
రైతులకు ఉన్న అనేకానేక కష్టాల్లో ఎరువుల ఖర్చు ఒకటి. పోనీ ఇంత ఖర్చు పెట్టి వేసిన ఎరువులు పూర్తిస్థాయిలో ఫలితమిస్తాయా? అంటే అదీ లేదు. వానొస్తే లేదా నీళ్లల్లో కలిస్తే ఎరువులు వాటితో కొట్టుకుపోతాయి. ఈ నేపథ్యంలో అడిలైడ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గ్రాఫీన్ ఆక్సైడ్ పదార్థం ఆధారంగా కొత్త రకం ఎరువులను తయారు చేశారు. భూమిలోకి చేరిన తరువాత ఇవి చాలా నెమ్మదిగా తమ లోపల ఉండే ఎరువులను విడుదల చేస్తాయి. సాధారణ ఎరువులు కేవలం 12 నుంచి 24 గంటల్లోపు వాటిలోని పోషకాలన్నింటినీ విడుదల చేసేస్తాయి. ఈ క్రమంలో అవసరమైన సమయంలో మొక్కలకు ఎరువులు అందే అవకాశం లేకుండా పోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైక్ మెక్‌లాగిన్ తెలిపారు.
అయితే గ్రాఫీన్ ఆక్సైడ్ ఆధారంగా తయారైన ఎరువులు నెలరోజుల వరకూ పోషకాలను నెమ్మదిగా విడుదల చేసేలా తయారు చేసుకోవచ్చునని మైక్ తెలిపారు. తాము తమ పరిశోధనల్లో జింక్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలను గ్రాఫీన్ ఆక్సైడ్ ద్వారా గోధుమ పంటకు అందించారు. సాధారణ ఎరువులతో పండుతున్న పంటలతో పోల్చి చూసినప్పుడు గ్రాఫీన్ ఆక్సైడ్ ఎరువులు వాడిన పంటల్లో ఈ రెండు సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని మైక్ వివరించారు. భూమిలో ఉండే సేంద్రియ కార్బన్ నిర్మాణాన్ని దగ్గరగా పోలి ఉండటం వల్ల గ్రాఫీన్ ఆక్సైడ్ వాడకం పర్యావరణపరమైన సమస్యలేవీ సృష్టించదని మైక్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment