గ్యాస్ట్రైటిస్‌ అంటే ఏమిటి?  తగ్గుతుందా?  ఫ్యామిలీ డాక్టర్‌ | Sakshi family health counseling | Sakshi
Sakshi News home page

గ్యాస్ట్రైటిస్‌ అంటే ఏమిటి?  తగ్గుతుందా?  ఫ్యామిలీ డాక్టర్‌

Published Fri, Sep 28 2018 12:39 AM | Last Updated on Fri, Sep 28 2018 12:39 AM

Sakshi family health counseling

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 46 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్‌ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా?  – టి. రామకోటేశ్వరరావు, విజయవాడ 
జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. 
కారణాలు: ∙20 నుంచి 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం     ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్‌ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది. 
లక్షణాలు: కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి     ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి  తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. 

చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

హైపో థైరాయిడిజమ్‌ సమస్య నయమవుతుందా?

నా వయసు 37 ఏళ్లు.ఈ మధ్య  నేను బరువు పెరుగుతున్నాను. పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడంతో డాక్టర్‌ను సంప్రదిస్తే టీఎస్‌హెచ్‌ పరీక్ష చేయించారు.  హైపోథైరాయిడిజమ్‌ అని తెలిసింది. హోమియోలో ఈ సమస్యను శాశ్వతంగా తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా? – ఒక సోదరి, నిజామాబాద్‌ 
మానవ శరీరంలో థైరాయిడ్‌ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్‌ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్‌ అనేది మానవ శరీరంలో థైరాయిడ్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. థైరాయిడిజమ్‌ నుంచి తగినంత మోతాదులో హార్మోన్‌ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్‌ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌) అవసరం. అయోడిన్‌ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ సమస్య వస్తుంది. 

లక్షణాలు: ∙బరువు పెరగడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం     ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్‌ 
నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్‌ యాంటీబాడీస్, థైరాయిడ్‌ స్కానింగ్, అల్ట్రాసౌండ్‌. 
చికిత్స: హైపోథైరాయిడిజమ్‌ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు  హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, ఎండీ (హోమియో),  స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌  

రుమ టాయిడ్‌ ఆర్థరైటిస్‌  తగ్గుతుందా?  
నా వయసు 57 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉంటున్నాయి. కీళ్లవద్ద ఎర్రగా మారుతోంది. హోమియోలో పరిష్కారం ఉందా? – వెంకటేశ్వరరావు, కర్నూలు 
సొంత రోగనిరోధక శక్తే దెబ్బతీసే ఆటోఇమ్యూన్‌ వ్యాధులలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ముఖ్యమైనది. ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే వారిలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులతో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ లక్షణాలు బయటపడతాయి. ఇది మహిళలు, పురుషులు, కొన్ని సందర్భాల్లో పిల్లల్లో్ల కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్‌ డిసీజ్‌’ అని అంటారు.
లక్షణాలు: ఈ వ్యాధి యాక్టివ్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్‌ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్‌’ అంటారు.రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్‌ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్‌ ప్రిస్క్రిప్షన్‌ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్‌ కిల్లర్స్, స్టెరాయిడ్స్‌ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే ఉండకపోవచ్చు. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేవు.  హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా కూడా నివారించవచ్చు. 
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement