ప్రత్యేకాంధ్ర కోసం ఆమరణ దీక్ష ఆరంభం
ఆ నేడు
నిన్నమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నట్టే ఆంధ్ర, తమిళనాడు కలిసి ఉండేవి. దానినే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అనేవారు. అయితే తెలుగు భాష మాట్లాడేవారందరి కోసం ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని కోరుతూ నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంటిలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అంతకు ముందే ఆయన అనేక పర్యాయాలు అనేక సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్షలు చేసి, వాటిని సాధించారు. ఆ తర్వాత ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆయన ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు.
దాదాపు రెండు నెలలపాటు అంటే 57 రోజుల పాటు ఆయన మరణించే వరకు దీక్ష ను కొనసాగించారు. ఆయన మరణంతో కేంద్రప్రభుత్వం దిగి వచ్చింది. డిసెంబర్ 19న ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు. ఆయన దీక్షకు గుర్తుగా 2008లో నెల్లూరు జిల్లాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చారు. అంతేకాదు, హైదరాబాద్ నాంపల్లిలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరిట యూనివర్శిటీని నెలకొల్పారు.