చిన్నపిల్లల పెద్ద మనసు | Sisters Donate Their Hair For Cancer Patients | Sakshi
Sakshi News home page

చిన్నపిల్లల పెద్ద మనసు

Published Mon, Sep 9 2019 7:53 AM | Last Updated on Mon, Sep 9 2019 7:53 AM

Sisters Donate Their Hair For Cancer Patients - Sakshi

క్యాన్సర్‌ బాధితులైన చిన్నారుల కోసం తల నీలాలను విరాళంగా ఇచ్చిన అక్క ఇలాక్షి, చెల్లి సమారియా. సమారియా : విరాళం ఇవ్వడం కోసం జుట్టు కట్‌ చేయించుకుంటూ, చేయించుకున్నాక.

పిల్లలను టీవీలో వచ్చే కమర్షియల్‌ యాడ్స్‌ బాగా ఆకర్షిస్తుంటాయి. వాటిని చూసిన వెంటనే కొనివ్వమని మారాం చేస్తారు. కొంతమంది పిల్లలు ఇలా అడిగేసి అలా మర్చిపోతుంటారు. కొందరు అమ్మానాన్నలకు మర్చిపోయే చాన్సివ్వకుండా కొనిచ్చే వరకు అడుగుతూనే ఉంటారు. అయితే ఢిల్లీ సమీపంలోని గుర్‌గావ్‌ అక్కాచెల్లెళ్లు ఇలాక్షి, సమారియాలు ఓ యాడ్‌ని చూసి పెద్దవాళ్లకంటే బాధ్యతగా స్పందించారు!

ఆన్‌లైన్‌లో చూసిన ఒక వీడియో ఈ అక్కాచెల్లెళ్లను కదిలించింది ఆ వీడియోలో ఓ అమ్మాయి.. ఒత్తయిన జుట్టుతో స్కూలుకు వెళ్తుంది. స్కూల్లో మిగిలిన పిల్లలు ఆ అమ్మాయి చుట్టూ చేరి ప్రశ్నలతో ముంచెత్తుతారు. ప్రశంసలతో ఊపిరాడనివ్వరు. అప్పుడా అమ్మాయి ఎవరో దాతలు తనకు విగ్గును బహుమతిగా ఇచ్చారని చెబుతుంది. ఆ మాట చెప్పిన అమ్మాయి క్యాన్సర్‌ బాధితురాలు. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగా కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి జుట్టు పూర్తిగా రాలిపోయి ఉంటుంది. గుండుతో బయటకు రావడానికి బిడియపడిన ఆ అమ్మాయి కొన్నాళ్లపాటు ఇల్లు దాటకుండా గడిపి ఉంటుంది. దాతల దాతృత్వంతో విగ్గు రావడంతో ఇప్పుడు సంతోషంగా స్కూలుకు వస్తున్నట్లు చెప్తుందామె ఆ వీడియోలో. ఆ మాట చెప్పేటప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆనందం ప్రతి క్యాన్సర్‌ బాధితులకు అందాలని కోరుకుంది ఇలాక్షి. ఈ అమ్మాయి ఆరవ తరగతి, చెల్లెలు మూడవ తరగతి. చిన్నమ్మాయికి అంత పెద్ద ఫీలింగ్‌ అర్థమైనట్లు లేదు. కానీ అక్క ఫీలింగ్‌కి మాత్రం అర్థమైంది. అందుకే వాళ్లిద్దరూ తమ జుట్టును క్యాన్సర్‌ బాధితులకు విరాళంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదే విషయాన్ని వాళ్లమ్మతో చెప్పారు. ఆమె సెలూన్‌కి తీసుకెళ్లి జుట్టు కత్తిరించి ముంబయిలో క్యాన్సర్‌ బాధితుల కోసం పనిచేసే çసంస్థలకు అందచేశారు. అందుకే అంటారు బాల్యం స్వచ్ఛమైనది అని. అరమరికలు లేకుండా అభిమానిస్తుంది బాల్యం. ఇవ్వడంలో సంతోషాన్ని పొందేది, సంతోషాన్ని పంచుకునేది, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చేదీ బాల్యమే.

సేకరించే సంస్థలు ఉన్నాయి
దాతల నుంచి కేశాలను సేకరించి వాటిని విగ్గులు తయారు చేసే కంపెనీలకు చేర్చడం, తయారైన విగ్గులను క్యాన్సర్‌ పేషెంట్‌లకు అందచేయడం వంటి సర్వీస్‌ అందించడానికి కొన్ని ఆర్గనైజేషన్‌లు పని చేస్తున్నాయి. ‘హెయిర్‌ క్రౌన్‌ ఆర్గనైజేషన్‌’ తమిళనాడులోని తేనిలో ఉంది. గడచిన ఐదేళ్లుగా పని చేస్తున్న ఈ ఎన్‌జీవో ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల మంది దాతల నుంచి జుట్టును సేకరించింది. ఒక విగ్‌ తయారు చేయాలంటే ఐదారుగురు మహిళల నుంచి సేకరించిన జుట్టు అవసరమవుతుంది. వెంట్రుక మందం అనేది పెద్ద విషయం కాదు, అయితే పొడవు మాత్రం పన్నెండు అంగుళాలు ఉండాల్సిందేనంటారు విగ్‌ తయారీదారులు. ఇక ముంబయిలో ‘కోప్‌ విత్‌ క్యాన్సర్‌’ అనే సంస్థ ఈ సేవలనందిస్తోంది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో గడచిన ఆరేళ్లుగా పని చేస్తున్న ‘సర్గక్షేత్ర’ ఎన్‌జీవోకి వెయ్యిమందికి పైగా దాతలు తమ కేశాలను విరాళంగా ఇచ్చారు. ఈ ఎన్‌జీవో మగవాళ్ల నుంచి కూడా కేశాలను సేకరిస్తోంది. ‘ఫర్‌ యు ట్రస్ట్‌’ కూడా కేరళలోనే ఉంది. ఇది కన్నూరులో ఉంది. ఈ ఎన్‌జీవో కార్యకలాపాల గురించిన సమగ్ర వివరాలు ఆయా వెబ్‌సైట్‌లలో ఉంటాయి.

ఇచ్చే జుట్టు ఎలా ఉండాలి?
తల స్నానం చేసి, చక్కగా ఆరిన తరవాత మాత్రమే కట్‌ చేయాలి. కలర్స్‌ వేసిన జుట్టు పనికి రాదు. అలాగే హెయిర్‌ స్టయిల్స్‌ నిలవడం కోసం హెయిర్‌ స్ప్రేలు వాడిన కేశాలు శుభ్రపరిచిన తర్వాత మాత్రమే కలెక్ట్‌ చేయాలి. కత్తిరించిన జుట్టుకు రబ్బర్‌ బ్యాండ్‌ వేసి పోనీ టైల్‌లాగ చేసి జిప్‌లాక్‌ కవర్‌లో పెట్టాలి. దీనిని గట్టి కవర్‌లో పెట్టి కొరియర్‌ చేయాలి. కవర్‌ మీద దాత పేరు, ఈ మెయిల్‌ ఐడి, ఫోన్‌ నంబరు తప్పనిసరిగా రాయాలి.

చిన్న సంగతేమీ కాదు
తల మీద జుట్టు లేకుండా గుండుతో బయటకు రావడం చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ భరించేవాళ్లకది చాలా పెద్ద విషయమే. వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే ఇబ్బంది ఒకటైతే... అంతకంటే పెద్ద ఇబ్బందిని మానసికంగా అనుభవిస్తుంటారు. అందరూ ముఖానికి ప్రశ్నార్థకాన్ని అతికించుకుని మరీ జుట్టే లేని తల వైపు తదేకంగా చూస్తారు. అంతెందుకు? దేవుడికి గుండు గీయించుకున్న పిల్లలను కూడా స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటారు. కీమో గుండు ఉన్న వాళ్లను ఏడిపించకూడదని పిల్లలకు తెలియచెప్పినప్పటికీ, చూపులను తట్టుకోవడం అంత తేలికకాదు. అందుకే క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థులు ట్రీట్‌మెంట్‌ తర్వాత మామూలు మనుషుల్లాగానే ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవడానికి కొంచెం జంకుతుంటారు. అలాంటిది చిన్న పిల్లలు ఆ స్థితిని భరించడం చిన్న సంగతేమీ కాదు. అయితే సమాజంలో తోటి వాళ్లు కొద్దిగా బాధ్యత వహిస్తే ఆ జంకును చాలా సులభంగా తొలగించవచ్చు. ఆ సహకారం ఇవ్వడానికి ముందుకొచ్చారు ఈ అక్కాచెల్లెళ్లు. ‘‘ఇప్పుడు కత్తిరించిన జుట్టు మరో ఆరు నెలల్లో తిరిగి వస్తుంది. అప్పుడు మళ్లీ జడలు వేసుకుంటాం. మా జుట్టుతో మరో అమ్మాయి సంతోషంగా ఉంటుందంటే అంతకంటే మాకు స్వీట్‌ మెమొరీ ఇంకేం కావాలి’’ అని అడుగుతున్నారీ అక్కాచెల్లెళ్లు.– మంజీర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement