏ ఫీల్డ్‌లో గుర్తింపు వచ్చిందో ఆ ఫీల్డ్‌లోనే కొనసాగడం మంచిది’ అని ఆ తర్వాత సీరియల్‌ ఒప్పుకున్నాను. 

ముత్యాల ముగ్గు 
ఈ సీరియల్‌ తెలుగువారికి నన్ను చాలా చేరువచేసింది. హీరోయిన్‌ కన్నా పది రెట్ల ఎక్కువ ప్రాముఖ్యం ఉన్న పాత్ర. నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి ‘నందిక’ పాత్ర ఎంతో మేలు చేసింది. నా కెరియర్‌లో ఇదొక టర్నింగ్‌ పాయింట్‌. ఈ సీరియల్‌లో భూమి–అంబిక అక్కచెల్లెళ్లు. భూమి పల్లెటూరి అమ్మాయి, అంబిక సిటీ అమ్మాయి. భూమికి పూర్తి వ్యతిరేక పాత్ర నాది. నాకేదైనా, ఎవరైనా నచ్చారంటే వాళ్లు నాతోనే ఉండాలి. ఆ వస్తువు, ఆ మనిషి నాకే చెందాలి. అందుకోసం ఎంతదూరమైన వెళతాను. భూమి అంటే నాకు పడదు. నాకు నచ్చిన విరాట్‌ను తను పెళ్లి చేసుకుంటుంది. వాళ్లను విడదీసి విరాట్‌ను నేను సొంతం చేసుకోవాలి. ఎవరికి ఎలాంటి చెడు జరిగినా డోన్ట్‌ కేర్‌.. అన్నట్టుగా ఉంటుంది నా పాత్ర. నందికలో చాలా మధనం ఉంటుంది.  

బ్యాడ్‌ మార్క్‌ పడకూడదు
నెగిటివ్, పాజిటివ్‌ .. ఏ రోల్‌ చేసినా ఇక్కడ మన మీద ఒక్క బ్యాడ్‌ మార్క్‌ కూడా పడకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి. ఏ రోల్‌ వేసినా క్యాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్‌స్టైల్‌ ద్వారా మెప్పించాలి. ఒకసారి ప్రాజెక్ట్‌కి ఓకే చేశాక మన బాధ్యత చాలా ఉంటుంది. ఇండస్ట్రీలో హార్డ్‌ వర్క్‌కే ఎక్కువ ప్రాధాన్యత. నేనెక్కడా యాక్టింగ్‌ నేర్చుకోలేదు. క్లాసులకు వెళ్లింది లేదు. మా నాన్నగారు ఈ ఫీల్డ్‌లో ఉండటం వల్ల స్వతహాగా నాకు యాక్టింగ్‌ వచ్చి ఉంటుంది. అలాగే, నా సీనియర్‌ ఆర్టిస్టుల నుంచీ నటనలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటున్నాను.  
– నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement