ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత | Sakshi Exclusive Interview With Mahesh Babu And Namrata | Sakshi
Sakshi News home page

ఏడడుగులకు నాలుగేళ్లు

Published Sun, Feb 23 2020 1:29 AM | Last Updated on Sun, Feb 23 2020 11:49 AM

Sakshi Exclusive Interview With Mahesh Babu And Namrata

అబ్బాయిది సౌత్‌. అమ్మాయిది నార్త్‌. మనసులు కలిశాయి. మనసులు కలిస్తే.. సౌత్, నార్త్‌ కలుస్తాయా?! ‘నో’ అన్నారు నమ్రత పేరెంట్స్‌. ఇటువైపు కూడా సేమ్‌ టు సేమ్‌.. ‘నో’! ఒక్క సినిమాతో ఒకటై పోయినవాళ్లు.. ఏడడుగులు వేయడానికి నాలుగేళ్లు ఆగారు. పదిహేనేళ్లయింది పెళ్లయి. ఆ పెళ్లి కళ ఇంకా అలాగే ఉంది. మహేశ్‌లో అదే సిగ్గు. నమ్రతలో అదే నవ్వు. భార్యాభర్తల్ని ఇంటర్వ్యూ చేసినట్లు లేదు. ఇద్దరు ప్రేమికులతో ముచ్చటించినట్లు అనిపించింది. 

మీ ఇద్దరూ కలిసి చేసింది కేవలం ఒక్క సినిమాయే (వంశీ). ఆ సినిమా చేసిన కొన్ని నెలల పరిచయంతోనే ‘లైఫ్‌ పార్ట్‌నర్‌గా తనే పర్ఫెక్ట్‌’ అనే నమ్మకం ఎలా కలిగింది? 
నమ్రత: ‘వంశీ’ సినిమా కోసం 52 రోజులు అవుట్‌డోర్‌ షూటింగ్‌ చేశాం. ఆ షెడ్యూల్‌ పూర్తయి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లే టైమ్‌ వచ్చింది. అప్పుడు ఒకరిని ఒకరం మిస్‌ అవుతాం అని అర్థమయిపోయింది. దూరం అవుతామనే ఆలోచనే భరించలేనిదిగా అనిపించింది. ఆ ఫీలింగ్‌ నుంచే పెళ్లి ఆలోచన వచ్చింది. అది కాకుండా మహేశ్‌ ప్రవర్తన చూసి నా జీవితాన్ని పంచుకోవడానికి తనే పర్ఫెక్ట్‌ అనిపించింది.
మహేశ్‌: ఆ సినిమా కోసం ట్రావెల్‌ చేసిన ఆ కొన్ని రోజుల్లో నమ్రత బెస్ట్‌ బెటరాఫ్‌ అవుతుందని నాకూ అనిపించింది.

‘వంశీ’లో...
‘వంశీ’ ఫ్లాప్‌ సినిమా. కానీ మీ ఇద్దరినీ కలిపిన సినిమా?
నమ్రత: అవును. మా ఇద్దరి కెరీర్‌లో నిరుత్సాహపరిచిన సినిమా అది. అయినప్పటికీ ‘వంశీ’ సినిమాకి మేం ఎప్పటికీ ధన్యవాదాలు చెబుతూనే ఉంటాం. మా ఇద్దరినీ కలిపిన ఆ సినిమా మాకెంతో ప్రత్యేకం.

మీరు నార్త్‌.. మహేశ్‌గారు సౌత్‌. మరి ఇద్దరి ఇంట్లో మీ పెళ్లిని సులువుగా అంగీకరించారా?
నమ్రత: నేను తనకి పర్ఫెక్ట్‌ భార్యని అవుతానని వాళ్ల ఫ్యామిలీని కన్విన్స్‌ చేయాలనుకున్నారు మహేశ్‌. అయితే వాళ్లు ఓకే చెప్పడానికి నాలుగేళ్లు పట్టింది. ఆ నాలుగేళ్లు నేను ఓపికగా వెయిట్‌ చేశా. చేసుకుంటే మహేశ్‌నే లేకపోతే లేదు అని ఫిక్స్‌ అయ్యాను.

మరి మీ పేరెంట్స్‌ ఈజీగానే ఒప్పుకున్నారా?
నమ్రత: మా అమ్మానాన్న కూడా వెంటనే ఒప్పుకోలేదు. అయితే మహేశ్‌ని కలిసిన తర్వాత వాళ్లు ఫుల్‌ హ్యాపీ. మా పెళ్లికి అంగీకరించారు.

మహేశ్‌గారు నటించిన ‘మురారి’లో పెళ్లి సీన్‌ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. రియల్‌ లైఫ్‌లో మీది సింపుల్‌ వెడ్డింగ్‌.. అలా గ్రాండ్‌గా చేసుకుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?
నమ్రత: మా పెళ్లి జరిగిన విధానం నాకు చాలా నచ్చింది. చాలా సింపుల్‌గా జరిగినా మాకు బాగా సన్నిహితులైనవారి సమక్షంలో కూల్‌గా జరిగింది. అందుకే గ్రాండ్‌గా చేసుకుని ఉండాల్సింది అనే ఆలోచనే ఎప్పుడూ లేదు.

ఈ నెల 10న మీ పెళ్లి రోజుని ఎలా జరుపుకున్నారు? 
నమ్రత: ఇంట్లోనే జరుపుకున్నాం. ఉదయాన్నే పిల్లల్ని స్కూల్‌కి పంపి, ఎవరి వర్కౌట్స్‌ వాళ్లు చేసుకుని సాయంత్రం పిల్లలు ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూశాం. పిల్లలిద్దరూ మా కోసం స్వయంగా గ్రీటింగ్‌ కార్డు తయారు చేశారు. అది చాలా స్పెషల్‌గా, టచింగ్‌గా అనిపించింది. సాయంత్రం కుటుంబమంతా డిన్నర్‌కి వెళ్లాం, త్వరగానే తిరిగొచ్చాం. నెక్ట్స్‌ డే మా అబ్బాయి గౌతమ్, పాప సితార స్కూల్‌కి వెళ్లాలి కదా. 
మహేశ్‌: పిల్లలతో టైమ్‌ స్పెండ్‌ చేయడం బాగుంటుంది. అందుకే మ్యారేజ్‌ సెలబ్రేషన్‌ అంటే పిల్లలతో కలిసి బయటికెళ్లడమే.

మీ పెళ్లయి పదిహేనేళ్లు పూర్తయ్యాయి..
నమ్రత: ఈ పదిహేనేళ్లల్లో మా ప్రేమ ఇంకా పెరిగింది. ప్రేమికులుగా ఉన్నప్పుడు, పెళ్లయిన కొత్తలో ఉన్నట్లుగానే ఇప్పుడూ ఉంటున్నాం. ఈ పదిహేనేళ్ల జర్నీ సరదాగా, సంతోషంగా సాగిపోయింది. ఫ్యామిలీ లైఫ్‌ విషయంలో ఇద్దరం సంతృప్తిగా ఉన్నాం. 
మహేశ్‌: అలా అని అన్నీ హ్యాపీ మూమెంట్సే ఉన్నాయని చెప్పడం లేదు. వీటితోపాటు కొన్ని ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉన్నాయి. ఆనందాన్ని ఎలా పంచుకున్నామో బాధలను కూడా అలానే పంచుకుంటూ వస్తున్నాం. ఓవరాల్‌గా మాది బ్యూటిఫుల్‌ జర్నీ.

పదిహేనేళ్ల వైవాహిక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే గుర్తుండిపోయే జ్ఞాపకాల గురించి?
నమ్రత: చాలా ఉన్నాయి. పెళ్లయిన కొత్తల్లో మేం ఒక ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. ఆ రోజులు బెస్ట్‌. ఆ తర్వాత గౌతమ్‌ పుట్టడం ఓ మంచి అనుభూతి. ‘ఖలేజా’ ముందు మహేశ్‌ మూడేళ్లు గ్యాప్‌ తీసుకున్నారు. ఆ సమయంలో మేం స్పెండ్‌ చేసిన టైమ్‌ బెస్ట్‌. పెళ్లయినప్పుడు ఉన్న ఫ్లాట్‌ నుంచి మేం కొత్తగా కట్టించుకున్న ఇంట్లోకి షిఫ్ట్‌ అవ్వడం ఓ మంచి మెమొరీ. ఆ తర్వాత సితార పుట్టడం ఇంకో మంచి అనుభూతి. యాక్టర్‌ నుంచి సూపర్‌ స్టార్‌గా మహేశ్‌ మారడం.. ఇవన్నీ నాకు చాలా చాలా స్పెషల్‌ మూమెంట్స్‌. 
మహేశ్‌: నిజానికి మా పెళ్లి తర్వాత తనతో ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేయడానికి కుదరలేదు. ఆ మూడేళ్ల బ్రేక్‌ మా మంచికే. మా అబ్బాయి గౌతమ్‌తో ఎక్కువగా ఉండగలిగాను. ఆ బ్రేక్‌ నాకు రిఫ్రెషింగ్‌లా అనిపించింది.

మీ మామయ్య కృష్ణగారి గురించి చెప్పండి?
నమ్రత: మహేశ్‌ లైఫ్‌లో మామయ్యగారు స్ట్రాంగ్‌ ఫోర్స్‌. మా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఆయన ఓ బలం. మా అందరికీ ఆయనే స్ఫూర్తి. వాళ్ల కుటుంబంలోకి నన్నో కూతురిలా ఆహ్వానించారు. మామయ్యగారు నాకు తండ్రిలానే అనిపిస్తారు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్లను బాగా ముద్దు చేస్తారు. పిల్లలతో ఉన్నప్పుడు ఆయన కూడా పిల్లాడైపోతారు. మా అందర్నీ ముందుకు నడిపించేది మామయ్యగారే. ఆయన్నుంచి నేర్చుకున్న విషయాలను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను.

భార్య నమ్రత  పిల్లలు గౌతమ్, సితారలతో మహేశ్‌
అత్తగారు ఇందిర గారితో మీ అనుబంధం.. 
నమ్రత: ఇందిరమ్మగారు చిన్న పిల్లలాంటివారు. మా ఇంట్లో అందరికంటే చిన్నపిల్ల ఆవిడే (నవ్వు). ఏ విషయాన్ని అయినా చిన్నపిల్లలానే డీల్‌ చేస్తారు. అందర్నీ చాలా ప్రేమగా చూస్తారు. పిల్లలతో, మహేశ్‌తో, నాతో భలే ఉంటారు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. కొన్నిసార్లు నా మీద జోక్స్‌ చేస్తుంటారు. మామయ్యగారిలానే అత్తయ్యగారు కూడా నన్ను కూతురిలా చూసుకుంటారు. నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు అత్తయ్యవాళ్లు నన్ను చూసుకున్న విధానాన్ని మరచిపోలేను.

నమ్రతగారిలో మీకు నచ్చిన లక్షణాలేంటి? 
మహేశ్‌: తన సింప్లిసిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఏ సందర్భంలో అయినా తను తనలానే ఉంటుంది. ముఖ్యంగా తనలో నెగటివ్‌ ఆలోచనలు ఉండవు. అది చాలా చాలా పాజిటివ్‌ విషయం. చాలా కైండ్‌ పర్సన్‌. అలాగే అవసరమైనప్పుడు చాలా స్ట్రిక్ట్‌ కూడా. నమ్రత చాలా నిజాయితీ గల మనిషి.

మరి మహేశ్‌గారిలో మీకు నచ్చే విషయాలు?
నమ్రత: ఆయనలో అమాయకత్వం ఉంది. అలాగని అమాయకుడు కాదు. సున్నిత మనస్కుడు. ఫ్యామిలీని తను ప్రేమించే విధానం సూపర్బ్‌. తనది స్వచ్ఛమైన మనసు. ఆయన స్వభావం చాలా మంచిది. ఇంకా మహేశ్‌లో నచ్చే విషయాలు చాలా చాలా ఉన్నాయి.

పెళ్లి చేసుకుని సినిమాలు మానేశారు. ఆ విషయంలో ఏదైనా అసంతృప్తి ఉందా? కమ్‌బ్యాక్‌ లాంటిది ఏమైనా ఊహించొచ్చా?
నమ్రత: పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్నది నా సొంత నిర్ణయమే. ఆ నిర్ణయం సరైనది కాదు అని ఒక్క నిమిషం కూడా అనిపించలేదు. మహేశ్‌ నాకు మంచి జీవితాన్నిచ్చారు. ఇంతకు మించి నాకేం కావాలి? మహేశ్, పిల్లలు నా ప్రపంచం. వీళ్లు కాకుండా నాకు వేరే ఏ ఆనందాలూ అక్కర్లేదు. ఆ మాటకొస్తే ఈ జీవితం కాకుండా నాకు వేరే జీవితం కూడా అవసరం లేదు.

ఒక భార్యగా, తల్లిగా నమ్రత ఎలా ఉంటారు?
మహేశ్‌: మదర్‌గా నమ్రత అమేజింగ్‌. వంక పెట్టే పనిలేదు. ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులూ తనకి ఇచ్చేయొచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు స్ట్రిక్ట్‌గా ఉండాలి కదా. తను స్ట్రిక్ట్‌ మదర్‌. ఇక భార్యగా నమ్రత గురించి చెప్పాలంటే.. చాలా చాలా గొప్ప భార్య. తను లేకపోతే నేను లేను. నా బెస్ట్‌ ఫ్రెండ్, నా సపోర్ట్‌ సిస్టమ్‌ అన్నీ తనే. నా జీవితాన్ని చాలా సులువుగా మార్చడం తనకి మాత్రమే తెలుసు.

నమ్రతగారిని మీ అమ్మగారితో పోల్చమంటే...
మహేశ్‌: ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన స్త్రీలు ఉంటారు. నా జీవితంలో మా అమ్మ, నా భార్య ముఖ్యమైన స్త్రీలు. వాళ్లు నా సర్వస్వం. అలాగే నా పిల్లలు కూడా. నాకు తెలిసి మా అమ్మగారిలాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. కచ్చితంగా ఉండరు. నా భార్య విషయంలో కూడా ఇదే చెబుతాను. నమ్రతలాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. నా జీవితంలో వీళ్ల స్థానాల్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అంత ముఖ్యమైన వాళ్లు నాకు.

తండ్రిగా మహేశ్‌ ఎలా ఉంటారు? 
నమ్రత: కొడుకుగా, భర్తగా, తండ్రిగా మహేశ్‌ ది బెస్ట్‌. ఎటువంటి సందర్భాల్లో అయినా మాకు బెస్ట్‌ ఇవ్వాలనుకుంటారు. ఇస్తారు కూడా.

మహేశ్‌గారు డామినేటింగ్‌గా ఉండరనే అనుకుంటున్నాం. మీ ఇంట్లో డామినేషన్‌ ఎవరిది? 
నమ్రత: మా ఇద్దరిలో ఎవరో ఒకరు డామినేటింగ్‌గా ఉంటారని చెప్పలేం... సమానంగానే ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో తనే గెలుస్తారు (నవ్వుతూ).

మహేశ్‌ నుంచి మీరందుకున్న బెస్ట్‌ గిఫ్ట్‌? 
నమ్రత: రొటీన్‌గా అనిపించొచ్చు కానీ మహేశ్‌ నుంచి నేనందుకున్న బెస్ట్‌ గిఫ్ట్‌ నా పిల్లలు. 
మహేశ్‌: నా బలం నా ఇల్లు. ఇంట్లో ఆనందం దొరికితే ఇక దానికి మించిన గిఫ్ట్‌ ఉండదు. ఆ విధంగా ఐయామ్‌ హ్యాపీ.

పిల్లలు ఏది అడిగితే అది కొనిస్తారా? ఎవర్ని అడుగుతారు?
నమ్రత: పిల్లలకి ఏం కావాలన్నా మహేశ్‌ దగ్గరకు వెళ్తారు. ఎందుకంటే నో అనరు కాబట్టి. నేను మాత్రం అది నిజంగా అవసరం అయితేనే ఓకే అంటాను. లేదంటే నో... నో... అంతే. సో.. నేనే స్ట్రిక్ట్‌.

పిల్లలు భవిష్యతులో ఇలా స్థిరపడితే బాగుంటుంది అని డిస్కస్‌ చేస్తుంటారా? పెద్దయ్యాక గౌతమ్, సితార ఏం కావాలనుకుంటున్నారు?
మహేశ్‌: ఏం ప్లాన్‌ చేయలేదు. వాళ్లు ఏం కావాలనుకుంటున్నారో అది వాళ్ల ఇష్టం. మేం డిసైడ్‌ చేయదలచుకోలేదు. అయితే వాళ్లు ఏం చేసినా హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాం.

మహేశ్‌కి చాలా సిగ్గు. హీరోయిన్స్‌తో కూడా సరిగ్గా మాట్లాడరు అని ఓ సందర్భంలో అన్నారు. ఆ స్వభావమే భార్యగా మిమ్మల్ని సెక్యూర్‌గా ఉంచిందా? 
నమ్రత: అలా ఏం కాదు. తన కో–స్టార్ట్స్‌తో చాలా కంఫర్ట్‌బుల్‌గానే ఉంటారు. మహేశ్‌ చుట్టూ ఎవరున్నా... ఎంతమంది ఉన్నా నేను భయపడటానికి వీలు లేనంత భరోసా ఇచ్చారు. తన ప్రవర్తనతో నమ్మకం కలిగిస్తారు. ఆ ధైర్యం కలిగించడం చాలా మఖ్యం.

వంట విషయంలో మహేష్‌గారు ఏమైనా సహాయం చేస్తుంటారా?
నమ్రత: మహేశ్‌కి వంట రాదు. నాక్కూడా అనుకోండి (నవ్వుతూ). సో.. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేయడం లాంటివి ఏమీ జరగలేదు. మంచి వంట మనిషి ఉన్నారు.

సక్సెస్‌ఫుల్‌ మ్యారేజ్‌కి మీరిచ్చే టిప్స్‌? 
మహేశ్‌: హ్యాపీ మ్యారేజ్‌ అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది. ప్రతీ భార్యాభర్త ఈక్వేషన్‌ ఒకలా ఉండదు. ఒక్కో కపుల్‌ది ఒక్కోలా ఉంటుంది. టిప్స్‌ అని చెప్పలేను కానీ సక్సెస్‌ఫుల్‌ రిలేషన్‌కి నమ్మకం, బలమైన స్నేహం ముఖ్యం. మా రిలేషన్‌లో అదే ఫాలో అవుతాం. 
నమ్రత: ఒకరి మీద ఒకరికి నమ్మకం, స్నేహం, కుటుంబ బంధాల మీద మా రిలేషన్‌షిప్‌ ఆధారపడి ఉంది. మా పిల్లలు కూడా కుటుంబ బంధాలు, విలువలు బాగా నమ్మాలని, పాటించాలని, సాధారణమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా అభిమానుల గురించి కూడా చెప్పాలని ఉంది. మా కుటుంబం మీద చాలా మంది అభిమానుల ఆశీస్సులు ఉండటం మా అదృష్టం. మామయ్యగారు, మహేశ్‌గారి అభిమానులు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

పిల్లలకు ఫైనల్‌ ఎగ్జామ్స్‌ దగ్గరపడ్డాయి. మార్కుల విషయంలో మీ ఇద్దరూ లిబరల్‌గానే ఉంటారా?
నమ్రత: ఇంట్లో ఉంటాను కాబట్టి పిల్లల స్టడీస్‌ విషయంలో కేర్‌ తీసుకోవాల్సిన బాధ్యత నాది. అయితే మహేశ్‌కి కూడా చాలా ఇంట్రస్ట్‌. స్కూల్లో ఏం చేస్తున్నారు? ఎలా చదువుకుంటున్నారు? అనేవి చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకుంటారు. 
మహేశ్‌: మార్కుల గురించి ఇద్దరం పెద్దగా పట్టించుకోం. బాగా మార్కులు రావాలని పిల్లలను ఒత్తిడి చేయడం కరెక్ట్‌ కాదని మా ఫీలింగ్‌. అయితే బాగా చదువుకోవాలని, వీలైనంత హార్డ్‌వర్క్‌ చేయాలని చెబుతాం.   – డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement