
గండికోట లోయలు పెన్నానది హొయలు...
మలుపులుగా పెన్నా నది జమ్మలమడుగు మండలానికి పడమర దిక్కుగా సుమారు 14 కి.మీ దూరంలో గల ఎర్రమల పర్వతశ్రేణికి వెళ్లాలి.
ఇరుకు లోయల్లో మలుపులు తిరిగిన పెన్నానది హొయలు
దట్టమైన అడవుల మధ్య ఎత్తై ఎర్రమల గిరులు
గత వైభవానికి ప్రతీకగా నిలిచిన శిథిలమైన కోట
జైన, శైవ, వైష్ణవ ఆలయాలు, మసీదుల నిర్మాణ శైలులు
ఎటుచూసినా చారిత్రక వైభవం
అడుగడుగునా మనోహరమైన ప్రకృతి సౌందర్యం
కనులకు విందు చేసే ఈ ప్రాంతం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలోని గండికోట గ్రామంలో ఉంది.
‘గండికోట’ పేరు వినగానే ‘గండికోట రహస్యం’ సినిమా గుర్తుకొస్తుంది చాలామందికి. నిజంగా గండికోట ఉందా! అని ఆశ్చర్యపడేవారు ఇప్పటికీ ఉన్నారు. చారిత్రక వైభవా న్ని కళ్లకు కడుతూ కనువిందుచేస్తోన్న గండికోట గురించి తెలుసుకోవాలంటే..!
మలుపులుగా పెన్నా నది జమ్మలమడుగు మండలానికి పడమర దిక్కుగా సుమారు 14 కి.మీ దూరంలో గల ఎర్రమల పర్వతశ్రేణికి వెళ్లాలి. పర్వత పాద భాగంలో పెన్నా నది ఒంపులుగా ప్రవహిస్తోంది. 1000 అడుగుల వెడల్పు 500 వందల అడుగుల లోతుతో 5 కి.మీ పొడవున సహజంగా ఏర్పడిన కందకం ఉంటుంది. దీనినే గండి అంటారు.
గంభీరంగా... గండికోట...
లోయకు తూర్పున ఎత్తై ఎర్రమల కొండల మీద నిర్మించబడింది గండికోట. 12వ శతాబ్దంలో కల్యాణ చాళుక్యుల పరిపాలనలో ఈ ప్రాంతాన్ని ‘ములికినాడు సీమ’గా పిలిచేవారట. ములికినాడు సీమకు రాజప్రతినిధిగా నియమింప బడిన కాకరాజు ఈ ప్రాంతాన్ని శత్రుదుర్భేద్యంగా గుర్తించి, కోటను నిర్మింపచేశాడని, ఆ తర్వాత కాలంలో విజయనగరసామంతరాజు పెమ్మసాని తిమ్మనాయుడు కోట చుట్టూ ఉన్న మట్టి గోడను తొలగించి 101 బురుజులున్న రాతి కోట నిర్మించి ‘గండికోట సీమ’ గా పేరు మార్చాడని చెబుతారు. మాధవస్వామి ఆలయం, శివాలయాలతో పాటు నీటి కొలనుల నిర్మాణాలు ఇతని హయాంలోనే జరిగాయి. గండికోట అత్యంత వైభవంగా విలసిల్లి, ప్రజాదరణకు నోచుకుంది ఇతని కాలంలోనే! విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తరువాత గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్‌షా సైన్యాధికారి మీర్ జుమ్లా ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. గండికోటను కడప నవాబులు కూడా పాలించినట్లు తెలుస్తోంది.
శిల్పకళా సంపద...
మాధవస్వామి దేవాలయం నాలుగు అంతస్తుల గోపురంతో నాలుగువైపులా ద్వారాలతో తూర్పుముఖంగా ఉంటుంది. లోపల నైఋతి మూల ఎత్తై శిలాస్తంభాలతో మధ్యన కల్యాణ మండపం, ఆగ్నేయంగా పాకశాల, అలంకారశాల, ఉత్తరాన ఆళ్వారుల ఆలయం, దాని పక్కగా 55 స్తంభాలతో వసారా ఉన్నాయి. గర్భగుడి, నాట్య మండపాలలోని శిల్పకళ కళ్లు చెదిరేలా ఉంటుంది. అందుకే ఫ్రెంచ్ ట్రావెలర్ టావెర్నీర్ గండికోట ప్రాభవం చూసి దానిని రెండవ హంపీగా పేర్కొన్నారు. కోట ధాన్యాగారానికి ఉత్తరాన ఉన్న ఎత్తై గుట్టపై రఘునాథ ఆలయం ఉంది. ఈ ఆలయప్రాకారంలో ఉన్న కళ్యాణమండపం, గర్భగుడి చుట్టూ ఉన్న శిల్ప సౌందర్యం అబ్బురపరుస్తాయి. గండికోట లోపల, వెలుపల మొత్తం పన్నెండు దేవాలయాలు ఉన్నాయి. కోట లోపల ‘రాయల చెరువు’ ఉంది. నాడు ఇక్కడ నుండే కోటలోపల వ్యవసాయ భూములకు, ప్రజలకు నీరు అందేదట. ఇది కాకుండా పెన్నానది నుంచి నీటిని తీసుకునేవారట.
మరికొన్ని...
గండికోటలోని జుమా మసీదు, ధాన్యాగారం, కారాగారం, కత్తుల కోనేరులు పర్యాటకులకు ఆసక్తిని పెంచుతాయి. ప్రాచీనశైవక్షేత్రమైన కన్యతీర్థం, ఆరవ శతాబ్దం నాటి దానవులపాడు, జైనక్షేత్రం, శైవక్షేత్రమైన... గురప్పనికోన, అగస్తీశ్వరకోన, పీర్‌గైబుసాకొండ చూడదగినవి.
టూరిజమ్ వారిచే ఏర్పాటు చేసిన హోటల్‌లో ఎసి, నాన్ ఎసి గదులు అందుబాటులో వున్నాయి. ఈ ప్రాంతంలోని కట్టడాలపై దృష్టి సారించి మరమ్మతులు చేస్తే గండికోట మరో గోల్కొండగా సాక్షాత్కరిస్తుంది.
- అబ్దుల్ బషీర్, న్యూస్‌లైన్, జమ్మలమడుగు
ఇలా వెళ్లాలి
కడప నుంచి జమ్మలమడుగు 70 కి.మీ. ఇక్కడ రైల్వేస్టేషన్ ఉంది.
జమ్మలమడుగు నుంచి దక్షిణంగా వెళితే గండికోట 14 కి.మీ.
హైదరాబాద్ నుంచి 7వ నంబర్ జాతీయ రహదారి కర్నూలు మీదుగా బనగానపల్లి,
కోవెలకుంట్ల, జమ్మలమడుగు చేరుకోవచ్చు.
కర్నూలు నుండి తిరుపతి వెళ్లే దారి గుండా నంద్యాల, ఆళ్ళగడ్డ, మైదుకూరు నుండి కుడివైపుకి తిరిగి పొద్దుటూరు మీదుగా జమ్మలమడుగు చేరుకోవచ్చు.