
ఆడాలి... అష్టాచెమ్మా!
అష్టాచెమ్మా, పచ్చీస్, బారాహ్‌గట్టా, వైకుంఠపాళి, పరమపద సోపానపటం, చదరంగం, వామనగుంటలు...
అష్టాచెమ్మా, పచ్చీస్, బారాహ్‌గట్టా, వైకుంఠపాళి, పరమపద సోపానపటం, చదరంగం, వామనగుంటలు... ఈ పేర్లు వింటేనే మనసు బాల్యంలోకి పరుగులు తీస్తుంది. తాతయ్యకు దీటుగా వేసిన ఎత్తులు గుర్తుకొస్తాయి. వామనగుంటలు ఆడుతూ మనల్ని గెలిపించడానికి తాతయ్య ఓడిపోయిన జ్ఞాపకాలు వెంటాడుతాయి. ఆటలో గెలిచిన గులకరాళ్లను పోగు చేసి మెరుస్తున్న కళ్లతో చూసుకుంటుంటే మన ముఖంలో సంతోషాన్ని చూసి ఆనందించిన తాతయ్య ముఖం కళ్ల ముందు మెదులుతుంది. ఇవన్నీ గత తరం బాల్యానికే పరిమితం. మరి ఈ తరం బాల్యం... అంటే రేపటి తరానికి ఇలాంటి జ్ఞాపకాలు ఉంటాయా? అంటే ఉండవనే సమాధానమే వస్తుంది. ఈ ఆటలన్నీ ఎప్పుడో అటకెక్కేశాయనీ బాధేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదన నుంచి పుట్టిన ఓ కొత్త ఆలోచనతో ఈ ఆటలేవీ అటకెక్కిన ఆటలు కాకూడదని వినూత్న ప్రయోగాన్నిచేస్తున్నారు డాక్టర్ రమ్య. ‘స్పర్ధగేమ్స్’ పేరుతో ఆ తరం ఆటలను ఈ తరానికి పరిచయం చేస్తున్నారు.
వాకా మంజులారెడ్డి
రమ్య డెంటిస్ట్. దంతవైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తూనే ఈ వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించారు. ఉప్పల్‌లో తమ ఇంట్లోనే ఓ గదిని వర్క్‌షాప్‌గా మార్చుకుని ఒక కార్పెంటరీ మిషన్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక కార్పెంటర్‌ని ఉద్యోగిగా నియమించుకుని మొత్తం 50 వేల రూపాయల పెట్టుబడితో ఓ కుటీర పరిశ్రమను స్థాపించారు. వామనగుంటలు, చదరంగం పట్టికలు, అష్టాచెమ్మా, పచ్చీస్, వైకుంఠపాళి పటాలు తయారు చేస్తున్నారు. ఈ తరం పిల్లలకు మన సంప్రదాయ ఆటలతో పరిచయమే ఉండడం లేదు. ఈ తరానికి పరిచయం కాకపోతే ఈ ఆటలు కనుమరుగు కావడానికి ఎంతో కాలం పట్టదు. ఇలా కళ్ల ముందే ఒక సంస్కృతి అంతరించిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి మనసు ఒప్పుకోకపోవడంతో ఈ ఆటల మీద దృష్టి పెట్టారు రమ్య.
గెలవాలనే ఆరాటమే ఆట!
భారతీయ సంప్రదాయ ఆటల్లో జీవితసారం ఉంటుంది. ఎత్తుపల్లాలు, ఒడుదొడుకులు ఉంటాయని వైకుంఠపాళి చెప్తుంది. జీవితంలో ప్రతి పనికీ ఓ లెక్క ఉంటుందనీ, ఆ లెక్క తెలుసుకుని నడుచుకుంటే పెట్టిన పెట్టుబడికి రెండింతలు సొంతం చేసుకోవచ్చని చెబుతూ మేధోమధనం చేయించే ఆట వామనగుంటలు. అవకాశానికి విజ్ఞతను ఉపయోగించి విజయం సాధించడం నేర్పించే ఆటలు అష్టాచెమ్మా, పచ్చీస్‌లు. కేవలం అదృష్టం మీద ఆధారపడిన ఆట వైకుంఠపాళి. పాము నోట్లో పడి కిందకు జారుతున్న ప్రతిసారీ... మరో అవకాశంలో నిచ్చెన ఎక్కాలనే ఉత్సాహాన్ని నింపుకుంటూ ఆట కొనసాగించడం అంటే... ఎన్నిసార్లు కింద పడినా మళ్లీ లేచి నిలబడడానికే ప్రయత్నించాలనే పాజిటివ్ ఆటిట్యూడ్‌ని నేర్పించే ఆట ఇది. వ్యక్తిత్వ వికాస పాఠాల సుమహారాలు ఈ ఆటలు. ‘‘ప్రత్యర్థితో తలపడడం, గెలవాలనే ఆరాటం కలిగించే ఆటలివన్నీ. మొబైల్ ఫోన్‌లు, కంప్యూటర్‌లలో రూపొందించిన సాఫ్ట్ గేమ్స్ కేవలం ఆటను ఆనందించడం వరకే పరిమితం. మన సంప్రదాయ ఆటలు మేధోవికాసానికి దోహదం చేస్తాయి. పిల్లలకు తోటివారితో సంబంధాలను పెంచుతాయి అయితే మన భారతీయ ఆటల్లో చదరంగం మినహా మరే ఆటలూ పెద్దగా మనుగడలో లేవు. వాటిని ముందు తరాలకు అందించాలనే ప్రయత్నమే ఇది’’ అన్నారు డాక్టర్ రమ్య. ఈ ప్రయత్నంలో ఆమెకు భర్త తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన కూడా డెంటిస్టే.
ఆటల మీద అధ్యయనం!
ఆట వస్తువుల తయారీ ప్రారంభించాలనుకున్న తర్వాత అరవై, డెబ్భై ఏళ్ల వారిని సంప్రదించారు రమ్య. ఒకే ఆటను ప్రాంతాల వారీగా కొద్దిపాటి మార్పులతో ఆడుతున్న విషయం కూడా అప్పుడే తనకు తెలిసిందంటారామె. ‘‘మాది ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. మా తాతగారు నిమ్మకూరు నుంచి మంచిర్యాలకు వెళ్లారు. నా బాల్యం అంతా అక్కడే గడిచింది. ఇంటర్మీడియట్ విజయవాడలో చదివాను. డెంటల్ కోర్సు ఖమ్మంలో చేశాను. దాంతో నాకు ఆటల విధానంలో ఉన్న తేడాలు కొంత వరకు తెలుసు. పెద్దవాళ్లను అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ క్రమంలో అనేక సంప్రదాయాలు కూడా తెలిశాయి. శ్రావణమాసం నోములకు ఆట వస్తువులు పంచడం, కొత్త పెళ్లికూతురు అత్తగారింటికి వెళ్లేటప్పుడు ఆటవస్తువులు తీసుకెళ్లడం వంటి సంప్రదాయాలు ఉన్నాయి. వాటితోపాటుగా ఇప్పుడు పుట్టిన రోజు పండుగలకు బహుమతిగా ఈ ఆటవస్తువులను ఇవ్వడాన్ని అలవాటు చేశాను. ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి’’ అంటూ తన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి, దానిని విజయవంతంగా నడిపించడానికి చేసిన కృషిని వివరించారు.
సంప్రదాయ ఆటలకు సాంకేతిక ప్రసార సాధనం!
ఫేస్‌బుక్ మిత్రుల్లో ఒకరు ఈ ఆట సాధనాలను కొంటే ఆ విషయాన్ని పలువురితో షేర్ చేసుకుంటున్నారు. దీంతో నగరాలకే పరిమితమైన అనేక మందికి ఈ ఆటలు పరిచయమవుతున్నాయి. ఇది ఇలా విస్తరించి పిల్లలున్న ప్రతి ఇంట్లో ఓ అష్టాచెమ్మా పట్టిక, వామనగుంటల పలక, చదరంగం పట్టిక, వైకుంఠపాళి పటం ఉంటే చాలు. ఆడుకోవడానికి సహ ఆటగాళ్ల కోసమైనా స్నేహితులను ఏర్పరుచుకుంటారు. ఇంటికి ఒకే బిడ్డ ఉంటున్న ఈ రోజుల్లో పిల్లల్లో ఇచ్చి పుచ్చుకునే లక్షణాన్ని పెంచడానికి ఈ ఆటలు కూడా దోహదం చేస్తాయి.