శీలమే మూలం! | Permeation source! | Sakshi
Sakshi News home page

శీలమే మూలం!

Published Sun, Dec 15 2013 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

Permeation source!

సకల జీవుల పట్ల దయతో ఉండటం, ఎవరికీ ద్రోహం తలపెట్టకుండా, ఓపికున్నంత వరకు పరులకు మేలు చేయడం, ఎదుటివాడు తప్పు చేస్తే వాడు సిగ్గుపడేలా కాక తన దోషాన్ని చక్కదిద్దుకునేలా బోధించడం, అందరూ మెచ్చుకునేటట్లుగా మంచిగా ప్రవర్తించటం, పేరాశను విడిచిపెట్టడం శీలవంతుల లక్షణం.
 
 ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయయాగం చేశాడు. అతని వైభవం చూసి అసూయపడి తండ్రి దగ్గరకు వెళ్లి తన దుగ్ధ వెళ్లబోసుకున్నాడు దుర్యోధనుడు. ‘‘నాయనా! నాకు మాత్రం తక్కువ ఐశ్వర్యం ఉందా? అయితే ధర్మరాజు నీకంటే ఎక్కువగా ప్రకాశించడానికి కారణం అతడు శీలవంతుడు కావడమే. శీలవంతులను లక్ష్మి వరిస్తుంది. కనుక నువ్వు కూడా శీలవంతుడవైతే సకల సంపదలూ పొందగలవు’’ అంటూ శీల సంపద గురించి దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు ఒక కథ చెప్పాడు.
 
 ‘‘ప్రహ్లాదుడు రాక్షస కులశ్రేష్ఠుడు. సకల విద్యాపారంగతుడు. జనరంజకంగా పాలన చేయగల సమర్థుడు. ఇంద్రరాజ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇంద్రుడిని అక్కడి నుంచి తరిమివేసి ధర్మయుక్తంగా పాలించసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు తనకు ఇంద్రలోకాధిపత్యం మళ్లీ వచ్చే విధానం చెప్పవలసిందంటూ సురగురువైన బృహస్పతిని ప్రార్థించాడు. బృహస్పతి భార్గవుడిని అడగమన్నాడు.
 
 ఇంద్రుడు వెళ్లి భార్గవుడిని ఆశ్రయించాడు. అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతన్నే అడిగి తెలుసుకుని ఉపాయంగా ఆ శక్తిని అడిగి పుచ్చుకో’’ అని సలహా ఇచ్చాడు భార్గవుడు.
 
 ఇంద్రుడు విప్రుని వేషం ధరించి ప్రహ్లాదుడికి శిష్యుడై భక్తితో సేవలు చెయ్యడం ప్రారంభించాడు. చాలాకాలం గడిచింది. ప్రహ్లాదుడు ప్రసన్నమయ్యాడు. ‘‘నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు’’ అని అడిగాడు. ‘‘అయ్యా! మీకు త్రిలోకాధిపత్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది’’ అన్నాడు శచీపతి వినయంగా.
 
 ‘‘ఏముంది, నేను ఎప్పుడూ రాజుననే గర్వంతో ప్రవర్తించను. ఎవరినీ నొప్పించను. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ మొదలైన దుర్గుణాలేవీ మనస్సులోకి రానివ్వను. ఎవరు ఏది అడిగినా లేదనకుండా, కాదనకుండా సంతోషపెడతాను. పురాకృత పుణ్యం వల్ల బ్రహ్మర్షులు మెచ్చుకునే శీలం ఉన్నది కనుక ఇంతటి మహోన్నత పదవి లభించింది నాకు’’ అన్నాడు ప్రహ్లాదుడు.
 
 ‘‘అయ్యా! మీరు నిజంగా మహాత్ములు. దానశీలురు. నాయందు దయ ఉంచి మీ శీల సంపదను నాకు ఇవ్వండి’’ అని ఇంద్రుడు ప్రహ్లాదుని దీనంగా యాచించాడు.
 ‘ఎంత దీనంగా అర్థిస్తున్నాడు’ అనుకుని ‘సరే’అన్నాడు ప్రహ్లాదుడు. ఇంద్రుడు పన్నిన పన్నాగంలో ప్రహ్లాదుడు చిక్కుకున్నాడు. ఆ తరువాత ప్రహ్లాదుని శరీరం నుంచి మహాతేజస్సుతో ఒక పురుషుడు బయటకు వచ్చాడు. ‘‘నువ్వెవరు’’ అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు.
 
 ‘‘నేను శీలాన్ని. నువ్వు నన్ను ఆ విప్రుడికి దానం చేశావుగా, అతని దగ్గరకు వెళ్లిపోతున్నాను’’ అని వెనుతిరగకుండా వెళ్లిపోయాడు ఆ దివ్యపురుషుడు.
 ఆ వెనుకే ప్రహ్లాదుని శరీరం నుంచి సత్యం, రుజువర్తన, బలం కూడా మెల్లగా బయటకు వెలువడటం ప్రారంభించాయి. చివరగా అతిలోక సౌందర్యరాశి అయిన ఒక స్త్రీ అతని శరీరం నుంచి బయటకు వచ్చింది. ‘‘నువ్వెవరు తల్లీ?’’ అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు.
 
 ‘‘నేను లక్ష్మిని, బలం ఎక్కడుంటే అక్కడ ఉంటాను. వెళుతున్నాను’’ అంది లక్ష్మీదేవి. ‘‘అయ్యో తల్లీ! నన్ను విడిచి వెళుతున్నావా? ఇంతకూ అంత వినయంగా ఇన్నాళ్లూ నన్ను సేవించిన ఆ విప్రుడెవరు?’’ అని సిరిని అడిగాడు ప్రహ్లాదుడు. ‘‘అతను ఇంద్రుడు. నీ వైభవాన్ని ఎగరేసుకుపోవడం కోసం వచ్చాడు. నువ్వు అతని మాయలో పడి నీ శీలాన్ని అతనికి ధారపోశావు. శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యాన్ని అంటిపెట్టుకుని మంచి నడవడి, దానివల్ల బలం, బలాన్ని ఆశ్రయించి నేను ఉంటాం. కనుకనే అన్నింటి కీ ‘శీలమే మూలం’ అని చెప్తారు. నువ్వు శీలాన్ని పోగొట్టుకున్నావు కనుక నేను ఇక నీ దగ్గర ఉండటం అసంభవం’’ అని చెప్పి వెళ్లిపోయింది శ్రీదేవి.
 ‘‘కనుక, దుర్యోధనా, శీలవంతుడవై వర్థిల్లు’’ అని దుర్యోధనుడికి హితవు చెప్పాడు ధృతరాష్ర్టుడు.
 
 - శొంఠి విశ్వనాథం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement