‘ఐ లవ్‌ యూ’ చెబితే లవ్‌ అయిపోతుందా? | Nithya Menon Exclusive Interview In Sakshi Family | Sakshi
Sakshi News home page

నిన్ను నువ్వు ప్రేమించుకో

Published Sun, Aug 25 2019 6:45 AM | Last Updated on Sun, Aug 25 2019 1:00 PM

Nithya Menon Exclusive Interview In Sakshi Family

ప్రేమించడానికి ఇంకొకరు అక్కర్లేదు. మనల్ని మనం ప్రేమతో నింపుకుంటే  ప్రపంచం అంతా చాలా ప్రేమగా కనబడుతుంది. సంతోషంగా ఉన్న మనిషి సంతోషాన్ని పంచినట్లు..ప్రేమ నిండిని మనిషి ప్రేమను పంచుతాడు. ప్రేమ ఒక అనుభవంగా మిగిలిపోకూడదు. ఒక అనుభూతిగా నిలిచిపోవాలి.నిన్ను నువ్వు ప్రేమించుకో. నీకంటే మంచివాళ్లు లేరు అంటున్నారు నిత్యామీనన్‌.

‘మిషన్‌ మంగళ్‌’ పెద్ద విజయం సాధించింది. బాధ్యతాయుతమైన ఇలాంటి సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టినందుకు ఎలా అనిపిస్తోంది?
నిత్యామీనన్‌: మార్స్‌ మీద మన స్పేస్‌ రీసెర్చ్‌ వాళ్లు చేసిన మిషన్‌కి సంబంధించిన సినిమా ఒకటి చేసే ప్లాన్‌ ఉందని బాల్కీ (బాలీవుడ్‌ దర్శకుడు, రచయిత) నాతో చెప్పారు. మన భారతదేశం సాధించిన ఘనతకు సంబంధించిన సినిమా ఇది. బాల్కీ చెప్పగానే చాలా మంచి విషయం అనిపించింది. ‘మంచి సినిమా చేయాలి’ అన్నది ఎప్పుడూ నా గోల్‌. అందుకే ‘మిషన్‌ మంగళ్‌’ ఒప్పుకున్నా. ఈ సినిమా చేసినందుకు గర్వంగా, ఇలాంటి సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది.

మీ కథల ఎంపిక  బావుంటుంది. అయితే ‘మిషన్‌ మంగళ్‌’ కథలో మరో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. మీ పాత్రకు ప్రాధాన్యం తగ్గుతుందేమో అనిపించలేదా? 
నేను వేరే హీరోయిన్లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. నాకిది కొత్త కాదు. ఒక సినిమా ఒప్పుకోవడానికి నేను పట్టించుకునే విషయాల్లో ఇది చాలా చిన్న విషయం. మనం యాక్టర్‌ అయ్యాక చాలా మందితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే హీరోయిన్లతో కలసి నటించనప్పుడు మనం ఎలా యాక్టర్స్‌ అవుతాం? అన్ని సినిమాల్లో నేనే ఉండాలి, ప్రాముఖ్యతంతా నాకే ఉండాలి.. అన్నీ నేనే, అన్నీ నాకే అనుకుంటే కుదరదు. ఎంతోమంది కలసి కష్టపడి చేస్తేనే ఒక సినిమా పూర్తవుతుంది. అఫ్‌కోర్స్‌.. నా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నేను ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను.

సాధారంగా బాలీవుడ్‌లో ఫస్ట్‌ సినిమా సైన్‌ చేసేటప్పుడు ‘సోలో’ హీరోయిన్‌ అయితే ఎక్కువ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది కదా? 
అలా సోలో హీరోయిన్‌గా చేయాలంటే హిందీ నుంచి నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ‘ఓకే బంగారం’ సినిమా తర్వాత పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు నాకు హీరోయిన్‌గా ఆఫర్స్‌ ఇచ్చాయి. ‘సోలోగా వెళ్తే బెటర్‌’ అని నేనెప్పుడూ అనుకోలేదు. అందుకే ఆ కథల్లో ఒకే హీరోయిన్‌ అయినా కథ, పాత్ర బాగా లేవని ఒప్పుకోలేదు. వేరే హీరోయిన్లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోకూడదని ఆలోచించేదాన్నే అయితే తెలుగులో వేరే వేరే సినిమాలు చేసేదాన్ని. నా ఆలోచనా విధానం ఎప్పుడూ అలా లేదు. ‘మిషన్‌ మంగళ్‌’ అనే మంచి సినిమాను నా దగ్గరకు తీసుకొచ్చారు. నా యాక్టింగ్‌ స్కిల్స్‌ వాళ్లకు తెలుసు. నా గత సినిమాలు చూశారు. నా మీద చాలా గౌరవంతో వచ్చారు. కథ, పాత్ర నచ్చడంతో ఒప్పుకున్నాను. 

మహిళలు సాధించిన విజయాన్ని చూపించే చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. మరి ఇలాంటి సినిమాలో కూడా అక్షయ్‌ కుమార్‌ లాంటి స్టార్‌ సపోర్ట్‌ ఉండాలంటారా? 
నేను అంత ఆలోచించలేదు. ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చాలా ఉన్నాయి. హిట్‌ అయ్యాయి కూడా. తెలుగు, తమిళం, హిందీలో అన్ని భాషల్లోనూ లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ వస్తున్నాయి. ఈ సినిమాకి అక్షయ్‌కుమార్‌ ఓ నిర్మాత. చిత్రదర్శకుడు జగన్‌శక్తి అక్షయ్‌ కుమార్‌ చేస్తే బావుంటుంది అనుకున్నారు. చేయించారు.

పోస్టర్‌లో హీరోయిన్ల బొమ్మలు చిన్నవి, అక్షయ్‌ కుమార్‌ ఫొటో పెద్దదిగా డిజైన్‌ చేయించారు. మహిళా ప్రాధాన్యంగా సాగే సినిమాకి హీరోని ఎలివేట్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో జరిగిన చర్చ గురించి?
ఈ టాపిక్‌ గురించి కామెంట్‌ చేయడానికి నాకు ఇష్టం లేదు. ఒక టీమ్‌గా మాకందరికీ ఒకరంటే ఒకరికి చాలా గౌరవం. అక్షయ్‌ సార్‌ నన్ను చాలా బాగా చూసుకున్నారు. అయితే జెండర్‌ డిస్కషన్‌ ఎక్కువే జరిగింది. మనం అందరం వీటి గురించి చర్చలు ఆపేసి మన పని మనం చేసుకుంటే మనకు కావాల్సిన గుర్తింపు అదే వస్తుందని నా అభిప్రాయం. అంతేకానీ మగవాళ్లు ఎక్కువ.. ఆడవాళ్లు కాదా? అంటూ ఊరికే పోలుస్తూ, అనవసరమైన చర్చలు జరపడం వేస్ట్‌. నెగటివిటి కంటే మనందరం కలసి ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోతే మంచిది అనే విషయాన్ని నమ్ముతాను.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ‘నేను ముందు యాక్టర్‌ని ఆ తర్వాతే హీరోయిన్‌ని’ అనే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. రెగ్యులర్‌ హీరోయిన్‌గా మిమ్మల్ని మీరు భావించరా?
నేను హీరోయిన్‌ని కాదు. తెలుగులో ఎలా స్టార్ట్‌ అయ్యానో (తొలి సినిమా ‘అలా మొదలైంది’) మీకు తెలుసు కదా. ఆ సక్సెస్‌తో రెగ్యులర్‌ హీరోయిన్‌ అయిపోవచ్చు. కానీ విభిన్నమైన మార్గంలో వెళ్లాను. అప్పుడూ ఇప్పుడూ అలానే ఉన్నాను. చిన్న పాత్ర అయినా సరే చేశాను. యాక్టర్‌గా అదే నా గుర్తింపు అనుకుంటాను. యాక్టర్‌ అనే వాళ్లు ‘సెల్ఫ్‌ సెంటర్డ్‌’ గా ఉండరు. అన్నింట్లో ప్రాధాన్యం, కథంతా తమ చుట్టే తిరగాలి అన్నట్టు ఉండరు. కథలో కీలకంగా ఉంటే చాలనుకుంటారు.

ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. ‘సెల్ఫ్‌ లవ్‌’ అని ఈ మధ్యన ఫొటోషూట్‌ చేసుకున్నారు. అసలా ‘సెల్ఫ్‌ లవ్‌’ కాన్సెప్ట్‌ ఏంటి?
లవ్‌ అనేది చాలా తప్పుగా అర్థం చేసుకున్న పదం. లవ్‌ అంటే  ‘ఐ లవ్‌ యూ’  అని చాలామంది అనుకుంటారు. ‘ఐ లవ్‌ యూ’ చెబితే లవ్‌ అయిపోతుందా? అవదు. వేరే వాళ్ల మీద చూపించేది లేదా మనల్ని మనం ప్రేమించుకునేది ప్రేమ.. ఇలా లవ్‌ గురించి ఏదేదో అనుకుంటున్నాం. లవ్‌ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. రిలేషన్‌షిప్స్‌లో ఉన్న అసంతృప్తి ఎందుకంటే ప్రేమ కోసం  చాలా ఆరాటపడుతూ వెతుకుతున్నారు. ప్రేమ అనేది ఈ లోకంలో లేదు. మన లోపల ప్రేమ ఉంటే బయట అంత ఆరాటపడుతూ వెతకం.

లోపల ఉన్న ప్రేమను మనం వ్యక్తపరచగలం. అది ట్రూ లవ్‌. ప్రేమ అనేది ఎప్పుడూ మనతోనే మొదలవుతుంది. అది నీతో మొదలు కానప్పుడు అది ప్రేమే కాదు. అప్పుడు ప్రేమ అనేదే లేదు. నేను ఎప్పుడూ మనిషిగా ఎదుగుతుంటాను. నేర్చుకుంటూ ఉంటాను. అలాంటి సెల్ఫ్‌ రియలైజేషన్‌లో నేను గ్రహించింది ‘సెల్ఫ్‌ లవ్‌’. (మనల్ని మనం ప్రేమించుకోవడం). మనల్ని మనం ప్రేమించుకుంటే మనం ప్రేమను పంచగలుగుతాం. దాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయాలనుకున్నాను. అందుకే ఫొటోషూట్‌ చేశాను. ఫొటోషూట్‌ అయ్యాక ‘సెల్ఫ్‌ లవ్‌’ అని పేరు పెడదాం అని మా కెమెరామేన్‌ అన్నారు. పర్ఫెక్ట్‌ ఇదే పెడదాం అన్నాను.

మీరు ఇతరుల నుంచి ప్రేమను ఆశించి అది దొరకనందువల్లే ‘సెల్ఫ్‌ లవ్‌’ అంటున్నారా?
నేనే కాదు మనమందరం ప్రేమను కోరుకుంటాం. అది మనిషి సహజ స్వభావం. అయితే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన లోపల ప్రేమ ఉండాలన్నది నా అభిప్రాయం.

ఈ మధ్య ఆధ్యాత్మిక ఆశ్రమాలకు వెళుతున్నారని విన్నాం. దాని గురించి? 
అవును. వెళుతున్నాను. ఎక్కువగా ఆధ్యాత్మిక బాటలో వెళుతుంటాను. ఈ దారి గురించి బయటకు చెప్పలేను. అది ఎక్స్‌పీరియన్స్‌ చేసినవారికే అర్థమవుతుంది.

ఇది సడెన్‌గా వచ్చిందా? చిన్నప్పటి నుంచేనా?
స్పిరిచ్యువల్‌గా ఆలోచించడం అనేది చిన్నప్పటి నుంచే అలవాటు. రెలీజియస్‌గా కాదు (దేవుడు, మతం.. ). అయితే వీటన్నింటి కన్నా పెద్దది ఏదో ఉంది అని నమ్ముతాను.

మీ పాయింటాఫ్‌ వ్యూలో స్పిరిచ్యువాలిటీకి, రెలీజియన్‌కి ఉన్న తేడా?
రెలీజియస్‌ అనేది బయట నుంచి ఏర్పరుచుకున్నది. మనం నమ్మిన సిద్ధాంతం కోసం ఉండటం. స్పిరిచ్యువాలిటీ అనేది మొత్తం నీ గురించే. అంతా నువ్వే. నీకు, ఆ పవర్‌కు ఉన్న అనుబంధమే ఆధ్యాత్మికం. ఈ దారిలో వెళుతూ వెళుతూ ఫైనల్‌గా తెలుసుకునేది ఏంటంటే ‘నువ్వే ఆ సూపర్‌ పవర్‌’ అని. 

స్పిరిచ్యువాలిటీలో మనమే దేవుడు అనుకునే స్టేజ్‌ కూడా ఉంటుంది. దాని గురించి? 
దీని గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడటం కరెక్ట్‌ కాదు. దేవుడు, మనం వేరు కాదు అని చెబితే పూర్తిగా అర్థం కాదు. చెప్పిన దాన్ని సరిగ్గా తీసుకోకపోతే మొత్తం తప్పు అర్థం ధ్వనిస్తుంది. స్పిరిచ్యువాలిటీ గురించి మాట్లాడటం కష్టం. దీన్ని అనుభవించాల్సిందే. అది ఓ ఎక్స్‌పీరియన్స్‌. అందరికీ ఆ ఎక్స్‌పీరియన్స్‌ రావాలి. ఇప్పుడు ఎవరి జీవితంలో చూసినా ఒత్తిడే ఉంది. నేను అందరికీ ఏం చెబుదాం అనుకుంటున్నానంటే... మీరు స్ట్రెస్‌లో ఉంటే.. అది వృత్తిపరమైనది కావొచ్చు, వ్యక్తిగతమైనది కావొచ్చు.. ఒత్తిడిలో ఉన్నప్పుడు రాత్రి నిద్రపోయే ముందు రిగ్రెట్‌ ఫీల్‌ అవుతాం. ఇలా చేయకుడదు, ఇలా అని ఉండకూడదు అని ఆలోచిస్తాం. ఆ ఆలోచన వచ్చిందంటే మనం ‘సఫరింగ్‌ స్టేజ్‌’లో ఉన్నాం అని అర్థం. అలా ఉన్నప్పుడు లైఫ్‌లో ఇది సాధారణమే అనుకుని వదిలేయకూడదు. ఇంతకంటే హ్యాపీగా ఉండొచ్చు అనే నమ్మకం పెంచుకోవాలి. ఆ నమ్మకం ఉంటే ఆనందం మన దగ్గరకు వచ్చేస్తుంది.

ఆ మధ్య ‘కారు అనేది నా ఫ్రెండ్‌. నేను ఇండిపెండెంట్‌ అని అదే తెలియజేసింది’ అన్నారు. కారుతో ‘ఇండిపెండెంట్‌’ ఫీలింగ్‌ రావడం ఏంటి?
కారు మాత్రమే కాదు. అది ఓ చెట్టు, ఇల్లు ఏదైనా అవ్వొచ్చు. నాకు సోల్‌ అటాచ్‌మెంట్‌ చాలా ఉంటుంది. ప్రతీదీ ఓ అనుభవమే. నేను ఫస్ట్‌ కారు కొన్నప్పుడు వ్యక్తిగతంగా ఏదో సాధించాననిపించింది. నా సొంత సంపాదనతో కొనుకున్నాను. నాకు స్వాతంత్య్రం వచ్చింది అనే భావన కలిగింది. ఎవరి మీదా ఆధారపడకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు అనే ఫీలింగ్‌. నాకు డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. అప్పటి వరకూ వేరేవాళ్ల కారు తీసుకొని డ్రైవ్‌ చేసేదాన్ని. సొంత కారు కొనుక్కున్న తర్వాత స్వేచ్ఛ వచ్చిన ఫీలింగ్‌. జనరల్‌గా మనందరం ఏవేవో కొనుక్కుంటాం. ఉదాహరణకు కారుని తీసుకుందాం, అది కారు అనుకుంటే జస్ట్‌ కారు.. అంతే. అంతకుమించి అనుకుంటే దానితో సోల్‌ అటాచ్‌మెంట్‌ ఉంటుంది.

ఓకే.. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ చేస్తున్నారు కదా? ఆ సినిమా విశేషాలు?
ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభించాలనుకుంటున్నాం. దర్శకురాలు ప్రియదర్శిని ఏదో క్యాష్‌ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయాలనుకోవడంలేదు. ఎప్పుడు ఆరంభించాలి? ఎప్పుడు రిలీజ్‌ చేయాలనేది ముఖ్యమైన విషయంగా ఆమె అనుకోవడంలేదు. క్వాలిటీ ఫిల్మ్‌ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి కావొచ్చింది.

బయోపిక్‌ చేయడం అనేది ఏదైనా ఒత్తిడిగా ఉంటుందా?
రెగ్యులర్‌ చిత్రాలకు, బయోపిక్‌కి చాలా తేడా ఉంది. కల్పిత పాత్రలనుకోండి మన ఇష్టం వచ్చినట్లు మనం చేయొచ్చు. అదే నిజజీవిత పాత్రలనుకోండి.. వాళ్లు నడిచినట్లు నడవాలి, చూసినట్లు చూడాలి.. అంతా వాళ్లలా కనిపించాలి. అయితే నాకు ప్రెజర్‌ ఏమీ లేదు. ఏ క్రియేటివ్‌ పర్సన్‌ అయినా ఒత్తిడికి గురి కాకూడదని నా అభిప్రాయం. ఒకవేళ ప్రెజర్‌ ఫీలైతే సరిగ్గా వర్క్‌ చేయలేరు. ఈ సినిమా కమిట్‌ అయినవాళ్లందరం బాగా చేయగలుగుతామనే నమ్మకంతో ఉన్నాం. 
ఫైనల్లీ కాస్త బరువు పెరిగారని ఆ మధ్య సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. ఈ ‘వెయిట్‌ ఇష్యూస్‌’ గురించి?
(నవ్వేస్తూ). అవతలివాళ్ల బరువు గురించి చర్చించుకోవడానికి మించిన మంచి విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాల గురించి చర్చించుకోవచ్చు. బరువుది ఏముంది? ఇవాళ ఉంటుంది. తగ్గిస్తే కొన్నాళ్లకు అదే తగ్గిపోతుంది. ఇదిగో ఆ మధ్య నేను కొంచెం లావుగా ఉన్నానా?  ఆ తర్వాత తగ్గాను. అందరూ అన్నారని కాదు.. నాకే తగ్గాలనిపించి తగ్గాను. కొన్ని ‘నెగటివ్‌ మైండ్స్‌’ చుట్టూ ఉన్న పాజిటివిటీని పట్టించుకోకుండా నెగటివ్‌ని మాత్రమే మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తాయి. ప్రపంచంలో చాలా పాజిటివిటీ ఉంది. దాని గురించి మాట్లాడుతూ హ్యాపీగా ఉండండి. మీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. నిజానికి నేను విమర్శలను మనసుకి తీసుకోను. వాటిని పెద్దవిగా చేసి బాధపడిపోను. చాలా ‘లో థింకింగ్‌’ ఉన్నవాళ్లు మాట్లాడే మాటలకు ప్రాధాన్యం ఇవ్వను. నా చుట్టూ ఉన్న పాజిటివిటీని చూస్తాను. నేను చాలా ‘హ్యాపీయస్ట్‌ పర్సన్‌’ని. 

మీరు ఓ కీలక పాత్ర చేసిన ‘అ!’  సినిమాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దాని గురించి?
చాలా చాలా సంతోషంగా ఉంది. ‘అ!’ అనేది తెలుగులో చాలా ప్రయోగాత్మక చిత్రం అని చాలామంది అన్నారు. తెలుగులో ఇలాంటి భిన్నమైన సినిమాలు రావాలని, కొత్త కొత్త విషయాలు చెప్పాలని ఎప్పుడూ అనుకున్నాను. ‘అ!’ సినిమాకు నేను చాలా సపోర్ట్‌ చేశాను. మేమందరం ఓ ఫ్రెండ్‌షిప్‌తో చేశాం. ఆ సినిమా వర్కౌట్‌ అయింది. అందరం చాలా హ్యాపీ. ఇష్టపడి చేసిన సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు వస్తే ఆ హ్యాపీనెస్‌ని మాటల్లో చెప్పలేం.n ‘బ్రీత్‌ 2’తో

వెబ్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆ సిరీస్‌ విశేషాలు?
సినిమాలకి, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కి ఉన్న తేడా ఏంటంటే.. సినిమా ప్రేక్షకులు భారీగా ఉంటారు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రేక్షకులను ఊహించగలుగుతాం. అందుకే వాళ్లని మాత్రమే టార్గెట్‌ చేసి, స్క్రిప్ట్‌ రాపే వీలుంటుంది. ఏ కథ అయినా చూపించే స్కోప్‌ ఉంటుంది. ‘సెన్సిబుల్‌ స్టోరీ’లో నటించే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంతకుముందు నాలుగైదు వెబ్‌ సిరీస్‌లు చేసే చాన్స్‌ వచ్చినా, కంటెంట్‌ సంతృప్తిగా అనిపించకపోవడంతో ఒప్పుకోలేదు. ‘బ్రీత్‌ 2’ నాకో మంచి అనుభూతి ఇచ్చింది.

ప్రో కబడ్డీకి కామెంట్రీ చెప్పారు? ఆ ఎక్స్‌పీరియన్స్‌ గురించి?
‘మిషన్‌ మంగళ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా మూడు భాషల్లో ప్రో కబడ్డీకి కామెంట్రీ చెప్పాలన్నారు. ముందు తెలుగులో చెప్పాలని అడిగారు. కామెంట్రీ బాక్స్‌లో కూర్చుని గేమ్‌ చూస్తూ, చెప్పడం ఓ మంచి అనుభూతి. అప్పటివరకు నేను కామెంట్రీ బాక్స్‌లో కూర్చోలేదు. చాలా ఎంజాయ్‌ చేశాను. అందుకే మళ్లీ చెప్పించాలనుకుంటే పిలవండి అని చెప్పాను. 
– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement