
కంప్యూటర్ రంగంలో సరికొత్త విప్లవానికి నాందిగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఐబీఎం 50 క్యూబిట్లతో ఓ క్వాంటమ్ కంప్యూటర్‌ను సిద్ధం చేసింది. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లకు కొన్ని లక్షల రెట్లు ఎక్కువ వేగంగా పనిచేస్తాయన్నది క్వాంటమ్ కంప్యూటర్‌కు మనం ఇవ్వగల సాధారణ పరిచయం. కణాల తీరును ఆధారంగా చేసుకుని ఇవి పనిచేస్తాయి. సాధారణ కంప్యూటర్లలో ఒక ట్రాన్‌సిస్టర్ గుండా విద్యుత్తు ప్రవహిస్తే ‘1’గా, ఆగిపోతే ‘0’గా గుర్తిస్తారని.. ఈ 1, 0లతోనే మొత్తం కంప్యూటర్ లెక్కలు ఆధారపడి ఉంటాయన్నది మనకు తెలిసిందే. ఈ రకమైన డిజిటల్ కంప్యూటర్లలో వృద్ధికి అవకాశాలు తక్కువైన నేపథ్యంలో శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ కోసం పరిశోధనలు చేస్తున్నారు. పదార్థపు సూక్ష్మ ప్రపంచాన్ని వివరించే క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఒక కణం ఏకకాలంలో భిన్న స్థితుల్లో ఉండగలుగుతుంది.
దీన్నే క్యూబిట్ అంటారు. ఇలాంటి కొన్ని కణాలను అనుసంధానించడం ద్వారా వాటితో లెక్కలు కట్టవచ్చునని అంచనా. ఈ నేపథ్యంలో ఐబీఎం దాదాపు 50 క్యూబిట్లతో ఒక కంప్యూటర్‌ను తయారు చేసినట్లు ప్రకటించింది. క్వాంటమ్ కంప్యూటర్లు అత్యంత శక్తిమంతమైనవని ముందుగానే చెప్పుకున్నాం గానీ.. దీన్ని సాధారణ ప్రజలు వాడుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఈలోపు వీటితో కొత్త కొత్త మందుల తయారీకి పరిశోధనలు నిర్వహించవచ్చు. అంతేకాకుండా వినూత్న లక్షణాలుండే పదార్థాలను ఆవిష్కరించవచ్చు. సుదూర అంతరిక్ష శోధన కూడా సులువు అవుతుంది.!
Comments
Please login to add a commentAdd a comment