రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తొమ్మిదిరోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన చిన్నారి రమ్య కుటుంబ సభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తొమ్మిదిరోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన చిన్నారి రమ్య కుటుంబసభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఆదివారం ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న ఆయన.. రమ్య మృతి బాధాకరమన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.
మధ్యం మత్తులో డ్రైవ్ చేసి చిన్నారి మృతికి కారణమైన యువకుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని తేలిందని మంత్రి అన్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే బలమైన సెక్షన్లు పెట్టి విచారణ చేస్తున్నారని తలసాని తెలిపారు. కారు ప్రమాదంలో రమ్య కుటుంబం చిన్నాభిన్నమైందన్న ఆయన.. ప్రభుత్వం తరపున వారికి కావాల్సిన సహాయం అందిస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో రమ్య భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. అంబర్పేటలోని స్వగృహానికి తరలించారు.