సరస సంగీతమయ కథానాయకుడు | Special Story About Rishi Kapoor In Family | Sakshi
Sakshi News home page

సరస సంగీతమయ కథానాయకుడు

Published Fri, May 1 2020 4:29 AM | Last Updated on Fri, May 1 2020 7:56 AM

Special Story About Rishi Kapoor In Family - Sakshi

అతడి చూపులు ఆడపిల్లల హృదయాలను కలవరపరిచాయి. చేతివేళ్లు గిటార్‌ తీగలను మూర్ఛనలు పోయేలా చేశాయి. తన ఆటా మాటా పాటలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులకు ప్రియతముడయ్యాడతడు. ‘చింటూ బాబా’ అని ఇండస్ట్రీ ముద్దుగా పిలుచుకున్న రిషి కపూర్‌ దాదాపు 50 ఏళ్ల పాటు సినిమాను తన జీవితంగా జీవితాన్ని సినిమాగా మార్చుకున్నాడు. తండ్రి రాజ్‌కపూర్‌ చెప్పినట్టుగా ‘షో మస్ట్‌ గో ఆన్‌’ అంటూ టార్చ్‌ తర్వాతి తరాలకు అందించి వీడ్కోలు తీసుకున్నాడు.

ఖదీర్‌
ప్యార్‌ హువా ఇక్‌రార్‌ హువా హై ప్యార్‌ సే ఫిర్‌ క్యూ డర్‌ తా హై దిల్‌....
వాన పడుతోంది. ఉరుములు ఉరుముతున్నాయి. మెరుపులు రాజ్‌కపూర్, నర్గీస్‌లు పట్టుకున్న గొడుగును తటిల్లున మెరిపిస్తున్నాయి. ‘శ్రీ 420’ పాట చిత్రీకరణ. కథానుసారం అప్పుడే ప్రేమలో పడ్డారు వాళ్లు. ‘మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు... మన గుర్తులు మాత్రం నిలిచి ఉంటాయి’ అని చూపుడు వేలు చూపిస్తుంది నర్గీస్‌. ఆ క్షణాన ముగ్గురు పిల్లలు రైన్‌ కోట్లు వేసుకొని నడుచుకుంటూ వెళుతుంటారు.

ఎనిమిదేళ్ల కుర్రాడు, ఆరేళ్ల అమ్మాయి, మరో రెండేళ్ల బుజ్జి పాపడు. ‘టేక్‌’ అనేంత వరకూ ఆ పాపడు గమ్మునుంటున్నాడు. ‘టేక్‌’ అనగానే పైపుల నుంచి వాన దుమికే సరికి భయపడి ఏడుస్తున్నాడు. ‘నువ్వు ఈసారి ఏడవకుండా నడిస్తే నీకు చాక్లెట్‌ ఇస్తాను’ అని నర్గీస్‌ అంది. చాక్లెట్‌ వచ్చేటట్టయితే వానలో ఏంటి... తుఫాన్‌లో కూడా నడవడానికి రెడీ. ఈసారి టేక్‌లో నడిచేశాడు. సినిమా, ఆ పాట సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యాయి. రిషి కపూర్‌ తొలిసారి అలా వెండితెర మీద తడి పాదముద్రలు వేశాడు.

జీనా యహా మర్‌నా యహా ఇస్‌కే సివా జానా కహా...
దాదాపు నాలుగ్గంటల నిడివి ఉన్న ‘మేరా నామ్‌ జోకర్‌’ తీస్తున్నాడు రాజ్‌కపూర్‌. చిన్నప్పటి జోకర్‌ కథ చాలా ముఖ్యమైనది. దానికి అభినయించాల్సిన నటుడు కూడా ముఖ్యమైనవాడే. ఎవరిని తీసుకోవాలి? అని రాజ్‌కపూర్‌కు సందేహం వచ్చింది. చిన్న కొడుకుతో చేయిస్తే ఎలా ఉంటుంది అని భార్యను అడిగాడు. అప్పటికి రిషి కపూర్‌కు పదమూడు పద్నాలుగేళ్ల వయసు వచ్చింది. వీడు నటుడవుతాడు అని మొదట అతని బాబాయి శశి కపూర్‌ కనిపెట్టాడు. అందుకు కారణం రిషి కపూర్‌ ఎప్పుడూ అద్దం ముందు నిలుచుని ఉండటమే. అల్లరికి విసిగి తల్లి కృష్ణ నాలుగు బాదినా ఏడ్చుకుంటూ వెళ్లి అద్దం ముందు నిలుచుకుని ఆ ఏడుపు ఎక్స్‌ప్రెషన్స్‌ ఎలా ఉండేవో చూసుకునేవాడట.

తాత పృథ్విరాజ్‌ కపూర్‌ రక్తం వాడిలో ఉంది. బాబాయ్‌లు శశి, షమ్మి కపూర్లు చిన్న నటులు కాదు. మేనమామ ప్రేమనాథ్‌ కూడా పెద్ద నటుడు. ఇక తండ్రి సరేసరి. యాక్టింగ్‌ రాక ఎక్కడికి పోతుంది? ‘చదువుకు ఇబ్బంది లేకుంటే అలాగే చేయించండి’ అంది కృష్ణ. అప్పటివరకూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర బుద్ధిగా ఆ మాటలు వింటున్న రిషి మెల్లగా లేచి చేతులు కడుక్కుని తన గదిలోకి పరిగెత్తి ఆటోగ్రాఫ్‌ చేయడం ప్రాక్టీసు మొదలెట్టాడు... ఎలాగూ స్టార్‌ అయ్యాక చేయక తప్పదు కదా అని. ‘మేరా నామ్‌ జోకర్‌’ 1970లో విడుదలైంది. 2020, అంటే ఆ తర్వాతి 50 ఏళ్లు రిషి కపూర్‌ ఆటోగ్రాఫ్‌లు చేస్తూనే ఉన్నాడు.

మై షాయర్‌ తో నహీ మగర్‌ ఏ హసీ...
‘మేరా నామ్‌ జోకర్‌’ తీవ్రంగా ఫ్లాప్‌ అయ్యింది. రాజ్‌కపూర్‌ స్టూడియో కుదవలోకి వెళ్లింది. బ్యాంక్‌ అకౌంట్లన్నీ ఖల్లాస్‌ అయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. పెద్ద పెద్ద స్టార్లు రాజేష్‌ ఖన్నా లాంటి వాళ్లు మేము ఫ్రీగా ఒక సినిమా చేస్తాం... గట్టెక్కమనండి అని కబురు చేస్తున్నారు. కాని రాజ్‌ కపూర్‌ ఈ ‘భీక్‌’ తీసుకునే రకం కాదు. తన బంతిని తానే ఎగరేయాలి. రైటర్‌ కె.ఏ. అబ్బాస్‌ని పిలిచి మంచి యూత్‌ స్టోరీ తీద్దాం అన్నాడు. రిషి కపూర్‌కు, రాజ్‌ కపూర్‌కు పుస్తకాలు చదివే అలవాటు లేదు. కాని కామిక్స్‌ చదివేవారు. ఆర్చీస్‌ కామిక్స్‌ యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉండేవి. అలాంటి యూత్‌ స్టోరీ తీద్దామని రాజ్‌ కపూర్‌ అనుకున్నాడు. హీరో ఎవరు? రిషి కపూర్‌. హీరోయిన్‌? డింపుల్‌ కపాడియా. జనానికి ఆమె పొట్టి డ్రస్సులు నచ్చాయి. రిషి వేసుకున్న బ్లూ అండ్‌ బ్లూ మేచింగ్‌ డ్రస్సులు కూడా. ‘బాబీ’ సూపర్‌ హిట్‌ అయ్యింది. కాని అప్పటికే డింపుల్‌ కపాడియా ఆ సక్సెస్‌ను క్లయిమ్‌ చేసుకునే వీలు లేక రాజేష్‌ ఖన్నాను పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. పత్రికలన్నీ రిషి కపూర్‌ని ఆకాశానికెత్తాయి. ఆ సమయానికి 21 ఏళ్ల యువకుడు రిషి కపూర్‌. కళ్లు నెత్తికెక్కడానికి ఇంకేం కావాలి?

ఖుల్లంఖుల్లా ప్యార్‌ కరేంగే హమ్‌ దోనో ఇస్‌ దునియాసే నహీ డరేంగే హమ్‌ దోనో...
‘బాబీ’తో రిషి కపూర్‌ ఘనమైన హిందీ రొమాంటిక్‌ సినిమాల పరంపరను నిలబెట్టాడు. రాజ్‌కపూర్, దేవ్‌ ఆనంద్, శశి కపూర్, రాజేష్‌ ఖన్నాలు వేసిన దారి తనక్కూడా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. పేరు, డబ్బు, గర్ల్‌ఫ్రెండ్స్, షూటింగ్‌లో గద్దించి చెప్పడానికి సాహసించలేని డైరెక్టర్లు... ఆ టైమ్‌లో అతనికి నీతూ సింగ్‌ కనిపించింది. మన తెలుగులో హిట్‌ అయిన ‘కోడెనాగు’ రీమేక్‌ ‘జహ్రీలా ఇన్‌సాన్‌’లో మొదటిసారి వాళ్లిద్దరూ కలిసి నటించారు. ఇది రిషి కపూర్‌కు రెండో సినిమా. ఇద్దరూ ఉత్సాహం, హుషారు అనే టాబ్లెట్లను గుప్పెడు గుప్పెడు మింగినట్టుగా కెమెరా ముందు కళకళలాడేవారు. ‘రఫూ చక్కర్‌’, ‘ఖేల్‌ ఖేల్‌ మే’, ‘కభీ కభీ’, ‘ఝూటా కహీ కా’.... ప్రతి సినిమాలో వారి జోడి మెరిసింది. ఒక వానరాన్ని మరో వానరమే తోక ముడిపెట్టి అదుపు చేయగలదు అని ఇరువురికీ తెలిసింది. రాజ్‌ కపూర్‌ ఈ ప్రేమను అంగీకరించాడు. 1980లో వారిరువురూ పెళ్లి చేసుకున్నారు. 

బచ్‌నా ఏ హసీనో లో మై ఆగయా...
1977లో వచ్చిన ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ సినిమాలోని పాట ఇది. కాని ఆ సమయానికే రొమాంటిక్‌ స్టార్‌ రాజేష్‌ ఖన్నా డౌన్‌ అయ్యాడు. ఆ తర్వాత వరుసలో నిలబడ్డ రిషి కపూర్‌ భవిష్యత్తు తేలకుండా ఉంది. దానికి కారణం ‘జంజీర్‌’ సినిమాలో హీరోల ధోరణి మారింది. అమితాబ్‌ యాంగ్రీ యంగ్‌మేన్‌గా అవతరించాడు. ‘దీవార్‌’, ‘షోలే’ వంటి సినిమాలు హిందీ సినిమాను యాక్షన్‌ ట్రెండ్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశపెట్టాయి. అమితాబ్, శతృఘ్నసిన్హా, ధర్మేంద్ర, వినోద్‌ ఖన్నా అందరూ యాక్షన్‌ సినిమాలు చేస్తున్నారు. రిషి కపూర్‌కు యాక్షన్‌ పనికి రాదు. అంతటి ఆకారం కూడా లేదు. ఎత్తు తక్కువ మనిషి కావడం అతణ్ణి ఒక పరిమితిలో ఉంచింది. ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’ వంటి మల్టీస్టారర్స్‌ సూపర్‌హిట్‌ అవుతున్నాయి తప్ప సోలోగా పెద్ద హిట్స్‌ ఇవ్వలేకపోతున్నాడు. రాజేష్‌ ఖన్నాకు దర్శకుడు శక్తి సామంత ఉన్నట్టు, అమితాబ్‌కు ప్రకాష్‌మెహ్రా ఉన్నట్టు రిషి తనకో ప్రత్యేక దర్శకుల బృందాన్ని పెట్టుకోలేకపోయాడు. తండ్రి రాజ్‌కపూరే ప్రతిసారీ రిషి కపూర్‌ కెరీర్‌ను సెట్‌ చేసే ప్రయత్నం చేశాడు. 1980 సంవత్సరం లోపల అతడికొచ్చిన మంచి హిట్‌ మన కె.విశ్వనాథ్‌ ఇచ్చిన ‘సర్‌గమ్‌’.‘సిరిసిరిమువ్వ’కు హిందీ రీమేక్‌గా తీసిన ఈ సినిమాలో రిషి కపూర్‌ తప్పెటను మోగించేశాడు. జయప్రదకు హిందీలో తొలి హీరోగా నిలిచాడు. కాని అది చాల్లేదు.

ఏక్‌ హసీనా థీ ఏక్‌ దీవానా థా క్యా ఉమర్‌ క్యా సమా క్యా జమానా థా...
స్టార్‌ డైరెక్టర్‌ సుభాష్‌ ఘాయ్‌ తీసిన ఈ సినిమా మీద సోలో హీరోగా రిషి కపూర్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మంచి కథ, పాటలు, భారీ నిర్మాణం... జూన్‌ 1980లో అది రిలీజ్‌ అయ్యింది. అయితే అంతకు సరిగ్గా వారం ముందు రిలీజైన ఫిరోజ్‌ ఖాన్‌ ‘ఖుర్బానీ’ ముందు నిలువలేకపోయింది. ఖుర్బానీ కలెక్షన్లు రోజురోజుకీ తుఫానులా మారి కర్జ్‌ను ముంచేశాయి. రిషి కపూర్‌ తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. తానసలు హీరోగా పనికొస్తానన్న ధైర్యాన్నే కోల్పోయాడు. జనం ఎదురు పడితే గుండె దడ. సైకియాట్రిస్ట్‌లు, స్నేహితులు, భార్య ఎవ్వరూ అతణ్ణి కాపాడలేకపోయారు... రెండు పెగ్గుల ఆల్కహాల్‌ తప్ప. పడి లేవడం కపూర్‌లకు అలవాటు. రిషి కపూర్‌ కూడా అలాగే లేచాడు. కాలం మారినా, హీరోలు మారినా, కథా వస్తువు మారినా తానంటూ ఒకణ్ణి ఉన్నానని నిరూపిస్తూనే వచ్చాడు. ఆ పోరాడే లక్షణమే అతణ్ణి ఇండస్ట్రీలు తుది శ్వాస వరకూ నిలబెట్టింది.

సాగర్‌ కినారే దిల్‌ ఏ పుకారే తూ జో నహీతో మేరా కోయీ నహీ...
‘సాగర్‌’ లో రిషి కపూర్‌ మళ్లీ తన పాత మేజిక్‌ కోసం ప్రయత్నించాడు. తొలి సినిమా బాబీ హీరోయిన్‌ డింపుల్‌ కపాడియాతో నటించాడు. అయితే సాగర్‌ యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత రిషి కపూర్‌ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు ఒక ప్రధాన ఆధారంగా నిలిచి, భేషజాలకు పోకుండా హిట్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీదేవి కెరీర్‌కు అండగా నిలిచిన రెండు సినిమాలు ‘నగీనా’, ‘చాందినీ’లలో రిషి కపూర్‌ హీరో. పాకిస్తాన్‌ నటి జెబా భక్తియార్‌ నటించిన ‘హెన్నా’ హిట్‌గా నిలిచింది. ఇక మీనాక్షి శేషాద్రి కెరీర్‌కు మూలస్తంభంలా నిలిచిన ‘దామిని’లో రిషిది చాలా ముఖ్యమైన పాత్ర. 1995 నాటికి రిషి కపూర్‌ సోలో హీరో కెరీర్‌ దాదాపుగా ముగిసింది. ‘బోల్‌ రాధా బోల్‌’, ‘దీవానా’ అతడి ఆఖరి హిట్లు.

నిజానికి రిషి కపూర్‌లోని ‘ఆర్టిస్ట్‌’ని అతడి రెండో రాకడలోనే ప్రేక్షకులు చూశాడు. 2005 తర్వాత రిషి కపూర్‌ పూర్తిస్థాయి కేరెక్టర్‌ ఆర్టిస్టుగా మారి సినిమా ఇండస్ట్రీయే ఆశ్చర్యపోయే పాత్రలు చేశాడు. గిటార్‌ పట్టుకుని పాటలు పాడే ఆ హీరోయే ఈ నటుడు అని నమ్మలేనట్టుగా చేయగలిగాడు. ‘పటియాలా హౌస్‌’, ‘అగ్నిపథ్‌’, ‘దోదూని చార్‌’, ‘డి డే’, ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’, ‘102 నాటౌట్‌’, ‘ముల్క్‌’... ఈ సినిమాలన్నీ రిషి కపూర్‌ పట్ల గౌరవాన్ని పెంచాయి. అప్పట్లో ఇష్టపడని వారు కూడా ఇప్పుడు ఇష్టపడ్డారు. రిషి కపూర్‌కు సినిమాలు తప్ప వేరే ఏమీ తెలియదు. కపట స్వభావం ఎరగడు. ఖుల్లంఖుల్లాగా మాట్లాడటమే తెలుసు. కొన్ని ట్వీట్లు అమాయకంగా చేసి ఇరుకున పడ్డాడు. కాని ఎప్పుడూ ఎవరి అభిమానాన్ని కోల్పోలేదు. రిషి కపూర్‌ మరణించడం అంటే ఒక రంగు రంగుల డెబ్బయిల కాలం, డిస్కో పాటల కాలం, పైలా పచ్చీసు కాలం గతించిపోవడం. హిందీ సినిమా ప్రదర్శించిన ఒక ఉత్సుకతగా ఉరక తరగగా రిషి కపూర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతాడు. యాద్‌కు వస్తూనే ఉంటాడు. బంగారం, వెండికి బదులుగా కాసింత ప్రేమను పొందుతూనే ఉంటాడు.
నా మాంగూ సోనా చాందీ
నా మాంగూ హీరా మోతీ
ఏ మేరే కిస్‌ కామ్‌ కే.....    

కలతల కాపురం
కపూర్‌ ఖాన్‌దాన్‌లో కోడలు తన నటనకు స్వస్తి పలకాలనేది నియమం. బిజీ హీరోయిన్‌గా ఉన్న నీతూ సింగ్‌ రిషి కపూర్‌తో వివాహం కోసం తన కెరీర్‌ను మానుకుంది. కుటుంబం కోసం ఆమె సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 1980లలో పెళ్లి జరిగితే రిషి కపూర్‌ కుటుంబం కంటే కెరీర్‌కే ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చాడనేది ఇండస్ట్రీలో వినిపించేది. రిషి కపూర్‌ దివ్యభారతి, జూహీ చావ్లా తదితర హీరోయిన్లతో క్లోజ్‌గా ఉన్న సమయాలలో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని అంటారు. రిషి కపూర్, నీతూ సింగ్‌ల గొడవలు వారి కుమారుడు రణబీర్‌ కపూర్‌పై ఎక్కువగా ప్రభావం చూపాయి. ‘వాళ్లు రాత్రంతా గొడవ పడుతుంటే నేను మెట్ల మీద మోకాళ్లలో మొహం దాచుకుని ఏడ్చేవాణ్ణి’ అని రణబీర్‌ కపూర్‌ చెప్పుకున్నాడు.

కొడుకుతో రిషి కపూర్‌కు పెద్దగా చనువు లేదు. ‘నాకు మా నాన్నతో ఎంత చనువు ఉందో మా అబ్బాయికి నాతో అంతే చనువు ఉంది’ అని చెప్పుకున్నాడు. ఒక వయసుకు చేరుకున్నాక రిషి, నీతూల మధ్య మరింత ప్రేమ పెరిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత వారిద్దరూ కలిసి ‘దో దూని చార్‌’, ‘బచ్‌నా ఏ హసీనో’ సినిమాలలో కలిసి నటించారు. చివరి రోజులలో నీతూ రిషిని అంటి పెట్టుకునే ఉంది. నలభై ఏళ్ల అతని సాంగత్యం ఇప్పుడు ముగిసింది. ఇది నీతూకు పెద్ద వెలితిగా మారనుంది.

భార్య, పిల్లలు, మనుమరాలితో రిషి కపూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement