వారంలోనే మెరుపు!
పళ్లు తెల్లగా మెరవాలంటే రోజూ బ్రషింగ్ అయ్యాక ఓ చిన్న చిట్కా పాటిస్తే చాలు. ఒక గిన్నెలో తాజా నిమ్మకాయను పిండి రసాన్ని తీయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి బ్రషింగ్ అయ్యాక ఆ రసాన్ని రెండు సార్లు నోట్లో పోసుకొని ఓ రెండు నిమిషాల పాటు పుక్కిలించి ఊసేయాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే పళ్లు తళతళా మెరవడం ఖాయం.
జుట్టుకు రకరకాల కండీషనర్లు వాడి, రసాయనాలతో విసిగిపోయారా? అయితే ఇంట్లో ఉండే కండీషనర్‌తో ఇటు ఆరోగ్యంగానూ అటు ఆర్థికంగానూ లాభం పొందండి. కుంకుడు రసంతో కానీ షాంపూతో కానీ తల స్నానం చేశాక తేనెను జుట్టుకు పట్టించండి. ఓ 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో జుట్టును కడిగేసుకోండి. అంతే నిగనిగలాడే కండీషన్డ్ హెయిర్ మీ సొంతం.
ముఖంపై మొటిమలతో బాధపడే వారు ఒక్క గుడ్డుతో వాటిని మాయం చేసుకోవచ్చు. ఒక చిన్న పాత్రలో గుడ్డును పగలగొట్టి తెల్ల సొనను వేయండి. చిన్న బ్రష్ సాయంతో మొటిమలపై ఆ సొనను రాసుకొని కాసేపు కునుకు తీయండి. లేచిన వెంటనే ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. గుడ్డు తెల్ల సొన మొటిమలపై ఎంతసేపు ఉన్నా ఎలాంటి నష్టం ఉండదు. ఈ చిట్కా తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది.