
పూలకు మొక్కుత
దేవుని పాదాల చెంతకు చేరాలనుకుంటుంది. మనిషిలో ఏ మంచి ఆలోచన వచ్చినా సమాజానికి పాదులు...
దేవుడు, ప్రకృతి, సమాజం, మనిషి..
ప్రపంచానికున్న నాలుగు దిక్కులు.
దేవుణ్ని ప్రేమించనివాడు...
ప్రకృతిని కాపాడనివాడు...
సమాజాన్ని గౌరవించనివాడు...
సాటి మనిషిని హత్తుకోనివాడు...
దైవానుగ్రహానికి అనర్హుడు.
పువ్వు ఏ చెట్టుకు పూసినా
దేవుని పాదాల చెంతకు చేరాలనుకుంటుంది. మనిషిలో ఏ మంచి ఆలోచన వచ్చినా సమాజానికి పాదులు తీసి నాటాలనిపిస్తుంది.బతుకమ్మ పండగ.. దేవునికి, సమాజానికి, మనిషికి ప్రకృతి పూలు అద్దే సుగంధం. అలాంటి పూలకు మొక్కుత అలాంటి గుణానికి దండం పెడత.
పూలు లేని పూజ ఉండదు. పూలనే పూజించడం అంటే .. ఏమిటీ ఆంతర్యం?
బతుకమ్మ అంటే వేదాంతం. ఒక జీవనప్రయాణం ఎలా ఉంటుందో ఈ బతుకమ్మ ద్వారా తెలుసుకోవచ్చు. అడవిలో పూసే గునుగు, తంగేడు.. వంటి పూల చెట్లను మనవెవ్వరమూ నాటం. నీళ్లు పోయం. దేవుడే వాటిని పుట్టించాడు. ఆ పూలను ఏరుకొచ్చి ఒద్దికగా పేర్చి, బతుకమ్మ అని కొలుస్తూ, సంబరం చేసుకుంటాం. మనిషి బతికున్నన్నాళ్లు ఇంత సంబరంగా ఉండాలని ఆడతాం, పాడతాం. తర్వాత అందంగా పేర్చిన ఆ బతుకమ్మను నీళ్లలో వదిలేస్తాం. అంటే ప్రకృతిలో కలిపేస్తాం. మనిషి కూడా చివరకు అంతేగా! ప్రకృతిలో కలిసి పోవాల్సిందే! ఇది వేదాంతం. అందుకే ఈ సందర్భంగా తొలిరోజున పెద్దలను గుర్తుచేసుకొని బతుకమ్మను పేర్చుతాం. అంటే ముందు మరణాన్ని తలుచుకుంటున్నాం. అదే బతుకమ్మ పండగలో భాగమయ్యింది.
రెండవది.. ప్రకృతి ఆరాధన. గిరిపుత్రిక పార్వతీ దేవి శివపూజ కోసం పూలన్నీ ఒకచోట చేర్చి తీసుకెళ్లేది. అలా మనం పూలన్నీ తీసుకెళ్లి ఆడి పాడి శివునికి అర్పిస్తున్నాం. పార్వతీ, పరమేశ్వరులు ప్రకృతీ పురుషులు కదా! మూడవది.. పర్యావరణం. ఔషధ గుణాలున్న పూలన్నీ తీసుకెళ్లి నీళ్లలో వదిలితే నీళ్లు శుద్ధి అవుతాయి. దానివల్ల జీవులకు శుద్ధ జలం అందుతుంది. అంటే.. ఈ పండగలో అధ్యాత్మికత, ప్రకృతి, పర్యావరణం అలాగే సామాజికం... ఇవన్నీ ఒకదానికొకటి కలిపి ఉన్నాయి. దేనికీ భంగం కలగకుండా మనిషిగా మన బాధ్యతలేంటో ఈ పండగ తెలియజేస్తుంది.
ప్రతీసారి బతుకమ్మ ఉత్సవాలు దేశ విదేశాలలో చేస్తుంటారు. ఈ సారి ఆ హంగామా కనిపించడం లేదు?
బతుకమ్మ వేడుక దేశ విదేశాలలో వరుసగా తొమ్మిదేళ్లు చేస్తానని సంకల్పించుకున్నాను. ఇప్పటికి పూర్తయ్యింది. ఈ వేడుక మొదలుపెట్టినప్పుడు టెన్షన్‌గా ఉండేది. ద్వితీయ శ్రేణి వారు చేసుకునే పండగగా చాలామంది భావించేవారు. ఎన్నో అవమానాలు, అన్నీ అనుమానాలు.. అన్నింటినీ భరించాను. దృఢంగా సంకల్పించుకుంటే ఏ పని అయినా పూర్తవుతుందని నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఈ పండగలో పాల్గొనేలా చేసినందుకు ఆనందంగా, సంతృప్తిగా ఉంది. అంతేకాదు ప్రపంచదేశాలలో ఉన్న తెలుగువారూ మన సంస్కృతిని మరిచిపోకుండా ఉండేలా ఆయా దేశాలకు వెళ్లాను. వేడుకలు నిర్వహించాను. ఇన్నాళ్లూ కొనసాగించే శక్తిని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంటాను. మొదట ప్రారంభించినప్పుడు కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఈ వేడుకలో పాల్గొనేవారు. తర్వాత్తర్వాత యువతరం అంతా ఈ వేడుకను సొంతం చేసుకున్నారు. అందంగా సంప్రదాయబద్ధంగా అలంకరించుకొని, రంగు రంగుల బతుకమ్మలను తెచ్చి, చుట్టూ చేరి ఆడి పాడుతుండటం పెరిగింది. ఇంతమంది కలిసి ఆడుతూ పాడుతూ సంబురాలు చేస్తుంటే రెండు కళ్లు సరిపోవేమో అనిపిస్తుంది.
ఎన్నేళ్లుగా మీరు బతుకమ్మ పూజలు చేస్తున్నారు? నవరాత్రుల సమయంలో ఈ శక్తికి కారణాలేంటి అని ఎప్పుడైనా యోచించారా?
పెరిగింది హైదరాబాద్‌లోనే, అయినా పండగ వచ్చిందంటే చాలు నానమ్మ ఊరు వెళ్లేవాళ్లం. నా చిన్నప్పటి నుంచి బతుకమ్మల సందడి ఉంది. బతుకమ్మలను కొలవడం వల్ల ఒక దైవిక శక్తి మనలోకి చేరుతుంది అనే భావన ఉంది. బహుశా ఇది అందరితో కలిసి పాల్గొనే వేడుక వల్ల కలిగి ఉంటుంది. బతుకమ్మ నాకు ఒక క్రమశిక్షణను నేర్పింది. బతుకమ్మ తొమ్మిదిరోజులు పండ్లు తప్ప వేరే ఆహారం తీసుకోను. అయినా, ఈ తొమ్మిది రోజులు ఉత్సవాల్లో పాల్గొనడానికి కావల్సినంత శక్తి వస్తుంది. ఇది ఒక సంకల్పంగా నాకు నేనే చెప్పుకున్నాను. జీవితాంతం ఈ నియమాన్ని కొసాగిస్తాను.
దేవీనవరాత్రులలో అమ్మవారిని ఎలాగైతే కొలుస్తామో, బతుకమ్మ రూపంలో శక్తిని పాటలతో పూజిస్తాం. రంగు రంగు పూలు. అవి కూడా అడవిల పూసే పూలను గుట్టగా పోసి వాటిని అమ్మగా భావిస్తాం. మన మధ్య జరిగే చిన్న చిన్న జగడాలు, ఆనందాలు, బాధలు, శ్రమను మర్చిపోవడానికి తీసే రాగాలు.. ఉయ్యాల పాటలు అయ్యాయి. గంగ గౌరి సంవాదం పాటనే తీసుకుంటే... ‘గంగ, గౌరి గవ్వలు ఆడంగ.. గవ్వలు ఆడంగ కయ్యమయ్యిండ్రి..’ అని ఉంటుంది. పార్వతీ దేవి శివయ్య పూజకు వేళయ్యింది నీళ్లు ఇవ్వమని గంగను బతిమాలుకుంటుంది. గంగేమో శివయ్యను ఇస్తే నీళ్లు ఇస్తానంటుంది గంగ. అలా తనలో సగమైన శివయ్యను ఇస్తే పార్వతికి నీళ్లు ఇచ్చింది గంగ. ఇలాగే అత్తాకోడళ్లు, తోడికోడళ్లు, అక్కచెల్లెళ్లు.. సామాజికంగా జరిగే సంఘటనలను దేవుళ్లకు ఆపాదించి పాటలుగా చెబుతుంటారు. దేవుళ్లు అంటే ఎక్కడో లేరు. మనలోనే ఉన్నారు. మన పాటల్లో ఉన్నారు. మన బతుకులో ఉన్నారు. మన శ్రమలో ఉన్నారు. తెలంగాణ అంటేనే శ్రమ జీవనం. శ్రమలోనుంచే పాట పుట్టింది. అదే బతుకమ్మ పాట అయ్యింది.
మీరు ఇష్ట దైవంగా ఎవరిని కొలుస్తారు?
దైవానికి సంబంధించి ఒక రూపం అంటూ ఏమీ లేదు. పిల్లలు పుట్టాక ఇలా నా ఆలోచన మారింది. దానికి ముందు అమ్మావాళ్లతో పాటు పూజల్లో పాల్గొనేదాన్ని. ఇప్పటికీ నోములు, వ్రతాలు చేస్తాను. కానీ, ఆధ్యాత్మికంగా దైవం అంటే ఏంటో తెలిసింది మా పెద్దబాబు పుట్టిన తర్వాత. వాడి పెంపకంలో చాలా భయపడిపోయేదాన్ని. పసివాడు కదా... మనం ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఏం జరుగుతుందో అనే భయం. పనిమీద బయటకు వెళ్లి వచ్చేలోపల వీడికేదైనా అయిపోతుందేమో అని భయం. అప్పడు అనుకున్నాను .. భగవంతుడా నువ్వే చూసుకోవాలి అని. భగవంతుడు ఉన్నాడు అని అప్పుడే అర్థమెంది. నా కొడుకు సురక్షితంగా ఉన్నాడంటే దేవుడి దయనే! ఒక్కడిని చూసుకోవడానికే నేనింత కష్టపడుతుంటే ఆయన ఇంతమందిని ఎలా చూసుకోవాలి? అనిపించింది. అప్పుడే ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది. మా ఇద్దరి పిల్లలచేత కూడా అలాగే ప్రార్థన చేయిస్తా. ఏదైనా సమస్య వస్తే కళ్లు మూసుకొని నీ దేవుడు ఎలా ఉండాలనుకుంటావో అలాగే ఊహించుకొని, ఏం కావాలని చెప్పమంటాను.
మీ నాన్నగారు ప్రకృతిలో ఉన్న శక్తిని బాగా నమ్ముతారు. అది యాగమైనా, వాస్తు అయినా, మరైదేనా కావచ్చు. దీనిపై మీకేమనిపిస్తుంది.
మనం ఎటువైపు వంట చేసుకోవాలి? ఏ వైపు పూజ చేయాలి? ఏ వైపు నిద్రించాలి.. ఈ విధి విధానాలనే వాస్తుగా భావిస్తున్నాం. దీని ప్రకారం ఇల్లు, కార్యాలయం వంటివి ఉంటే పాజిటివ్ ఎనర్జీ మనం ఉండే చోటుకి వచ్చేస్తుంది. అప్పుడు మరింత శక్తితో ఎక్కువ పని చేయగలం. యాగం అంటే హైందవ ధర్మంలో చెప్పిన అత్యున్నత కర్మ కాబట్టి చేశారు. ఇవన్నీ మన భూమిలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ సంగతి తెలుసుకోకుండా కొంతమంది విమర్శిస్తుంటారు.
మీకు అమెరికాలో ప్రమాదం జరిగినప్పుడు మీ నాన్న ‘దేవుడే నా బిడ్డను చూస్తాడు’ అన్నారట. మీరు అలా అనుకున్న సందర్భాలు?
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కొందరు యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సమయంలో చాలా బాధపడేవాళ్లం. ఆ సమయంలో ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని. దేవుడా వీళ్లను కాపాడు అని వేడుకునేదాన్ని!
∙కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టుకోవాలా? విజయాలు కలిగినప్పుడు తలుచుకోవాలా? మన కష్టమేంటో చెప్పుకోవడం అవసరం. అంతటితో పూర్తవుతుంది. విజయం సాధించినప్పుడు దానిని నిలబెట్టుకోవాలంటే దైవశక్తి ఇంకా అవసరం. అందుకే అప్పుడా, ఇప్పుడా అని లెక్కలేమీ లేవు. ఎప్పుడూ తలుచుకోవాలి.
∙మీరు జయశంకర్‌ని గురువుగా భావిస్తారు. ఆయనేమో దేవుణ్ణి నమ్మేవారు కాదు. దీనిని ఎలా చూస్తారు?
ఆయన పూజలు, క్రతువులు నమ్మరు. సంఘాన్ని ప్రేమించేవారిలో దైవత్వం ఉంటుంది. పక్కమనిషి ఆపదలో ఉంటే వెంటనే సహాయం చేయాలనే గుణం అలాంటి వాళ్లలోనే ఉంటుంది. జీవితంలో ఎవరిన్నీ హర్ట్ చేసి ఉండరు. అంతకుమించిన దైవత్వం ఇంకెక్కడ ఉంటుంది? ప్రజలకు అన్యాయం జరగవద్దని జీవితాంతం కష్టపడ్డారు. అంతకుమించిన దైవత్వం ఉండదు.
ప్రభుత్వం యాదగిరి గుట్టను బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతోంది. ఈ ఆలయానికి మీరు తరచూ వెళ్లేవారా? ఇంకా ఏయే ఆలయాలను సందర్శించారు? వాటిలో మీకే ఆలయం బాగా నచ్చుతుంది?
మా వారికి యాదగిరిగుట్ట నరసింహస్వామి అంటే గట్టి నమ్మకం. కొత్తగా ఏ వాహనం తీసుకున్నా గుట్టకు వెళ్లాల్సిందే! కుటుంబంతో కలిసి కూడా తరచూ వెళుతుంటాం. సెంటిమెంట్ కాదు కానీ, అదొక అలవాటుగా మారిపోయింది. ఈ మధ్య నా చిన్న కొడుకు పుట్టినరోజు అయితే పెద్దమ్మగుడికి వెళ్లాం. మొన్న అస్సామ్‌లోని కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లాం. చాలా శక్తివంతమైన ఆలయం. అద్భుతంగా ఉంటుంది. అంతకుముందు మానసాదేవి ఆలయానికి అమ్మావాళ్లతో కలిసి వెళ్లాను. ఈ గుడి ఉన్న ప్రాంతం... ఆ వాతావరణం సూపర్బ్‌గా ఉంటుంది.
ఆలయాలకే కాకుండా మసీదు, చర్చిలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయా?
నేను చదువుకున్నది స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్. ఆ విధంగా ఏసు పాటలు పాడుతుండేదాన్ని. చర్చికి వెళుతుండేదాన్ని. మా అత్తగారి ఇంట్లో మొదటి సంతానానికి దర్గాలో పుట్టెంట్రుకలు తీయాలనే మొక్కు ఉంది. ఆ విధంగా నా పెద్ద కొడుకు పుట్టు వెంట్రుకలు మా ఊరికి దగ్గరలోని పొటంగల్ దర్గాలోనే తీసాం.
రాబోయే తరం దైవత్వాన్ని ఎలా అర్ధం చేసుకుంటుంది అని మీ భావన..?
పూజాదికాల వంటి క్రియలు నలుగురితో కలిపి చేసుకోవాలనుకున్నా వ్యక్తిగతంగా దైవం అంటే ఏంటో తెలుసుకుంటారు. దైవశక్తిని అర్థం చేసుకునే విధానంలో మంచి మార్పులు వస్తాయనిపిస్తుంది.
దేవీ నవరాత్రులలో ఒకరోజు అన్నపూర్ణ, ఒక రోజు శాకంబరి, ఇంకోరోజు సరస్వతి.. ఇలా అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కోఅవతారంగా పూజిస్తాం. ఇవన్నీ మనలో ఉండేవే. అన్నపూర్ణను ఎందుకు పూజిస్తాం... అన్నం సమృద్ధిగా లభించాలని, లక్ష్మీదేవిని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, సంతోషంగా చూడాలని..! వైదికంగా పూజించే అమ్మవారైనా, జానపదులు పూజించే బతుకమ్మయినా అభద్రతను భద్రతగా మార్చుకునే దిశగా పయనించేందుకు ఎంచుకుంటాం. ప్రాచీన ఆరాధన పద్ధతులను పరిశీలిస్తే మనకీ విషయం స్పష్టమౌతుంది. దైవం, శక్తి ఆరాధనల గురించి చెప్పుకోవాలంటే ఆఫ్రికన్ దేశాల ఆరాధన పద్ధతులే మొదట ఉన్నాయి. వాళ్లు శక్తిని మధ్యలో పెట్టి చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ కొలిచేవారట. అంతెందుకు... మానవుడు మొదటిసారి నిప్పుని తెలుసుకున్నప్పుడు మధ్యలో అగ్నిని రగిల్చి, చుట్టూ చేరి వారి వారి పద్ధతుల్లో పూజించేవారు. బతుకమ్మ కూడా అలాగే! పూలతో శక్తిని ఆరాధిస్తున్నాం.
దేవుళ్లు ఎక్కడో లేరు. మనలోనే ఉన్నారు. మన పాటల్లో ఉన్నారు. మన బతుకులో ఉన్నారు. మన శ్రమలో ఉన్నారు. తెలంగాణ అంటేనే శ్రమ జీవనం. శ్రమలోనుంచే పాట పుట్టింది. అదే బతుకమ్మ పాట . ఆధ్యాత్మికంగా దైవం అంటే ఏంటో తెలిసింది మా పెద్దబాబు పుట్టిన తర్వాత. వాడి పెంపకంలో చాలా భయపడిపోయేదాన్ని. ఒక్కడిని చూసుకోవడానికే నేనింత కష్టపడుతుంటే ఆ దేవుడు ఇంతమందిని ఎలా చూసుకోవాలి? అనిపించింది. అప్పుడే దేవుడితో నాకు ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి