త్రిలోకపావనుడు, త్రినేత్రుడు, అయిన ఆ పరమేశ్వరుడు, ఈ 21, శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఇల కైలాసమైన శ్రీశైలమహా క్షేత్రంలో దేవేరి భ్రామరితో కలిసి నవ నవోన్మేషుడై నవవాహనాలపై ఊరేగుతాడు. శివరాత్రి కల్యాణోత్సవానికి ముందే పుష్పోత్సవ పల్లకీ, శివరాత్రి నాడు ప్రభోత్సవ వాహనంలో ఊరేగడంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు కనువిందు చేస్తాడు. ఆయన సేవలో తరించడానికి సకల ప్రాణులు సిద్ధంగా ఉన్నా కొన్నింటిని మాత్రమే ఆయన అనుగ్రహించి వాహనంగా చేసుకున్నాడు. ఆఖరు రోజున తెప్పోత్సవంతో సేవలు ముగుస్తాయి. ఒక్కొక్క వాహనానికి ఒక్కోప్రత్యేకత ఉంది. ఆ వాహనాలు వేటికి ప్రతీక... మొదలైన వాటిపై సాక్షి ప్రత్యేక కథనం.
భృంగి వాహనం
ప్రమథ గణాలలో నంది తరువాత స్థానం కలిగినవాడు భృంగి. ప్రకృతి, పురుషులు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు వేర్వేరు కాదని, ఒక్కరేనని తెలుసుకుని వారిద్దరికి కలిసి ప్రదక్షిణలు ఆచరించాడు. వారిని తన వీపుపై కూర్చోబెట్టుకుని ఊరేగించాడు. ఆనాటి నుంచి భృంగివాహనంగా మారాడు. పార్వతీదేవి కోపానికి గురై రెండు పాదాలలో శక్తి కోల్పోతే స్వామి కరుణించి మూడోపాదాన్నిచ్చి రక్షించాడు. కనుక ఇతను త్రిపాదుడు. నమ్మిన వారిని స్వామి ఎప్పటికీ మరచిపోడని భృంగివాహనం తెలియజేస్తోంది.
హంసవాహనం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు సాయంత్రం స్వామి, అమ్మవార్లు హంసవాహనంపై ఊరేగుతారు. హంస అఖండమైన జ్ఞానానికి ప్రతీక, పరమేశ్వరుడు సకల కళలకు అధిపతి. అంతులేని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కనుకనే జ్ఞానానికి ప్రతీకయిన హంసపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. హంస పాలను, నీళ్లను వేరు చేస్తుంది. పాలల్లో నీళ్లు కలిపి ఇస్తే నీటిని ఉంచి పాలను మాత్రమే స్వీకరిస్తుంది. అలాగే జీవితంలో కష్టనష్టాలు, సుఖదుఃఖాలు వచ్చినా కష్టాలను విడిచిపెట్టి సుఖ జీవనం సాగించాలని, దుర్గుణాలను విడిచి అఖండ జ్ఞానాన్ని సంపాదించమని జ్ఞాన ఉపదేశకుడైన స్వామి జ్ఞానశక్తి అమ్మవారితో కలిసి జ్ఞానప్రతీకయైన హంసవాహనంపై ఊరేగుతారు.
మయూర వాహనం
మయూరం అంటే నెమలి. ఈ నెమలి సమస్త సృష్టి క్రియా చైతన్యానికి ప్రతీక. మయూరం సుబ్రçమణ్యస్వామి వాహనం. మరి ఈ వాహనం స్వామికి వాహనంగా ఎలా మారింది? శివునిలోనూ సుబ్రమణ్యస్వామిలోనూ ఉన్నది ఒకే అంశ అదే శివాంశ. అలా శివుడికి శిఖి (నెమలి)వాహనమైంది. కాగా నెమలి వెయ్యి కన్నులతో (పింఛాలతో)కనిపిస్తుంది. తనను శరణు వేడిన భక్తులను వెయ్యికన్నులతో కనిపెట్టుకుని ఉంటాననడానికి సంకేతంగా నెమలిపై వస్తున్న స్వామి తన భక్తులకు హామీ ఇస్తున్నట్లుంది.
రావణ వాహనసేవ
రావణుడు అఖండ శివభక్తుడు. నిరంతరం శివధ్యానం చేస్తూ ప్రతి నిత్యం కోటి శివలింగాలను అర్చించేవాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఎన్నో వరాలు పొంది పరమేశ్వరుడి కోసం చేసిన తపస్సులో పదిసార్లు తన తలను నరికి తిరిగి పది తలలను పొంది దశకంఠుడిగా పేరు పొందాడు. తన ప్రేగులనే తంత్రులుగా చేసుకుని తన పదవతలనే మీటగా మార్చి వీణానాదంతో శివుడికి ప్రీతి కలిగించాడు. ఆ వీణే రుద్రవీణగా ప్రసిద్ధికెక్కింది.. రావణుని పది తలలు పది రకాలెన జ్ఞానానికి ప్రతీక. అనన్యమైన భక్తితో పరమేశ్వరుడిని శరణు వేడితే అపారమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని రావణవాహనం చెబుతోంది.
పుష్పపల్లకీ సేవ
స్వామివారు అభిషేక ప్రియుడైతే అమ్మవారు పుష్పప్రియురాలు. హిమవంతుడు తన కుమార్తెతో వివాహానికి స్వామివారిని ఒప్పించి స్వామిని తీసుకురమ్మని మేనా (పల్లకి)ని పంపుతాడు. ఆ మేనాను సృíష్టిలో అరుదైన అద్భుతమైన దివ్యపరిమళం కలిగిన పూలతో అలంకరించి పంపుతుంది పార్వతిదేవి. తన వాహనం విడిచి రాని శివుడు పార్వతి మాట చెల్లించడం కోసం ఆ పుష్పపల్లకి ఎక్కి వస్తాడు. పుష్పాలు మోహాన్ని కలిగిస్తాయి. ఆ మోహం క్షణికం. సుతిమెత్తని పూల ఆయుష్షు ఒక్కరోజే కాని అవి చేరాల్సిన చోటుకు చేరి పరమేశ్వరుని సాన్నిధ్యం పొందాయి. నేను పెంచిన పూలైన మీరంతా నన్ను ఆర్చించి చివరకు నా దరికే చేరుకోండనే సంకేతం ఉంది.
గజవాహనసేవ
గజం ఐశ్వర్యానికి, ఆధిపత్యానికి, అంగబలానికి ప్రతీక. శ్రీశైలమల్లికార్జునస్వామి శ్రీలింగ మహాచక్రవర్తి, ఈ సమస్త భూమండలానికి మూలమై నిలిచే శ్రీశైలం ఆయన మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాధినేతకు, సమస్త భక్తులు ఆయన సైన్యం. జయ జయధ్వానాల నడుమ ఆయన అమ్మతో కలిసి ఐరావతాన్ని ఆధిరోహించి దర్శనమిస్తాడు. భక్తులకు అండగా నిలుస్తాడు. ఈ సమస్త భూ మండలాన్ని అష్ట దిగ్గజాలు మోస్తున్నాయి. ఈ దిగ్గజాలు అషై్టశ్వర్యాలకు ప్రతీకలు. అటు వంటి అష్టగజాల సమిష్టి రూపమైన గజంపై ఆయన ఊరేగింపుగా వస్తుంటే సమస్త భక్తులకు కొండంత అండగా కనిపిస్తాడు. తమ కష్టాలు గట్టెక్కాయనే ధైర్యం భక్తులలో కలుగుతుంది. కుబేరుడు, లక్ష్మీదేవి మొదలైన వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించినæఐశ్వరేశ్వరుడు. గజవాహæనంపై దర్శనమిస్తున్న స్వామి భక్తులకు సమస్త సుఖసంపదలను ప్రసాదిస్తాడు.
ప్రభోత్సవం
ఉత్సవాలలో ముఖ్యమైన మహాశివరాత్రి నాడు ప్రభోత్సవం అత్యంత ప్రముఖమైన ఘట్టం. ప్రభపై స్వామి, అమ్మవార్లు ఊరేగుతారు. ప్రభ రెండు స్తంభాలు ఒకటై చివరికి ముక్కోణంగా కనిపిస్తుంది. అంటే భగవంతుని మూడు మార్గాల ద్వారా అంటే కాయక (శరీరం) వాచిక (మాటలు), మానసిక మార్గం ద్వారా ఉపాసించమని తెలుపుతుంది. ప్రభలో ఎన్ని రంగులున్నాయో, తమ జీవితంలో అన్ని శుభాలు కలగాలని స్వామిని కోరుకుంటారు.
నందివాహనసేవ
నంది శివుడికి అత్యంత ఆప్త భక్తుడు. తనకు తండ్రి ద్వారా లభించిన శివభక్తితో శివుడికై తపస్సు చేసి చివరికి ఎప్పటికీ శివుని వీడి ఉండకుండా నిరంతరం స్వామి సాహచర్యం పొందే గొప్ప అవకాశాన్ని పొందాడు. నంది సాక్షాత్తు ధర్మస్వరూపం. అతడి నాలుగు పాదాలు నాలుగు వేదాలు. అతడి రెండు కళ్లు సూర్యచంద్రులు. అతని రూపం రుద్రుడి రూపం. అతని హృదయం ధర్మానికి నిలయం.
రథోత్సవం రథం
ఒక వాహనం మాత్రమే కాదు. ఒక సంకేతం. రథచక్రం కాల చక్రానికి ప్రతీక. ఆత్మను రథసారథిగా, మనస్సును పగ్గాలుగా, దేహాన్ని కదిలే రథంగా అభివర్ణించాయి ఉపనిషత్తులు. రథం చూడడానికి మరో ఆలయంగా దర్శనమిస్తుంది. ఆలయానికి చక్రాలు బిగించి కదిలే దేవాలయంగా కమనీయంగా దర్శనమిస్తుంది రథం. భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునుడు రథంపై విహరిస్తూ భక్తుల తాపత్రయాన్ని (మూడు బాధలను) నివారిస్తూ ఆలయానికి రాలేని వృద్ధులు, రోగులను ఆదుకుంటానని అభయమిస్తూ రథాలయాన్ని భక్తుల ముందుకు తెస్తుందీ రథోత్సవం. అశ్వం నూతనత్వానికి ప్రతీక. నిరంతరం శక్తిని కూడగట్టుకుని లక్ష్యాన్ని చేరే వరకూ అలుపెరగదు అశ్వం. అలాగే పరమేశ్వరుని పాదాలను చే రుకునే వరకు మీ పూజలు, తపస్సు ఆపకండి నిరంతరం శివభక్తిలో ప్రయాణించి చివరకు శివసాన్నిధ్యం పొందటమే మీ జీవిత లక్ష్యంగా మార్చుకొండి అని అశ్వవాహనం తన సందేశాన్ని తెలుపుతుంది. – ఎన్.నాగమల్లేశ్వరరావు, సాక్షి, శ్రీశైలం
రథోత్సవం
తెప్పోత్సవం
అశ్వవాహనం
Comments
Please login to add a commentAdd a comment