‘చాలా స్ఫూర్తినిస్తున్నావు. బాగా చదువుకొని వచ్చి దేశానికి సేవ చేయి’ అని ట్వీట్ చేశారు పంజాబ్ సి.ఎం. అమరేందర్ సింగ్. ఆ ట్వీట్ ప్రతిష్ట దేవేశ్వర్ గురించి. ఆమెకు ఆక్స్‌ఫర్డ్ నివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. సెప్టెంబర్‌లో జాయిన్ అవుతోంది. దేశంలో అలాంటి యోగ్యత పొందిన తొలి ‘వీల్‌చైర్ అమ్మాయి’ ప్రతిష్ట. నిరోధాలను ఎదిరించే విజయం ఆమెది.
ప్రతిష్ట దేవేశ్వర్‌ది పంజాబ్. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఇప్పుడు లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అడ్మిషన్ పొందింది. వీల్‌చైర్ మీద ఉంటూ చదువుకుని పై చదువులకు ఆక్స్‌ఫర్డ్‌కు ఎంపికైన తొలి భారతీయురాలు ప్రతిష్ట. అందుకే ఆమె ఘనత గురించి ఆమె చదువుకున్న ఢిల్లీ, ఆమె స్వరాష్ట్రం పంజాబ్ గర్వపడుతున్నాయి. అయితే ఈ విజయం సులువుగా రాలేదు. అందుకు ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటం గురించి ఆమె మాటల్లో...
ప్రమాదం.. పక్షవాతం
అప్పుడు నాకు పదమూడేళ్ల వయస్సు. కుటుంబంతో హోషియార్పూర్ నుంచి చండీగడ్‌కు వెళుతున్నాం. సడన్‌గా కారుకు యాక్సిడెంట్ అయ్యింది. కళ్లు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. నా పరిస్థితి దారుణంగా ఉంది. ఆపరేషన్ చేస్తే శరీరంలో రక్తం కొరత ఏర్పడి ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. కానీ ఆపరేషన్ కాకుండా నా ప్రాణాన్ని కాపాడటానికి మరో మార్గం లేదు. ఆ ఆపరేషన్ నా ప్రాణాన్ని కాపాడింది, కాని వెన్నెముకకు గాయం కారణంగా పక్షవాతం వచ్చింది. దాదాపు నాలుగు నెలలు ఐసియులో ఉన్నాను. తర్వాత మూడేళ్లపాటు పూర్తిగా బెడ్‌కే పరిమితమైనా ఇంటి నుంచే స్కూల్ చదువు పూర్తి చేశాను. 10వ తరగతిలో 90 శాతం మార్కులు వచ్చాయి. 12వ తరగతిలోనూ 90 శాతం మార్కులు వచ్చాయి. నా శారీరక బలహీనతలు నా చదువుపై ప్రభావం చూపనివ్వలేదు. ఎందుకంటే చదువు మాత్రమే నన్ను విజేతగా నిలబెడుతుందని నాకు తెలుసు.
జీవితానికి కొత్త దిశ..
12వ తరగతిలో మంచి మార్కులు సాధించిన తరువాత ఇంటి నాలుగు గోడలలోనే జీవించటానికి ఇష్టపడలేదు. నన్ను ఢిల్లీ విశ్వవిద్యాలయానికి పంపమని అమ్మానాన్నలతో మాట్లాడాను. వారు సరే అనడంతో శ్రీరామ్ మహిళా కాలేజీలో ప్రవేశం పొందాను. ఈ కళాశాల నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నా కోసం మాత్రమే కాకుండా నాలాంటి ఇతర అమ్మాయిల కోసం కూడా నా గొంతు వినిపించడం నేర్చుకున్నాను. భారతదేశంలో వికలాంగులకు అనేక సంస్కరణలు ఇంకా అవసరమని నమ్ముతున్నాను. మన సమాజాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా ప్రయత్నాలు చేయాలి. అందుకు అవసరమైన పబ్లిక్ పాలసీకోర్సు కోసం చాలా యూనివర్శిటీలలో ప్రయత్నించాను. కాని ఏకంగా ఆక్స్‌ఫర్డ్ నుంచి నాకు ఆమోదం లభించింది. ఈ కోర్సు పూర్తి చేసి భారతదేశంలో నివసిస్తున్న 2 కోట్ల 68 లక్షల మంది వికలాంగుల కోసం పని చేయాలనుకుంటున్నాను. జీవితంలో విజయవంతం కాకుండా వీల్‌చైయిర్ ఆపలేదని నిరూపించాలనుకుంటున్నాను.
ఒంటరిగా పనులు..
ఢిల్లీకి వచ్చిన తరువాత వీల్‌చైర్‌లో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు లభించే ప్రదేశాలు ఉన్నాయని గమనించాను. ఎవరి సహాయం లేకుండా స్వయంగా షాపింగ్ చేయడం, బిల్లులు చెల్లించడం, ఒంటరిగా ప్రయాణించడం అలవాటు చేసుకున్నాను. దీంతో స్వయంగా జీవించగలను అనే నమ్మకం వచ్చింది. అయితే కొన్ని పనులు మాత్రం చాలా కష్టమయ్యేవి. మినీ బస్సు లేదా క్యాబ్‌లో ప్రయాణించడం నాకు అంత సులభం కాదు. అటువంటి పరిస్థితిలో చక్రాల కుర్చీలో చాలా కిలోమీటర్లు ప్రయాణించడం ప్రారంభించాను. చక్రాల కుర్చీ నుండి ఢిల్లీలోని పర్యాటక స్థలాలను చూడటానికి కూడా వెళుతుండేదాన్ని. ఈ కరోనా యుగంలో కూడా చక్రాల కుర్చీ ద్వారా నా పోరాటాన్ని కొనసాగించాను.
కలలు నెరవేర్చుకోవాలని కలలు...
ఒక అమ్మాయి చక్రాల కుర్చీకే పరిమితం అయినప్పటికీ ఆమె కలలన్నీ నెరవేర్చుకోగల ధైర్యం ఉందని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. నా శారీరక లోపం కారణంగా నా తల్లిదండ్రులు, అన్న నన్ను జీవితంలో ఒక చోటే ఉండమని ఎప్పుడూ అనలేదు. మా అన్న ఎప్పుడూ నేను ముందుకు వెళ్లే మార్గాన్నే చూపించాడు. శారీరకంగా అన్ని విధాలుగా బాగున్నవారితో సవాలు చేసిన అమ్మాయిగా చెబుతున్నాను. కలలు కనండి, ఆ కలలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేయండి. ఒక రోజు మీ కలలు తప్పక నెరవేరుతాయి’ అని ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలుచుకున్న ప్రతిష్ట చెబుతుంది.
Comments
Please login to add a commentAdd a comment