నేనెప్పుడూ అంతే... | special chit chat with heroine anjili | Sakshi
Sakshi News home page

నేనెప్పుడూ అంతే...

Published Sat, Jan 16 2016 10:15 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

నేనెప్పుడూ అంతే...

నేనెప్పుడూ అంతే...

దీపానికి పెట్టే పేరు అంజలి. దీపం పెట్టి వెతికినా సినిమాల్లో తెలుగమ్మాయి హీరోయిన్‌గా కనిపించని దశలో.. అంజలి సినిమా థియేటర్‌లో వెలిగే దీపం అవుతుందని వాళ్ల అమ్మానాన్న కూడా అనుకోలేదు. పదేళ్లలో పలు భాషల్లో ముప్పై రెండు సినిమాల్లో తెలుగు వెలుగులు విరజిమ్మింది. ఇంటర్వ్యూ అంతా అదే వెలుగు!  ‘అలా ఎలా?’ అని అడిగితే.. ‘నేనెప్పుడూ అంతే..’ అంటూ చిరునవ్వులు వెదజల్లింది.
 
కొత్త సంవత్సరం చాలా బిజీగా ఉన్నట్లున్నారు?
అవునండీ. చాలా హ్యాపీగా స్టార్టయింది. ‘డిక్టేటర్’కి మంచి పేరొచ్చింది. తమిళంలో ‘ఇరైవి’ రిలీజ్‌కి రెడీ. మమ్ముట్టి సరసన తమిళ ‘పేరన్బు’లో మంచి పాత్ర చేస్తున్నా. తెలుగు, తమిళ షూటింగ్‌లతో హైదరాబాద్, చెన్నైల మధ్య తిరుగుతూ బిజీ బిజీగా ఉన్నా.
     
తెలుగునాట స్థిరపడినట్లేనా?
(నవ్వేస్తూ...) గతంలో ఎక్కువగా తమిళంలోనే చేసేదాన్ని. కానీ, ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో - ఒక్కోదానిలో రెండు మూడు చొప్పున చేస్తున్నా. అయితే, ఇప్పుడు నా బేస్ హైదరాబాదే. ఇక్కడే ఉంటున్నా.
     
మీ సెల్ఫీలు వగైరా చూస్తుంటే, కెమేరా ముందే కాదు వెనక కూడా అల్లరి చేసినట్లున్నారు. మీ ఉల్లాస రహస్యం?
మామూలుగా నేనెప్పుడూ అంతే! కొంచెం హైపర్. మూడీగా కూర్చోవడం నా వల్ల కాదు. నేనెప్పుడైనా అలా మూడీగా ఉంటే, అందరూ ఏమిటేమిటని అడిగేస్తారు. పుట్టినతేదీ రీత్యా నా రాశి ‘జెమినీ’ (సింహరాశి). నేను డల్‌గా ఉండలేను. అందరినీ నవ్వుతూ పలకరిస్తుంటాను. జీవితంలో ఒడుదొడుకులు వస్తుంటాయి. బీ హ్యాపీ... ఇట్స్ వన్ లైఫ్... అనేది నా సిద్ధాంతం. అంతే!  
     
తమిళంలోని మీ పాత్రలు, తెలుగులో చేస్తున్నవీ చూస్తుంటే కొత్త తరహావాటికి ప్లాన్ చేస్తున్నట్లనిపిస్తుంది?
ఇక్కడ ప్లాన్ చేయడమంటూ ఏమీ ఉండదు. మన దగ్గరకొచ్చినవాటిలో బెస్ట్‌ది ఎంచుకోవ డమే. మొదటి నుంచీ పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాను.  
     
మొత్తానికి సినిమా రంగానికి వచ్చి పదేళ్ళు కావస్తోంది. పాతిక పైనే సినిమాలు చేసేశారు!

(నవ్వేస్తూ...) దర్శక - నిర్మాతలు, అభిమానుల అండదండలే కారణం. పదేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. పాతిక సినిమాలనే మైలురాయి ఎప్పుడు దాటానో కూడా చూసుకోలేదు. ఆ మధ్య ఇంటర్నెట్ వెతికితే, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు, అతిథి పాత్రలు - అన్నీ కలుపుకొని ఇప్పటికి 32 ఫిల్మ్స్ చేశానని తేలింది.  
     
అతిథి పాత్రలన్నారు... హీరోయిన్ అయ్యుండీ, ‘శంకరాభరణం’లో లేడీ గ్యాంగ్ లీడర్‌గా ఎలా చేశారు?

నాకెప్పుడూ డిఫరెంట్ తరహా పాత్రలే నచ్చుతాయి. గత ఏడాది ‘గీతాంజలి’ తరువాత బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అవి చేస్తే, ఏడాదికి కనీసం మూడు, నాలుగు సినిమాలు చేసేయచ్చు. కానీ, అలాంటివే మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఫ్లాప్ రావడం తప్ప, మనకు జరిగే మంచి ఏమీ ఉండదు. నా మటుకు నాకు డబ్బు సంపాదన రెండో విషయం. సంతృప్తినిచ్చే పాత్రలు చేయడం మొదటి విషయం. చెట్టూ పుట్టల వెంట తిరుగుతూ డ్యాన్సులు చేసే పాత్రలూ చేయాల్సిందే. కాకపోతే, అలాంటివి ఏటా 3, 4 చేస్తే కానీ, మనం గుర్తుండం. అదే గనక ‘గీతాంజలి’ లాంటివి ఒక్కటి చేయడం వల్ల ఏడాది మొత్తానికి సరిపడా పేరు సంపాదించుకుంటాం.
    
తెలుగమ్మాయి అయిన మీరు తమిళనాడుకు ఎలా?
టెన్త్ క్లాస్ వరకు తూర్పుగోదావరి జిల్లా రాజోలులోనే చదువుకున్నా. ఆ తరువాత చెన్నైకి షిఫ్ట్ అయ్యాం. టెన్త్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చదివా. అక్కడ చదువు కుంటూ, మోడలింగ్ చేశా. అప్పట్లో నేను డ్యాన్స్ క్లాస్‌కు వెళుతున్నప్పుడే నన్ను చూసి, సినిమాలకు అడిగారు. తెలుగులో దర్శకుడు శివనాగేశ్వరరావు ‘ఫోటో’ తొలి చిత్రం. తమిళంలో తొలి సినిమాతోనే (‘కట్రదు తమిళ్’) మంచి పేరొచ్చింది. ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ దక్కింది. అలా అక్కడ సినిమాలు చేస్తూ వచ్చా.
     
ఒక రకంగా తెలుగులో కన్నా పరాయి భాషలోనే మీకు తొందరగా పేరు, గుర్తింపు దక్కాయేమో!
 నిజానికి, అప్పుడే తెలుగులోనూ చేసినా, ఇక్కడ తొలి చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. మరోపక్క తమిళంలో విజయాలొచ్చి, అక్కడ వరుసగా ఫిల్మ్స్ చేశా. ‘అంగాడి తెరు’ (తెలుగులో ‘షాపింగ్ మాల్’)తో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ (తెలుగులో ‘జర్నీ)లో ఒరిజనల్ స్కిన్‌టోన్‌లో ఉంటా. అబ్బాయి తరహా దుస్తుల్లో కనిపిస్తా. అదీ బాగా పేరు తెచ్చింది. తెలుగునాట అవన్నీ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్స్‌లా ఆడే శాయి. చాలామందికి నేను గతంలో చేసిన సినిమాలు తెలీవు. ‘జర్నీ’ తొలి తెలుగు చిత్రం అనుకుంటారు.
     
చిన్నప్పుడు అబ్బాయిల దుస్తుల్లో అల్లరి చేసేవారట!                                                                                                  
(నవ్వేస్తూ...) బాగానే రిసెర్చ్ చేసినట్లున్నారు. రాజోలులో స్కూల్‌లో చదువుకొనే రోజులవి. వారంలో మిగిలిన రోజుల్లో యూనిఫామ్ ఉన్నా, శనివారం నాడు సివిల్ డ్రెస్ వేసుకోనిచ్చేవాళ్ళు. అప్పట్లో మా అమ్మను అడిగి, ప్యాంట్లు, షర్ట్స్ లాంటివి కొనిపించుకొని, అవి వేసుకొని వెళ్ళేదాన్ని. దాంతో, మా మాస్టార్ కూడా ‘నువ్వు అమ్మాయిల బెంచీలో కాదు... అబ్బాయిల బెంచీలో కూర్చోవాలి’ అంటూ ఆట పట్టించేవారు.
     
క్లాసులు ఎగ్గొట్టి, సినిమాలకు వెళ్ళిన అనుభవాలు?
 ఒకే ఒక్కసారి అలా చేశా! టెన్త్ క్లాస్ చదువుతున్న ప్పుడు ‘నువ్వే కావాలి’ సినిమాకు క్లాసు ఎగ్గొట్టి వెళ్ళా.
     
దక్షిణాది భాషలన్నిట్లో చేస్తున్నారు. ఒకేసారి రెండు, మూడు పడవల్లో కాలుమోపడం వల్ల కష్టమేమో?
అవకాశాలు వచ్చినప్పుడు ఇతర భాషల్లో చేస్తే తప్పేంటి? ఒకటికి, నాలుగు భాషల్లో చేయడం వల్ల అన్ని భాషలూ తెలుస్తాయి. కన్నడంలో ఈ ఏడాది ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ సరసన ‘రణ విక్రమ’ అనే సినిమా చేశా. కష్టమైన పాత్ర. ప్రశంసలొచ్చాయి.
     
కానీ హీరోయినై ఉండి... చిన్న పాత్రలూ చేయడం...

 (మధ్యలోనే అందుకుంటూ...) నిడివి కన్నా సినిమాలో నేను పోషించే ఆ పాత్ర ప్రాధాన్యం ఏమిట న్నది ముఖ్యం. క్యారెక్టర్ కొత్తగా ఉంటే ఒప్పేసుకుంటా.

అయితే, ‘శంకరాభరణం’లో విలన్ పాత్రకు రచయిత కోన వెంకట్ మీకు ఏం చెప్పి, ఒప్పించారు?
 ఆ పాత్ర నేనే చేయాలని కోన పట్టుబట్టారు. గ్యాంగ్ స్టర్ మున్నీ పాత్ర నాకెలా కుదురుతుంద నుకున్నా. ఆ మాటే అన్నా కూడా. కానీ, క్యారెక్టర్ ప్రాధాన్యం చెప్పి, కొత్త ట్రెండ్ అవుతుందనడంతో ఒప్పుకున్నా.
  
ఆ సినిమాలో ప్రత్యేకగీతం చేయడంలో వ్యూహం?
నిజానికి, మొదటి ప్లాన్‌లో దీన్ని అతిథి పాత్రగానే అనుకున్నాం. పాట అనుకోలేదు. తీరా మున్నీ దీదీ పాత్ర స్వభావం చెప్పేపాట పెడితే, హెల్పవుతుందనుకున్నాం. పాట వినగానే, ష్యూర్ షాట్ హిట్ అని కూడా అర్థమైంది.  
     
కానీ, తీరా సినిమా ఆశించినట్లు హిట్టవలేదుగా!

 కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా, నాకు పేరొచ్చింది.
     
మొత్తానికి, మీరిప్పుడు ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అయ్యారు. తమిళ ‘కో’ (తెలుగులో ‘రంగం’) నుంచి వరుసగా ఐటమ్ సాంగ్స్‌లో కనిపిస్తున్నారు!

ఒక్కమాట! అవేమీ ఐటమ్ సాంగ్స్ కావు... స్పెషల్ సాంగ్స్. ‘రంగం’లో చేసింది అతిథి పాత్ర అనుకోవచ్చు. ‘సింగమ్-2’లో దర్శకుడు హరి, హీరో సూర్య అడగ డంతో హీరో పరిచయ గీతం కాబట్టి ఒప్పుకున్నా.
     
‘సరైనోడు’లో అల్లు అర్జున్‌తో పాట చేస్తున్నారుగా!
‘శంకరాభరణం’లోని నా ‘ఘంటా...’ పాట టీజర్ చూసి, దర్శకుడు బోయపాటి శ్రీను అడిగారు. ఇది కూడా స్పెషల్ సాంగే. పైగా, ‘ఘంటా...’ పాట కంపోజ్ చేసిన శేఖర్ మాస్టరే ఆ పాటా చేస్తున్నారు. అల్లు అర్జున్ పక్కన నాకూ సరిసమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే, ఒప్పుకున్నా. సినిమా చూశాక మీకూ అర్థమవుతుంది.
     
స్పెషల్ సాంగ్స్‌కి మీరూ రెమ్యూనరేషన్ పెంచేశారా?

 (నవ్వేస్తూ...) అదేమీ లేదు. అయినా, ఎవరైనా సరే డిమాండ్ ఉన్నప్పుడేగా నాలుగు డబ్బులు సంపాదించు కోవాలి! మార్కెట్‌లో దేనికైనా సేల్స్ బాగా ఉన్నప్పుడే ధర పెంచుతారు. హీరోయిన్ మార్కెట్ తగ్గిపోయాక, ఎవరూ ఆమెకు అంత పారితోషికమివ్వరుగా!
     
మరి మంచి పాత్రైనా పరిమిత బడ్జెట్ ఫిల్మ్ అయితే?

 నటీనటులు కూడా కరాఖండిగా ఏమీ ఉండట్లేదు. మంచి పాత్ర అయ్యుండి, సినిమాకు పెద్ద బడ్జెట్ లేదంటే, పారితోషికాలు తగ్గించుకుంటున్నారు. నేనూ అంతే! పారి తోషికం తగ్గించుకుంటా కానీ, మంచి పాత్ర వదులుకోను.
    
ఏమైనా ఆశించినన్ని పాత్రలు, గుర్తింపొస్తున్నాయా?
చూడండి. ‘డిక్టేటర్’లో చేశా. విష్ణు సరసన అడిగారు. మరోపక్క ‘చిత్రాంగద’లో నటిస్తున్నా. ‘పిజ్జా’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు డెరైక్షన్‌లో ‘ఇరైవి’, అలాగే ‘తరమణి’ - ఇలా తమిళంలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. మలయాళంలో చేస్తున్నా పదేళ్లలో 32 ఫిల్మ్స్ చేయడ మంటే, గుర్తింపున్నట్లేగా! ఇంకెందుకు, భయం, బెంగ!!
   
మీరు దేనికీ భయపడరా?
(నవ్వేస్తూ..) ఎందుకు భయపడను! భయపడతాను. కానీ, దేనికి భయపడతానో చెప్పను. ఎందుకంటే... రేపటి నుంచి అందరూ నన్ను అలా భయపెట్టేస్తారుగా! (నవ్వు)
     
మరి, మీ ప్రధానమైన బలం?

గర్వం లేకపోవడం! అందర్నీ నవ్వుతూ పలకరిస్తా. ఎవరితోనైనా ఇట్టే స్నేహం చేస్తా. అది నా ఎస్సెట్.
 
మీ మేనిఛాయ బాగుంటుంది. ఆ టిప్ చెబుతారా?
ఐ డోన్ట్ ఫాలో బ్యూటీ టిప్స్! ఫేషియల్స్‌కి, కెమికల్ ట్రీట్‌మెంట్స్‌కి నేను దూరం. ఎక్కడ ఉన్నా మానసికంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తా.
     
మీ కుటుంబ వివరాల మాటేంటి?

నేను... మా అమ్మ. నాకు ఇద్దరు అన్నలు. అక్కయ్య. హైదరాబాద్‌లోనే అక్కయ్య ఉంటుంది. నేను ఆఖరు!
     
ఆ మధ్య కుటుంబ వివాదాల్లో ఉన్నారు. తగ్గాయా?

 టైమ్ పడుతుందండీ! ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలుంటాయి. కాకపోతే, మేము సినీ నటులం కాబట్టి, మా గురించి బయటకు వస్తుంటుంది. అంతే!
     
కోన వెంకట్ లాంటి శ్రేయోభిలాషులు కాకుండా, ఇండస్ట్రీలో మీకు మంచి స్నేహితులంటే...

 చాలామందే ఉన్నారు. ఒకరి పేరు చెప్పి, ఇంకొకరి పేరు చెప్పకపోతే - బాగుండదు.  
    
ఈ పదేళ్ళ ప్రయాణంలో మీ కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్?
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’. తమి ళ్‌లో ‘అంగాడి తెరు’, ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’. మల యాళంలో, కన్నడంలో చేసినవి తక్కువే. మలయాళంలో ‘పయ్యన్స్’, కన్నడంలో ‘రణవిక్రమ’ గుర్తుంచుకోదగ్గవి.
 
 - రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement