క్రికెటర్లకు వంటబట్టింది | Players want? | Sakshi
Sakshi News home page

క్రికెటర్లకు వంటబట్టింది

Published Fri, May 23 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

క్రికెటర్లకు వంటబట్టింది

క్రికెటర్లకు వంటబట్టింది

బిజినెస్‌లో హోటల్‌కు మించిన వ్యాపారం లేదంటారు... ఫలానా హోటల్‌లో వంటకాలు బాగుంటాయని ఒక్కసారి పేరొస్తే చాలు ఇక ఆ వ్యాపారానికి తిరుగే ఉండదు... సరిగ్గా ఇదే ఫార్ములాను బాగా ‘వంట’ బట్టించుకున్నారు భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు... క్రికెట్ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించిన ఆటగాళ్లు హోటల్ బిజినెస్‌పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. క్రికెట్ క్రేజ్, వ్యక్తిగత ఇమేజ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని హోటల్ వ్యాపారంలో అడుగుపెడుతున్నారు. అంతేకాదు వీరి బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా నడుస్తోంది. అన్నట్టు హోటల్ వ్యాపారంలో కపిల్, జహీర్, ఉతప్ప, శ్రీశాంత్, అజయ్ జడేజాలది అందెవేసిన చెయ్యి.
 
క్రికెట్‌లో భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన సారథి కపిల్‌దేవ్‌కూ హోటల్ బిజినెస్ ఉంది. క్రికెటర్లలో హోటల్ వ్యాపారం మొదలుపెట్టిన తొలి ఆటగాడు కపిల్‌దేవ్. చండీగఢ్‌లో కపిల్‌కు అద్భుతమైన హోటల్ ఉంది. అది సక్సెస్ కావడంతో  పాట్నాలో మరో హోటల్ పెట్టాడు. ఈ రెండింటిలో భారత వంటకాలతో పాటు చైనీస్ ఫుడ్ కూడా దొరుకుతుంది.

పేస్ బౌలర్ జహీర్ తక్కువ కాలంలోనే విజయవంతమైన హోటల్ వ్యాపారిగా పేరు తెచ్చుకున్నాడు. పుణెలో జహీర్‌కు ‘జెడ్‌కేస్’ అనే పేరుతో హోటల్ ఉంది. బిర్యానీకి ఈ హోటల్ చాలా ఫేమస్. అంతేకాదు ఇక్కడికొచ్చేవారు లొట్టలేస్తూ మాంసాహార వంటకాలను లాగించేస్తారట. పాశ్చాత్య దేశాలకు చెందిన వంటకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

క్రికెటర్లు శ్రీశాంత్, రాబిన్ ఉతప్పలకు ‘బ్యాట్ అండ్ బాల్ ఇన్’ పేరుతో బెంగళూరులో హోటల్ ఉంది. క్రికెట్, క్రికెటర్లకు సంబంధించిన కార్టూన్లు, పెయింటింగ్‌లు ఇక్కడికి వచ్చే వారిని అమితంగా ఆకట్టుకుం టున్నాయి. ఇందులో రెస్టా రెంట్‌కు ‘సిల్లిపాయింట్’ అనే పేరు పెట్టారు.
 
భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సింగపూర్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారితో కలిసి 2002 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో హోటల్ బిజినెస్ చేస్తున్నాడు. భారతీయ, ఇటలీ వంటకాలకు ఈ హోటల్ ఫేమస్.
 
 వీళ్లకు కలిసిరాలేదు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌కు ముంబైలో రెండు, బెంగళూరులో ఓ హోటల్ ఉండేవి. ప్రముఖ హోటల్ వ్యాపారి సంజయ్ నారంగ్(మార్స్ గ్రూప్)తో కలిసి మాస్టర్ హోటల్ బిజినెస్ చేశాడు. ‘సచిన్స్’, ‘టెండూల్కర్స్’ పేర్లతో ముంబైలోని కొలాబా, ములుంద్‌లో కొంతకాలం ఈ హోటళ్లు నడిపి ప్రస్తుతం మూసేశారు.

భారత క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ బిజినెస్‌లోనూ అదే బాటలో నడిచాడు. ‘సౌరవ్స్ ఫుడ్ పెవిలియన్’ పేరుతో దాదాకు  కోల్‌కతాలో లగ్జరీ హోటల్ ఉండేది. సముద్రం చేపలతో చేసే వంటకాలు ఇక్కడికొచ్చేవారికి నోరూరించేవి. ప్రస్తుతం ఇది కూడా మూతపడింది.

అందరూ హోటల్ బిజినెస్‌లో పండిపోతుంటే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఊరుకుంటాడా.. అందుకే ఢిల్లీ, లుధియానాలో రెండు హోటల్స్ పెట్టాడు. శాకాహారులకు మాత్రమే పరిమితమైన ఈ హోటళ్లు కూడా ప్రస్తుతం మూత పడ్డాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement