శాంతం.. అభయం... అమరం అంతా ఓంకారమే! | pippalada maharshi doughts and clarifications | Sakshi
Sakshi News home page

శాంతం.. అభయం... అమరం అంతా ఓంకారమే!

Published Sun, May 22 2016 12:16 AM | Last Updated on Thu, May 24 2018 12:31 PM

శాంతం.. అభయం... అమరం అంతా  ఓంకారమే! - Sakshi

శాంతం.. అభయం... అమరం అంతా ఓంకారమే!

పిప్పలాద మహర్షి దగ్గరకు బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసతో వెళ్లిన ఆరుగురు ఋషులలో అయిదోవాడు శిబిదేశానికి చెందిన సత్యకాముడు. అప్పటిదాకా గురువుగారు చెప్పిన సమాధానాలు, తీర్చిన సందేహాలు అన్నీ శ్రద్ధగా విన్నాడు. గార్గ్యుడు అడిగిన జాగ్రత్, స్వప్న, సుషుప్తి (మెలకువ, కలలు, గాఢనిద్ర) దశలకు పిప్పలాదుడు చెప్పిన వివరణ ప్రకారం గాఢనిద్రలో అన్నీ ఆత్మలో లీనమై పోతాయి. అయితే అలా జరిగినట్టు ఆ ప్రాణికి తెలియదు. ప్రాణుల్లో శ్రేష్ఠుడైన మానవుడు ధ్యానసాధనతో మెలకువలోనే ఆత్మలో లీనమయ్యే స్థితికి చేరుకోవచ్చునేమో అనిపించిన సత్యకాముడు మహర్షిని ఇలా ప్రశ్నించాడు.

 ‘‘గురుదేవా! మనుష్యుడు బతికి ఉన్నంతవరకు ఓంకారాన్ని నిష్ఠతో ధ్యానిస్తే ఏ లోకానికి వెళతాడు?’’ ఆ ప్రశ్నకు పిప్పలాదుడు ఇలా సమాధానం చెప్పాడు.

 ‘‘సత్యకామా!
ఓంకారం పరమూ, అపరమూ అయిన బ్రహ్మస్వరూపం. ఈ రెండిటిలో మొదటిది పైస్థాయికి చెందుతుంది. రెండవది సాధారణమైంది. విజ్ఞుడైన సాధకుడు పై రెండు మార్గాలలో దేనిని స్వీకరిస్తే, ఆ స్థితిని పొందుతాడు. ఓంకారాన్ని ఏకమాత్ర (లఘువు)గా ఏకాగ్రతతో ధ్యానించేవానికి జ్ఞానోదయం అవుతుంది. అయితే వెంటనే మనుష్యలోకానికి తిరిగి వచ్చేస్తాడు. ఋగ్వేద అధిదేవతలు అతణ్ణి భూలోకానికి తీసుకు వస్తారు. జ్ఞానోదయమై తిరిగి వచ్చిన ఆ మానవుడు తపస్సు, బ్రహ్మచర్యం, శ్రద్ధ మొదలైన సద్గుణాల సంపదతో మహిమాన్వితుడు అవుతాడు.

 ఓంకారాన్ని రెండు మాత్రలుగా (దీర్ఘం)దీక్షతో ధ్యానం చేసినవాడు మనస్సుతో లీనమవుతాడు. యుజుర్వేద మంత్ర దేవతలు ఆ సాధకుణ్ణి చంద్రలోకానికి తీసుకుపోతారు. అతడు ఆ లోకంలో సుఖసంపదలను అనుభవించి తిరిగి భూలోకానికి వస్తాడు.

 ఓంకారాన్ని మూడుమాత్రలుగా (సుదీర్ఘంగా) దీక్షగా పరమపురుష ధ్యానం చేసినవాడు సూర్యలోకానికి చేరుకుంటాడు. పాము కుబుసం రూపంలో పాతచర్మాన్ని విడిచిపెట్టినట్టు పాపాల నుంచి బయటపడతాడు. సామవేదాధిదేవతలు అతణ్ణిబ్రహ్మలోకానికి తీసుకుపోతారు. బ్రహ్మలోకానికి వెళ్లిన జీవుడు పరాత్పరుడు, అన్ని ప్రాణుల్లో ఉండేవాడు, సర్వశ్రేష్ఠుడు అయిన పరమ పురుషుణ్ణి దర్శిస్తాడు.

 నాయనా! నేను చెప్పినట్టు ఓంకారాన్ని మూడు దశల్లో ఒకటి, రెండు, మూడు మాత్రల్లో ధ్యానించేవాడు. ఆయా ఫలితాలను పొందినా అవి తాత్కాలికమే. మళ్లీ భూమికి రాక తప్పదు. ఒకదశ నుండి మరొక దశకు అవిచ్ఛిన్నమైన అనుసంధానంలో ధ్యానం చేస్తూ, బాహ్య, అభ్యంతర, మధ్యమ స్థితులను సమానంగా నిర్వహించేవిధంగా ఓంకారాన్ని ధ్యానం చేసే విద్వాంసుడు దేనికీ చలించడు. పతనం కాడు.

 సత్యకామా! ఋగ్వేద పద్ధతిలో ఓంకారధ్యానం చేసినవాడు ఇహలోకాన్ని, యజుర్వేద పద్ధతిలో చేసినవాడు అంతరిక్షలోకాలనూ, సామవేదపద్ధతిలో చేసినవాడు విజ్ఞులు చేరుకునే బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. ఈ సత్యాన్ని అన్వేషించే మహాత్ములు ఓంకారంతోనే శాంతమూ, అజరమూ, అమరమూ, అభయమూ, పరమపదమూ అయిన యోగస్థితిని పొందుతున్నారు’’.

 అలా పిప్పలాద మహర్షి చెప్పిన ఓంకార ధ్యానక్రమం మానవజాతికి సాధన మార్గంలో పరబ్రహ్మలో లీనమై అవిచ్ఛిన్నమైన యోగస్థితిని పొంది ఇహలోకంలో జీవించే జీవన్ముక్తిని, ప్రశాంతతను ప్రసాదిస్తుందని సత్యకాముడు, మిగిలినవారు అర్థం చేసుకున్నారు.

 పరిమిత ధ్యానం, మెలకువ, కల, గాఢనిద్ర, చావుపుట్టుకల వలె వస్తూపోతూ ఉండే ఫలితాన్ని ఇస్తుంది. అపరిమిత ధ్యానం ఎడతెగని జ్ఞానాన్ని ఇస్తుందని తెలుసుకున్నారు. చివరిగా సుకేశుడు అడిగిన ఆరోప్రశ్న ‘‘పదహారు కళలతో ఉన్న పురుషుడు ఎవడు?’’ దీనికి సమాధానం వచ్చేవారం చూద్దాం.  - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement