ముఖాన్నే తలుపులు వేయిస్తున్న ప్రశ్న. ప్యాడ్‌ను లాక్కునేలా చేస్తున్న ప్రశ్న. పేపర్‌ను చింపేయిస్తున్న ప్రశ్న. అన్ని ప్రశ్నలకూ సమాధానం.. మళ్లీ అదే ప్రశ్న! ‘ఎవరండీ ఇంట్లో..?’ విమలమ్మ కరోనా సర్వే వర్కర్. విరిగిన కాలితోనే డ్యూటీ చేస్తోంది. కోపాలను తగ్గించి వివరాలను కనుక్కోలేదా?
విమల కుమారి అంగన్‌వాడి వర్కర్. ఇంటింటికి వెళ్లి కరోనాను పోలిన వ్యాధి లక్షణాలు ఉన్న వారి లెక్కలు సేకరించమని బిహార్ ప్రభుత్వం నియమించిన ఆశా, అంగన్‌వాడి వర్కర్‌లలో ఆమె ఒకరు. ఏప్రిల్ 16 నుంచి మే 3 వరకు ఆమె 380 ఇళ్లను సర్వే చేశారు. పాట్నాలోని బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పాట్నా విద్యుత్ సరఫరా కార్యాలయాలకు ఆనుకుని ఉండే మురికివాడల్లోని ఇళ్లు అవన్నీ. చేతిలో ప్యాడు, పెన్నుతోపాటు ఒక చేతికర్ర సహాయంతో ఆమె ఆ ఇళ్లన్నీ తిరిగి వివరాలు రాసుకున్నారు. సర్వేకోసం వెళ్లినప్పుడే రోడ్డుమీద నీళ్ల గుంటలో పడి ఆమె కాలు విరిగింది. నడవలేక చేతి కర్రను తెచ్చుకుంటున్నారు. నడవలేక సెలవు పెట్టవచ్చు. అందుకు ఆమె ఇష్టపడలేదు.
శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి రేణుకుమారి సెలవు మంజూరు చేశారు. విమల వినలేదు. పాట్నా జిల్లా ఐసిడిఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవలు) అధికారి భారతి ప్రియంవద కూడా పిలిపించి చెప్పారు. సెలవు అవసరం లేదనే అన్నారు విమల! పాట్నా జిల్లా జడ్డి కుమార్ రవి సోమవారం తన ట్విట్టర్‌లో విమల ఫొటోను షేర్ చేశారు. ‘ఈ మహిళ గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. ఈమె పేరు విమల కుమారి. అంగన్‌వాడి కార్యకర్త. కాలు విరిగినప్పటికీ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పాట్నా పట్టణంలో తనకు కేటాయించిన ప్రాంతాల ఇళ్లను సర్వే చేస్తూనే ఉన్నారని నాకు ఐసిడిఎస్ టీమ్‌ల ద్వారా తెలిసింది. అంకితభావం, పనిలో నిబద్ధత ఈ మహిళలో మనం చూడొచ్చు’ అని రాశారు. ఎరుపంచు తెల్లచీరలో.. తలకు హెయిర్ నెట్, ముఖానికి మాస్క్, చేతులకు గ్లవుజులు, చేతిలో సర్వే ప్రశ్నావళి కాగితాలు పట్టుకుని, కట్టుకట్టిన కాలితో.. జిల్లా జడ్జి అన్నట్లే అంకితభావానికి ఒక ఆకృతిలా ఉన్నారు ఆ ఫొటోలో విమల కుమారి.
విమల వయసు 46 ఏళ్లు. ముగ్గురు పిల్లలు. 23 ఏళ్ల కూతురు, ఇద్దరు కొడుకులు. 22 ఏళ్లు, 18 ఏళ్లు. పిల్లలంతా చదువుల్లో ఉన్నారు. ఈ కుటుంబం ఉంటున్నది కూడా మురికివాడలోనే. పాట్నా పట్టణంలోని లలిత్ భవన్ సమీపంలో. ఒక గది ఉన్న చెక్కల ఇల్లు. భర్త పదిహేనేళ్ల క్రితమే చనిపోయాడు. అంగన్‌వాడి వర్కర్‌గా ఇప్పుడు ఆమె జీతం రూ.5,650. ఆమె పని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి అందేలా చూడటం. ప్రస్తుతం సర్వే డ్యూటీలో ఉన్నారు. మార్చి నెలాఖరులో విమల కాలు విరిగింది.
అప్పటికి ఆమె తొలి విడత సర్వే పనుల్లో ఉన్నారు. ఎవరింట్లోనైనా శ్వాసకోశ ఇబ్బందులు, ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యాలు ఉన్నాయేమో తెలుసుకుని ఆ వివరాలు నోట్ చేసుకుని వెంటనే ఆరోగ్య అధికారులకు చేరవేయడం ఆమె బాధ్యత. ఇంట్లోంచి ఉదయాన్నే 8 గంటలకు డ్యూటీకి బయల్దేరుతారు. ఆమెకు సహాయంగా నర్సింగ్ మిడ్‌వైఫ్ ఒకరు ఉంటారు. మధ్యాహ్నానికల్లా కనీసం 25 ఇళ్లలోని వివరాలు సేకరిస్తారు. అక్కడితో ఆ రోజుకు సర్వే పని పూర్తవుతుంది. మధ్యాహ్నం నుంచి ఐసిసిఎస్ పరిధిలోని ఇతరత్రా విధులు ఉంటాయి.
సెలవే పెట్టని ఇంత మొండి మనిషిని ఎక్కడా చూడలేదని విమల గురించి భారతి ప్రియంవద అంటారు! ‘కఠిన పరిస్థితుల్లో విమల మరింత ప్రశాంతంగా నెగ్గుకొస్తుంది. సర్వేకి వచ్చిన అంగన్‌వాడి వర్కర్‌లు ముఖాల మీదే తలుపులు వేసేవారు. చేతిలోని పెన్ను, పేపర్ లాక్కొని వెళ్లగొట్టేవారు కూడా ఉంటారు. అయితే విమల అలాంటి వాళ్లను కూడా సౌమ్య పరిచి వివరాలు రాబడుతుంది’’ అని రేణుకుమారి చెబుతారు. అయితే విమల అనే మాట వేరే.
‘‘నేను సెలవు పెడితే.. ఏ ఇంట్లో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో తెలుసుకోలేను. అందువల్ల వాళ్లకు అవసరమైన తక్షణ వైద్య సహాయం అందకుండా పోతుంది’’ అంటారు. ప్రస్తుతం మూడోవిడత సర్వే పనిలో ఉన్నారు విమల. మొదట పాట్నా సహా నాలుగు జిల్లాలకు మాత్రమే సర్వేను పరిమితం చేసిన బిహార్ ప్రభుత్వం ఇప్పుడు మిగతా ముప్పై నాలుగు జిల్లాలలో కూడా సర్వేను ప్రారంభించింది. బిహార్‌లో ఇప్పటి వరకు 550 కోవిద్ కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు చనిపోయారు. విమల వంటి విధి నిర్వహణ యోధుల తోడ్పాటు ఈ కరోనా సమయంలో ప్రతి చోటా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment