ఒక్క గంట ఉన్నా చాలు! | respect you not love or heaven | Sakshi
Sakshi News home page

ఒక్క గంట ఉన్నా చాలు!

Published Thu, Aug 30 2018 12:14 AM | Last Updated on Thu, Aug 30 2018 12:14 AM

respect you not love or heaven  - Sakshi

అనగనగా ఓ రాజు. ఆయనకు ప్రజలంటే ప్రాణం. వారిని కన్నబిడ్డల్లాగా పాలించేవాడు. ఎంతో ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ధర్మబుద్ధికి, సత్యనిష్ఠకు మెచ్చాడు ఇంద్రుడు. ‘‘వెంటనే నువ్వు స్వర్గానికి రా’’ అని పిలిచాడు. ‘‘నేను నా ప్రజలను విడిచి ఇప్పుడే రాలేను’’ అన్నాడు రాజు. ‘‘అదేంటి, నేను పిలిచినా రావా?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఇంద్రుడు. ‘‘మీ మీద గౌరవం, నాకు స్వర్గం మీద ప్రేమ లేక కాదు. నాతోపాటు నా ప్రజలు కూడా రావాలి. అప్పుడే వస్తాను’’ అన్నాడు రాజు. ‘‘అలా కుదరదు. నీ ఒక్కడికే స్వర్గార్హత ఉంది. నీ ప్రజల్లో కేవలం ఒక్క శాతంకన్నా తక్కువ మందికే స్వర్గప్రాప్తి యోగం ఉంది.మిగతా అందరూ నరకానికి వెళ్లవలసిందే’’ అన్నాడు ఇంద్రుడు.‘‘నా ప్రజలందరూ ఎక్కడ ఉంటే నేనూ అక్కడే ఉంటాను. వారు లేని స్వర్గమైనా, నాకు నరకంతో సమానమే. వారితోబాటు నరకానికి వెళ్లి అక్కడే ఉంటాను’’ అన్నాడు రాజు. ‘‘పిచ్చివాడిలా ఉన్నావే. ప్రజలకోసం స్వర్గాన్ని వదులుకుంటావా?’’ అన్నాడు ఇంద్రుడు. 

‘‘దేవేంద్రా! మీకు తెలియనిదా! రాజుకు రాజభోగాలు ఎక్కడినుంచి వచ్చాయి? ప్రజలు ఇవ్వబట్టే కదా. ప్రజాబలంతోనే కదా’’ అన్నాడు. ‘‘అయితే, వారందరి కోసం నీ పుణ్యఫలాలను ధార పోస్తావా మరి?’’ అడిగాడు ఇంద్రుడు. ‘‘సంతోషంగా ధారపోస్తాను’’ అన్నాడు రాజు. ‘‘వారందరికీ నీ పుణ్యాన్ని ధారపోయగా నీకు ఎంత మిగులుతుందనుకుంటున్నావ్‌? అలా మిగిలిన దానితో నీకు మహా అయితే ఒకటి రెండు రోజులు తప్ప స్వర్గ ప్రాప్తి కలగదు. అదే నీ ఒక్కడికే అయితే చాలా కాలం ఉంటుంది’’ అన్నాడు ఇంద్రుడు. ‘‘వారందరితో కలిసి ఒక్క రోజు కాదు, ఒక్క గంట ఉన్నా నాకు అదే చాలు’’ అన్నాడు రాజు. దేవతలు అతని మీద పుష్పవర్షం కురిపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement