
‘ఉద్యోగం’ అనుకుంటేనే ‘అదనపు పని గంటలు’ అనే మాట వస్తుంది. ‘బాధ్యత’ అనుకుంటే ఆపత్కాలంలో గంటల్ని లెక్క చూసుకోవడం ఏంటి అనే భావన కలుగుతుంది. నిస్వార్థంగా, నిరంతరాయంగా కోవిద్ 19 వార్డులలో పని చేస్తున్న నర్సులు, చేయడానికి వస్తున్న యువతులు తమ పనిని తాము ‘సేవ’ అనుకోవడం లేదు. ‘బాధ్యత’ అనుకుంటున్నారు. ఎంతటి అలసటలోనూ చెరగని ఆ సిస్టర్‌ల చిరునవ్వులను ఈ ఆదివారం రాత్రి మన ఇంటి ముందు దీపంగా పెట్టుకుందాం. థ్యాంక్యూ.. మై సిస్టర్.
నీతు : నర్స్. మమా కీ లడికీ.. హాహా.
నా చెల్లెలు చూడండి. కొమ్ముల కరోనాతో యుద్ధం చేస్తూ కూడా ఎలా చిరునవ్వులు చిందిస్తోందో! వియ్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యు మై సిస్టర్. వజ్రం రా నువ్వు. – ఇన్‌స్టాగ్రామ్‌లో కేరళ ర్యాప్ సింగర్ రఫ్తార్ బుధవారం పెట్టిన పోస్ట్ ఇది. ఈ చిరునవ్వుల సిస్టర్‌ని కొన్ని గంటల్లోనే రెండు లక్షల మంది ‘లైక్’ చేశారు. ‘గుడ్ జాబ్. ప్రౌడ్ ఆఫ్ యు సిస్టర్’.. నెట్టంతా బుట్టలకొద్దీ ప్రశంసల పూల ఎమోజీలు నీతూకు.
‘మీకేం కాదు’ అనే ఇలాంటి ఒక నవ్వు చాలు. కరోనా రోగి మానసికంగా కోలుకుని మందులకు త్వరగా తేరుకోడానికి.
నీతూలాగే శిఖా మల్హోత్రా మరొక చిరునవ్వుల ‘సిస్టర్’. ముంబైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈమధ్యే నర్స్–కమ్ జూనియర్ డాక్టర్‌గా చేరారు. ఇంటి చుట్టుపక్కల కార్పోరేట్ ఆసుపత్రుల ఉన్నప్పటికీ, ప్రభుత్వాసుపత్రిలో అవకాశం వచ్చేవరకు కొద్ది రోజులు వేచి చూశారు శిఖ. అక్కడికి ‘ఉద్యోగం’ కోసం వెళ్లినప్పుడు.. ‘మీరు ఫలానా కదా!’ అన్నారు.. ‘ఫ్యాన్’, ‘కాంచ్లీ’ సినిమాల్లో అప్పటికే ఆమెను చూసి గుర్తుపట్టినవాళ్లు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న పాతికేళ్ల అమ్మాయి.. అకస్మాత్తుగా ఇటువైపు రావడం ఏమిటని వారి విస్మయం.
‘‘21 రోజుల లాక్‌డౌన్ ప్రకటన చేస్తూ మోదీజీ ఇచ్చిన ప్రసంగాన్ని విన్నాను. క్షణంసేపు కూడా ఇంట్లో ఉండలేకపోయాను. కరోనా వచ్చిన వాళ్లకు నేను కూడా ఏదైనా చేయాలనుకున్నాను’’ అన్నారు శిఖ. ఆ మాటతో వెంటనే అక్కడి మెడికల్ సూపరింటెండెంట్, ఇతర సీనియర్ వైద్యులు అభినందనగా కరతాళ ధ్వనులు చేశారు. నర్సింగ్‌లో బియస్సీ డిగ్రీ చేశారు శిఖ. ఆ డిగ్రీనే ఆమెకిప్పుడు సేవలు చేసే భాగ్యాన్ని కల్పించింది. రోజుకు 11 నుంచి 12 గంటల పాటు ఆసుపత్రిలోనే ఉంటున్నారు శిఖ. మరికొన్ని గంటలు అదనంగా పని చేయాలని ఆమె తపన. రోగులు ఎక్కువగా ఉండే కోవిద్–19 ఐసోలేషన్ వార్డులో రోజంతా కేస్ షీట్ పట్టుకుని తిరుగుతుండే శిఖ.. ప్రసన్నవదనంతో దేవదూతలా కనిపిస్తున్నారు అక్కడ చికిత్స పొందుతున్న వారికి.
ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి దేశ ప్రజలంతా తొమ్మిది నిముషాల పాటు లైట్‌లు ఆర్పేసి, కొవ్వొత్తులు వెలిగించి... కరోనా అనే చీకటì ని సంకేతాత్మకంగా అంతమొందించాలని ప్రధాని మోదీ పిలుపును ఇచ్చారు. మనం వెలిగించడానికి ముందే నీతూ, శిఖా వంటి నర్సులు తమ సేవల చిరునవ్వుల వెలుగులతో కోవిద్ 19 పై అంతిమ విజయానికి పోరాటం చేస్తున్నారు. తమ జీవితాలను ఆసుపత్రులకే అంకితం చేస్తున్నారు. అదనపు పని గంటలకు అంగీకరించని పురుషు ఉద్యోగుల పని భారాన్ని కూడా మీద వేసుకుంటున్నారు. కాస్త చదువుకుని, కనీస చికిత్సా విధానాల గురించి తెలిసిన యువతులు కూడా.. వాళ్లు ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి తాత్కాలికంగా విరామం ఇచ్చి.. కరోనా ‘కేర్ టేకింగ్’కి తమకూ అవకాశం కల్పించమని, ఉచితంగా పని చేస్తామని ఆసుపత్రుల యాజమాన్యాలను కోరుతున్నారు! కరోనా పేషెంట్‌లకు దగ్గరగా ఉండే నర్సులు ఆ వైరస్ వ్యాపించి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయినా వారు లెక్క చేయడం లేదు.
కరోనాపై విజయానికి ఇప్పుడిప్పుడే మనం చేరువవుతున్నాం. ముందు వరుసలో ఉండి ఈ మహావిపత్తుతో యుద్ధం చేస్తున్న ‘సిస్టర్స్’ త్యాగశీల పోరాట పటిమ వల్లనే ఇంతవరకైనా వచ్చాం. మందు లేదు. మాకు లేదు. టీకా లేదు. కనీసం ఆ మహమ్మారి టైమ్ కూడా ఇవ్వడం లేదు. అయినా నర్సులు ఫైట్ చేస్తున్నారు. రేపు ఒక రోజెప్పుడో కరోనాపై భారత ప్రధాని గెలిచారని, భారత దేశ ప్రజలు గెలిచారని ప్రపంచ దేశాలు మనల్ని శ్లాఘించవచ్చు. అప్పుడు మనం ప్రపంచానికి ఎత్తి చూపించవలసింది మన సిస్టర్ చేతినే. ఒలింపిక్ దీపం లాంటి ప్రాణ దీపం ఆమె చెయ్యి.