ఈఎన్‌టీ కౌన్సెలింగ్
నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. ఈ సమస్యనుంచి బయటపడటానికి చాలా రకాల మందులు వాడాను. ప్రస్తుతం మెడికల్ షాపుల్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. అయితే ఆ మందుకు అలవాటు అవుతానేమో అనే ఆందోళనతో మానేశాను. దాంతో రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు.
- హుసేన్ మియా, విజయవాడ
ఇటీవల వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల మీరు చెబుతున్న సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. పైగా చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యల వల్ల ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట బయటపడే వాటిల్లో ముక్కుకు సంబంధించిన సమస్యలే ఎక్కువ. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడమో లేదా అలర్జీ ఉండటమో లేదా ముక్కులో పాలిప్స్ ఉండటమో లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండటమో జరగవచ్చు. మొదట మీరు నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్‌ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.
మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చిన సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులకు దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డాక్టర్ ఈసీ వినయకుమార్
హెచ్‌ఓడి అండ్ ఇఎన్‌టి సర్జన్
అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్