అమ్మకు అర్జంట్‌గా కోడలు కావాలట - శర్వానంద్ | special chit chat with Sharwanand, | Sakshi
Sakshi News home page

అమ్మకు అర్జంట్‌గా కోడలు కావాలట - శర్వానంద్

Published Sat, May 9 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

అమ్మ వసుంధరాదేవితో అమ్మకూచి శర్వానంద్  ‘మదర్స్‌డే’కి ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఫొటో

అమ్మ వసుంధరాదేవితో అమ్మకూచి శర్వానంద్ ‘మదర్స్‌డే’కి ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఫొటో

‘ఈ మధ్య అమ్మ, నన్ను పోరడం మొదలుపెట్టింది. అదేంటో మీకూ అర్థమైపోయుంటుంది. మ్యారేజ్... అమ్మకు అర్జంట్‌గా కోడలు కావాలట. చంపుతోంది. నేను చాలా తెలివిగా తప్పించుకుంటున్నా. చూద్దాం... అమ్మకు చిక్కకుండా ఎన్నాళ్లుంటానో! ’     

 - శర్వానంద్

 
కింద పడే బెంగ లేదు... పెకైదగననే భయం లేదు.
రేపటి ఆలోచన లేదు... ఇవాళ్టికో స్ట్రాటజీ లేదు.
హీరోగా పుట్టలేదు... యాక్టర్‌గా ఎదిగాడు.
స్టార్ అయినా... రోడ్డు మీద చాట్ మానలేదు.
బాల్యాన్ని మర్చిపోలేదు... స్నేహితుల్ని వదులుకోలేదు.
షూటింగ్‌లో ఉంటే హ్యాపీ...
లైఫ్‌లో ఉంటే హ్యాపీ గో లక్కీ.
 
ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఎవరో స్వామీజీ ఈ పేరు సూచించారట.
అమ్మ పేరు వసుంధరాదేవి. నాన్న పేరు ఎమ్.ఆర్.వి. ప్రసాదరావు. నాన్న బిజినెస్‌మేన్.
నా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే - ‘జెన్యూన్’ అని చెబుతాను.
నాలో మైనస్ పాయింట్ ఏమంటే - ఎవరినైనా ఇట్టే నమ్మేస్తా.
‘రన్ రాజా రన్’ టైమ్‌లో ప్రభాస్ అన్న చెప్పడంతో నా లుక్ మార్చా.
చిరంజీవిగారు, దీపికా పదుకొనే అంటే చాలా ఇష్టం. నిత్యామీనన్ అంటే ఇష్టం... మంచి ఆర్టిస్ట్.
రాజమౌళి... మన తెలుగువాడైనందుకు మనమంతా గర్వపడాలి.
ఖాళీ సమయాల్లో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ పాటలు వింటుంటాను.
ఈమధ్య ఫిలసాఫికల్ బుక్స్ చదువుతున్నా.
‘రన్ రాజా రన్’ డెరైక్టర్ సుజిత్ చెప్పడంతో ఫేస్‌బుక్ ఓపెన్ చేశా. ట్విట్టర్లో లేను.
అమ్మాయిలకు సైట్ కొట్టడం లాంటివన్నీ కామన్. అటెండెన్స్ షార్టేజ్ వస్తే, ఇంట్లో వాళ్లను తీసుకురమ్మని కాలేజ్‌లో చెబితే మా ఫ్రెండ్సే ఆదుకునేవారు.
సినిమా ఫంక్షన్లూ, పార్టీల్లో ఎక్కువ కనబడను. నేను పెద్దగా బయటకు రాను.
నా మీద గాసిప్స్ రావంటే? ఎందుకొస్తాయి. ఉంటేనే కదా వచ్చేది.
షూటింగ్స్ లేకపోతే చాలా ఆలస్యంగా నిద్రలేస్తా. అర్ధరాత్రి వరకూ మేలుకునే ఉంటా. రోజూ 2, 3 సినిమాలు చూడనిదే నిద్రపట్టదు.
నా కెరీర్‌లో రాంగ్ స్టెప్ అంటే - ‘కో అంటే కోటి’ సినిమా తీయడం.
ఆ టైమ్‌కి అది కరెక్ట్ డెసిషన్ కాదు. కానీ ఓ రకంగా అది నాకు మంచే చేసింది. చాలా అనుభవాన్నిచ్చింది. భవిష్యత్తులో ప్రొడక్షన్ చేస్తా. కానీ అందులో నేను యాక్ట్ చేయను.
డెరైక్షన్ చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. ఎడిటింగ్‌లాంటివి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంటుంది.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ మేర్లపాక గాంధీ డెరైక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఇంకో కొత్త దర్శకుడి కథ ఓకే అయింది.
 
వీధి

నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. వెంగళరావునగర్ కాలనీలో ఇప్పటికీ నన్ను వాళ్లింట్లో అబ్బాయిలా చూసుకుంటారు. అక్కడి వీధుల్లో క్రికెట్ ఆడిన రోజులు ఇంకా గుర్తున్నాయి. మా కాలనీ ఫ్రెండ్స్‌తో బస్సు మిస్సయితే షేర్ ఆటో ఎక్కడం, అమీర్‌పేట సెంటర్‌లో చాట్ తినడం... నాన్న బిజినెస్‌మేన్ అయినా మమ్మల్ని నార్మల్‌గానే పెంచారు.
 
క్లాస్‌మేట్స్

రామ్‌చరణ్, రానా, ‘యూవీ క్రియేషన్స్’ విక్కీ నా క్లాస్‌మేట్స్! మేమంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాచ్. హాలీడే వస్తే చాలు చరణ్, నేను జూబ్లీహిల్స్ క్లబ్‌కి వెళ్లి బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. చాలా టోర్నమెంట్స్‌లో ఆడాం. సిక్త్స్ క్లాస్ నుంచి నాకు రానా తెలుసు. ఇద్దరం ఒకే ట్యూషన్‌కెళ్లేవాళ్లం. నేను మారినన్ని స్కూల్స్ ఇంకెవరూ మారి ఉండరేమో. బాగా చదవకపోవడం వల్ల వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఏ సినిమా రిలీజైనా ఫస్ట్‌డే... మార్నింగ్ షో చూసి తీరాల్సిందే. సికింద్రాబాద్ సంగీత్, బేగంపేట ఆనంద్ థియేటర్లు మా అడ్డాలు. చాంతాడంత క్యూలో ఎండలో నిలబడి టికెట్లు సంపాదించడం థ్రిల్. ఆ లైఫే వేరులెండి.
 
గమ్యం


ఆ రోజు నాకింకా బాగా గుర్తు. ‘చిత్రం’ సినిమా రిలీజైంది. అబ్బా ఏం జనం... ఓ కొత్త కుర్రాడి సినిమాకి ఇంత జనమా? నేను కూడా ఇలా హీరో అయితే ఎంత బాగుంటుంది అనిపించింది లేదా ప్రకాశ్‌రాజ్‌లాగా మంచి పేరున్న నటుడు అనిపించుకుంటే చాలనుకున్నా. నాన్న సపోర్ట్ లేకుండా ‘స్వయంకృషి’లో చిరంజీవిలాగా చిన్న స్థాయి నుంచి ఎదగాలనుకున్నా.
 
అమ్మా చెప్పంది


‘అమ్మా... నేను సినిమా యాక్టర్‌నవుతా’ అని చెప్పగానే ‘నీకంత సీన్ లేదురా’ అనేసింది. ‘అదేంటమ్మా అలా అనేశావ్?’ అనడిగాను. ‘చిన్నీ... నువ్వు చాలా చిన్నవాడివి... ఈలోకం పోకడ తెలీనివాడివి, ఇండస్ట్రీ అంటే అదో మహాసముద్రం. నీకు సెట్ కాదురా’ అని చెప్పింది. నేను వింటే కదా. నా పంతం నాదే. ఇప్పుడు బాల్ నాన్న కోర్టులోకి వెళ్లింది. నాన్న చాలా క్యాజువల్‌గా ‘నీకేది ఇంట్రస్ట్ ఉంటే అది చెయ్. ముందు నా చేతిలో నీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టు. ఆ తర్వాతే ఏదైనా’ అనేశారు.

ఐదోతారిఖు

అదే నా ఫస్టు సినిమా. అమ్మ చూసింది. నేను బాగా చేయలేదని డెరైక్ట్‌గా చెబితే ఫీలవుతాననుకుంది - ‘బావుందిరా... ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి’ అని మెచ్చుకుంది. ఈసారి ఇలాంటి ఛాన్సు ఇవ్వకూడదు. బాగా కాన్‌సన్‌ట్రేట్ చేశా. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ చూసి అమ్మ ఆనందపడింది. కానీ శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్, ‘అమ్మ చెప్పింది’, ‘వెన్నెల’ చూసి తెగ ఇదై పోయింది. ‘వద్దురా చిన్నీ... నిన్నిలాంటి శాడ్ కేరెక్టర్స్‌లో చూడలేకపోతున్నా’ అనేసింది. ‘రన్ రాజా రన్’ చూసి మాత్రం అమ్మ ఫుల్ ఖుష్.
 
ప్రస్తానం

2003లో ‘5వ తారీఖు’ సినిమాతో నా కెరీర్ స్టార్ట్. ఈ పన్నెండేళ్లలో 23 సినిమాలు చేశా. అందులో 3 తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా ప్రోగ్రెస్ కార్డ్ చూసుకుంటే ఐ యామ్ సో హ్యాపీ. ఎవరికైనా ఇంతకన్నా ఏం కావాలి? ఎక్కడో మొదలై ఇక్కడకొచ్చాను కదా!
 

యువసేన

నేనెప్పుడైనా పార్టీ ఇవ్వాలనుకుంటే నా పని అంతే. ఎందుకంటే అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. స్కూల్స్ ఎక్కువ మారడం వల్ల ప్రతి స్కూల్లోనూ ఓ గ్యాంగ్ ఏర్పడ్డారు. ఇక కాలేజీ గ్యాంగ్ ఎలానూ ఉంది. వాళ్లందరితోనూ ఇప్పటికీ నేను టచ్‌లో ఉన్నా. మేమంతా కలిస్తే సందడే సందడి.
 
అందరి బంధువయ

మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అమ్మతరపు, నాన్న తరపు చాలామంది బంధువులున్నారు. అవనిగడ్డ, బందరు, విజయవాడ, హైదరాబాద్‌ల్లో బోల్డంతమంది రిలేటివ్స్ ఉన్నారు. నేను అన్ని ఫంక్షన్లకూ వెళ్తుంటాను. హీరో రామ్ సిస్టర్‌ని మా అన్నయ్యే పెళ్లి చేసుకున్నాడు.
 
‘రన్ రాజా రన్'

ఏమాత్రం ఖాళీ దొరికినా నేను యూఎస్ వెళ్లిపోతా. మా అక్క అక్కడే ఉంటుంది. అక్క మీద ప్రేమ కన్నా, సరదాగా ఎంజాయ్ చేయొచ్చనే కారణమే ఎక్కువ. యూఎస్, యూకె ట్రిప్ పూర్తి చేసుకుని లాస్ట్ వీక్ హైదరాబాద్ వచ్చాను. ఒక్కోసారి ఏడాదికి 3, 4 సార్లు యూఎస్ వెళ్లిన సందర్భాలున్నాయి. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తుంటా. మన కంట్రీలో చాలా ఏరియాలు తిరిగేశా. ఢిల్లీ నుంచి లే లడాఖ్ వరకూ వెళ్లా. చైనా బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్‌క్కూడా వెళ్లా. ఎక్కడకెళ్లినా ఆ ఏరియా ఫుడ్ తినేస్తా. నో రిస్ట్రిక్షన్స్.
 
 
జర్నీ

నాకు తెలిసి ఈ జనరేషన్ హీరోల్లో ఎవ్వరికీ నాలాంటి జర్నీ లేదు. ఎందుకంటే - అందరూ డెరైక్ట్‌గా హీరోలైపోయారు. నేను మాత్రం ఫ్రెండ్ వేషాలు, తమ్ముడి వేషాలు, నెగటివ్ వేషాలు వేసుకుంటూ ఈ స్థాయికొచ్చాను. నా ఇమేజ్ ఏంటో, నా మార్కెట్ రేంజ్ ఏంటో నాకు బాగా తెలుసు. దానికి తగ్గట్టుగానే నా కథల ఎంపిక ఉంటుంది. ఇకపై నేను చేసే సినిమాల బడ్జెట్‌లన్నీ కంట్రోల్‌లోనే ఉంటాయి. ఉండాలి కూడా. అనవసరపు ఖర్చులు, హంగామాలూ వద్దని నిర్మాతకు ముందే చెప్పేస్తున్నా. అలాగే 50 రోజుల్లోపు సినిమా పూర్తి చేసేయాలని కూడా చెప్పేస్తున్నా. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి బాగా లేదు. అందరూ ముందే జాగ్రత్త పడాలి. హీరోలు ఒక్కరే హ్యాపీ అని కాకుండా, అందరూ హ్యాపీగా ఉండేలా సినిమాలు తీస్తే బావుంటుంది.
 - పులగం చిన్నారాయణ
 
మళ్లీ  మళ్లీ ఇది రాని రోజు

నిజమే... ఆ రోజు మళ్లీ రాదు. నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ‘థమ్సప్’ యాడ్‌లో వీణ స్టెప్ వేయడం. ఆ రోజు నా పరిస్థితి చూడాలి. అంత థ్రిల్... ఆ ఎగ్జైట్ మెంట్ ఎన్ని కోట్లిచ్చినా రావంటే నమ్మండి. ‘ఇంద్ర’ కోసం వీణ స్టెప్ పాట షూట్ చేస్తున్నపుడే నేను, చరణ్ లొకేషన్‌కెళ్లాం. చిరంజీవిగారు మెస్మరైజింగ్‌గా స్టెప్స్ వేస్తుంటే, నేనలా కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయా. అదే స్టెప్‌ని ఆయనతో కలిసి వేస్తానని కలలో కూడా ఊహించలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement