వానర ప్రేమికుడు
జీవ దయ
కోతులను చూసి భయపడడమో, భయపెట్టడమో, వాటిని అల్లరి పెట్టడమో చాలా మంది చేసే పని. ఆ యువకుడు మాత్రం కోతిచేష్టల వైపు కాదు కోతుల కష్టాల వైపు దృష్టి సారించాడు. అవి ఆకలితో ఉన్నా, గాయపడినా, ఏ కష్టంలో ఉన్నా... వాటి గురించి ఆలోచించడమే కాదు అండగా నిలబడుతున్నాడు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పూండికి చెందిన పిడబ్ల్యూడి అధికారి నీలమేఘం కుమారుడు వెంకటేశన్ ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. నీలమేఘం పూండి రిజర్వాయర్ దగ్గర ఉద్యోగం చేసేవాడు. ఆయనకు భోజనం తీసుకు వెళ్ళే సమయంలో వానరాలు ఆహారం కోసం పడుతున్న కష్టాలు వెంకటేశన్‌ను కంటతడి పెట్టించాయి.
‘మూడు వేల మందికి పైగా ప్రజలు నివాసం వుంటున్న ప్రాంతంలో కనీసం యాభై వానరాలకు తిండి పెట్టలేరా?’ అని మనసులో బాధ పడ్డాడు. రోజుకు కనీసం వంద రూపాయల వరకు ఖర్చు పెట్టి వాటి ఆకలి ఎంతో కొంత తీర్చేవాడు. అయినా ఎక్కడో అసంతృప్తి. ఇది సరిపోదని... రోజుకు కనీసం 50 కోతుల ఆకలి అయినా తీర్చాలనుకున్నాడు. తాను చేస్తున్న హోంగార్డు ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం సరిపోకపోవడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు ఉద్యోగంలో చేరడంతో పాటు ప్రతి రోజు మూడు గంటల పాటు ఎలక్ట్రికల్ వైరింగ్ పనులను పార్ట్‌టైమ్‌గా చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని వానరాల కోసం ఖర్చు చేయడం ప్రారంభించాడు వెంకటేశన్.
‘‘మనం జల్సాల కోసం వినియోగించే మొత్తంలో కొంత భాగాన్ని కోతుల కోసం వినియోగిస్తే ఎంతో పుణ్యం వుంటుంది. ఒక వ్యక్తి ఒక వానరాన్ని దత్తత తీసుకుంటే మంచిది’’ అంటున్న వెంకటేశన్ నాలుగు సంవత్సరాల క్రితం ఇంటి వద్దే చిన్నగుడిసె వేసి కోతులను పెంచాడు. బ్లూక్రాస్ నుండి ఇబ్బందులు వస్తాయని కొందరు భయపెట్టారు. మరికొందరు ‘‘ఈ కోతుల గోల ఏమిటి?’’ అని గొడవకు దిగారు. దీంతో ఇంటి పక్కనే వున్న గుడిసెను ఖాళీ చేసి వేరే ప్రాంతంలో వాటి బాగోగులను చూడడం ప్రారంభించాడు.
రాముడు, లక్ష్మీ, పెరుమాళ్, శివ, అజిత్, జిమ్మీ... మొదలైనవి వెంకటేశన్ పెంచుతున్న కోతుల పేర్లు. బంధువులు, గ్రామస్థులు ఇలా అందరూ వ ద్దని వారించినా నాలుగు సంవత్సరాల నుండి వానరాల సేవలో తరిస్తూ తన ఆత్మబంధువులు వానరాలే అని చెప్పుకుంటున్న వెంకటేశన్‌ను ఆదర్శంగా తీసుకుని రోజుకు ఒక పూటైనా ఒక జంతువుకు అన్నం పెట్టాలని నిర్ణయించుకుందాం. మూగప్రాణుల కోసం చేసే ఏ స్వల్ప కార్యమైనా అంతర్గతమైన శక్తిని మేల్కొలిపి హృదయాన్ని బలోపేతం చేస్తుందన్న విషయాన్ని గ్రహిద్దాం.
- కోనేటి వెంకటేశ్వర్లు, తిరువళ్లూరు, తమిళనాడు