ఆమెకు కరోనా లేదు | Special Story About Geeta Devi From Jharkhand | Sakshi
Sakshi News home page

ఆమెకు కరోనా లేదు

Published Sat, Apr 25 2020 2:08 AM | Last Updated on Sat, Apr 25 2020 3:54 AM

Special Story About Geeta Devi From Jharkhand - Sakshi

జిల్లా ఎస్పీ విచారణ చేయించాడు. ఆమెకు కరోనా లేదన్నాడు. డిప్యూటీ కమిషనర్‌ చూసొచ్చాడు. ఆమెకు కరోనా లేదన్నాడు. బీడీవో ఆరా తీయించాడు. ఆమెకు కరోనా లేదన్నాడు. స్టేషన్‌ ఇన్‌చార్జి మళ్లీ మళ్లీ వెళ్లొచ్చాడు. ఆమెకు కరోనా లేదన్నాడు. రిపోర్ట్స్‌లోనూ.. ఆమెకు.. నో కరోనా. అయినా ఆ ఊరు వినడం లేదు. ‘దీదీ కిచెన్‌’ వంట మనిషిని.. ఊరొదిలి వెళ్లిపొమ్మంటోంది!!

‘మనుషులు దూరంగా ఉండండి. మనసుల్ని దూరం కానీయకండి’.. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ గురువారం చేసిన ట్వీట్‌ ఇది. రామ్‌గర్‌ జిల్లా గోలా బ్లాక్‌లోని మురుది గ్రామంలో ఒక కుటుంబం వెలివేతకు గురైందని ఆయన దృష్టికి రావడమే.. ఈ ట్వీట్‌కి కారణం. మురుది గ్రామంలో.. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక కుటుంబాన్ని ఊరు ఊరంతా వెలి వేసింది. బావుల్లో నీళ్లు పట్టుకోనీయడం లేదు. బోరింగులు, కొళాయిల దగ్గరికి రానివ్వడం లేదు. కిరాణా దుకాణాలు దూరాన్నుంచే వీళ్లను చూసి షట్టర్‌లు మూసుకుంటున్నాయి. విషయం సీఎం వరకు వెళ్లింది. ఇద్దరు చిన్నారులు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్న వీడియోను ఆయన చూశారు.

ఆ చిన్నారులిద్దరూ గీతాదేవి కూతురు, కొడుకు! గీతాదేవి.. ‘దీదీ కిచెన్‌’ వర్కర్‌. లాక్‌డౌన్‌లో పనులు కోల్పోయినవారికి, పస్తులుంటున్నవారికి జార్ఖండ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్‌లు అన్నింట్లోనూ ఇటీవలే ‘దీదీ కిచెన్‌’లను ఏర్పాటు చేసింది. గోలా పోలీస్‌స్టేషన్‌ కిచెన్‌లో వంటమనిషిగా పని దొరికింది గీతాదేవికి. గీత భర్త ఈశ్వర్‌ కుమార్‌ మహతో ఇంట్లోనే ఉంటున్నాడు. రోజువారీ కూలీ అతడు. గీతాదేవి ఏప్రిల్‌ 18 శనివారం పనిలోకి దిగబోతుంటే అనుమానంగా చూశారు దీదీ కిచెన్‌లోని వాళ్లు. ‘‘నువ్వు రానక్కర్లేదు వెళ్లు’’ అన్నారు. ‘‘మీ మరిది చత్తీస్‌గఢ్‌ నుంచి మీ ఇంటికి వచ్చి వెళ్లాడట కదా. అతడికి పాజిటివ్‌ అని చెప్పుకుంటున్నారు. ఎందుకైనా మంచిది నిన్ను రానివ్వొద్దని అనుకుంటున్నారు’’ అని.. వాళ్లలో ఒకావిడ ముక్కుకు చెంగు అడ్డుపెట్టుకుని వచ్చి గీతాదేవికి చెప్పింది.

గీతాదేవి నిర్ఘాంతపోయింది. ‘‘మా ఇంటికి ఎవరూ రాలేదు. ఒట్టు పెట్టి చెబుతున్నా. నమ్మండి. నన్ను పనిలోకి రానివ్వండి’’ అని బతిమాలింది. రానివ్వలేదు. మర్నాడు గీతాదేవి నీళ్ల కోసం మోటారు బావి దగ్గరకు వెళ్లింది. వాళ్లూ రానివ్వలేదు. ఖాళీ బిందెలతో ఇంటికి వెళ్లిపోయింది. చుక్క నీరు లేదు. మెతుకు ఉడికే దారి లేదు. పిల్లలు ఆకలికి ఏడుస్తున్నా ఏం చేయలేకపోయింది. కిరాణా వాళ్లు, కూరగాయల వాళ్లు, తెలిసినవాళ్లు ఎవరూ గీతాదేవిని చేరనివ్వడం లేదు. ఊళ్లోని చాలా కుటుంబాలకు ఈ లాక్‌డౌన్‌లో రేషన్‌ అందకపోతే గీతాదేవే చేదోడుగా ఉండి అందరికీ అన్నీ అందేలా చేసింది. ఆ సంగతి కూడా మర్చిపోయినట్లున్నారు.

తనకు కరోనా లేదని ఎంత చెప్పినా ఊరు నమ్మక పోవడంతో గోలా వెళ్లి పరీక్ష చేయించుకుని వచ్చింది గీతాదేవి. రిపోర్ట్స్‌లో నెగటివ్‌. అయినప్పటికీ ముందు జాత్త్రగా పద్నాలుగు రోజులు ఇంట్లోనే ఉండమని చెప్పారు వైద్య అధికారులు. అది ఊళ్లో వాళ్లకు తెలిసింది. ఇంట్లో ఉండటం కాదు, ఊళ్లోనే లేకుండా వెళ్లిపొమ్మని గీతాదేవి కుటుంబంపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. గ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్లింగ్‌కి వెళితే.. ‘నువ్వింకా ఊళ్లోనే ఉన్నావా!’ అని అన్నారు కానీ, ఫిల్లింగ్‌ చేయలేదు. ఏడుపు ఆపుకుంది గీతాదేవి. గోలా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లింది. అక్కడిక ఏడుపు ఆపుకోలేకపోయింది. ఊళ్లోవాళ్లంతా తమ కుటుంబాన్ని వెలి వేసిన విషయం చెప్పింది.

మర్నాడు సాయంత్రం గోలా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి ధనుంజయ్‌ కుమార్, కొంతమంది పోలీసులు ఊళ్లోకి వచ్చారు. గ్రామపెద్దల్ని పిలిపించి గీతాదేవికి కరోనా లేదని చెప్పారు. వదంతుల్ని నమ్మి ఆ కుటుంబాన్ని వేధిస్తే చర్య తీసుకుంటాం అని హెచ్చరించారు. గీతాదేవి నీళ్లు పట్టుకునేంత వరకు అక్కడే ఉండి వెళ్లారు. బిందెలన్నీ నింపుకుంది గీతాదేవి. అయితే అవి రెండు రోజులకే. గురువారం (ఏప్రిల్‌ 23) గ్రామస్థులు ఆమె ఇంటిని కట్టడి చేశారు. బయటికి రానివ్వలేదు. వస్తే చంపేస్తామని కూడా బెదిరించారు. పోలీసులు వచ్చి వెళ్లాక కూడా ఊరు మారలేదు. గీతాదేవి పిల్లలు ఏడుస్తుంటే ఎవరో సెల్‌ఫోన్‌లో తీసి నెట్‌లో పెట్టారు. అది సీఎం వరకు వెళ్లింది.

వదంతుల్ని నమ్మి ఒక కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ వెంటనే స్పందించారు. రామ్‌గర్‌ డిప్యూటీ కమిషనర్‌ సందీప్‌సింగ్‌ని విచారణకు ఆదేశించారు. ‘‘వదంతుల్ని పట్టించుకోకండి. అందరం కలిసి కట్టుగా ఉంటేనే కరోనాపై గానీ, వదంతులపై గానీ పోరాడగలం. మనుషులుగా మాత్రమే దూరంగా ఉండండి. మనసుల్లో దూరాలు పెరగనీయకండి’’ అని ట్వీట్‌ చేశారు. కమిషనర్‌ విచారణలో కూడా గీతాదేవికి కరోనా లేదని నిర్థారణ అయింది. ఎస్పీ ప్రభాత్‌ కుమార్, బీడీవో కుల్‌దీప్‌ కుమార్‌ విచారణలోనూ అదే తేలింది. అయినా గ్రామస్థులు నమ్మడంలేదు. తనకు కరోనా లేదని రుజువు చేయడానికి గీతాదేవి టెస్టులు చేయించుకుంటే.. కరోనా లేకపోతే ఎందుకు టెస్టులు చేయించుకుంటుంది అని గ్రామస్తులు ఇప్పటికీ ఆమెను అనుమానిస్తూనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement