అతని ప్రపంచం అరక్షణంలో మారిపోయింది!
యెరూషలేము మందిరం దగ్గరలో బెతెస్థ అనే కోనేరుంది. ఒక దేవదూత కొన్నిసార్లు వచ్చి ఆ నీటిని కదిలించినపుడు ముందుగా ఎవరు దిగుతారో వారు ఎలాంటి రోగమున్నా బాగుపడతారని నమ్మేవారు. అలా బాగుపడేందుకు రకరకాల రోగులు, వికలాంగులు వందల సంఖ్యలో అక్కడ పడి ఉన్నారు. ఒక వ్యాధి వల్ల 38 ఏళ్లుగా పడకకంటుకుపోయిన ఒక వ్యక్తి కూడా వారిలో ఉన్నాడు. ఒకరోజు యేసు అక్కడికొచ్చి ‘స్వస్థతపడాలనుకొంటున్నావా?’ అనడిగాడు. దేవదూత నీటిని కదిలించినప్పుడు తనను ముందు నీళ్లలోకి దించేవారు లేక తానింకా రోగిగా ఉన్నానన్నాడా వ్యక్తి. సాక్షాత్తూ దేవుడే వచ్చి తన ఎదుట నిలబడి మాట్లాడుతుంటే, ఆయనకు ఒక దేవదూత సంగతి చెబుతున్నాడా అవివేకి. యేసు ఎవరు? అక్కడి దేవాలయంలో ఆరాధనలు పొందుతున్న దేవుడు.
ఆయనే స్వయంగా తన వద్దకొస్తే, తనను ముందుగా నీళ్లలోకి దించలేకపోతున్న లోకాన్నే ఇంకా పట్టుకు వేలాడుతున్న దౌర్భాగ్యం అతనిది. కొందరంతే, ఆశీర్వాదం తమను వెదుక్కుంటూ వచ్చినా, శాపానికే పట్టం కడతారు! అయితే అతని 38 ఏళ్ల దుర్భర జీవితానికి, నిరాశకు యేసు అరక్షణంలో ముగింపు పలుకుతూ, ‘నీ పరుపెత్తుకొని నడువు’ అని ఆజ్ఞాపించగా, అతడు అత్యానందంతో నడుస్తూ వెళ్లిపోయాడు (యోహాను 5:2–9).
దేవునికన్నా కోనేటి నీటికే శక్తి ఎక్కువ అని నమ్మే అతని అంధ విశ్వాసానికైతే అంతం వచ్చింది కాని లోకంలో దేవుని పిల్లలుగా చలామణి అయ్యే చాలామంది అనేకానేక అంధవిశ్వాసాలకు ఇంకా బానిసలుగానే బతుకుతున్నారు. అవి మందిర సేవకు వాడే నీళ్లు గనుక, అవి కూడా పవిత్రమైనవేనని ఎవరో కథలు చెబితే నమ్మి దేవుణ్ణి, దేవాలయాన్ని వదిలేసి కోనేటి నీటి దగ్గర అంధవిశ్వాసంతో మగ్గుతున్నారు వందలాది రోగులు.
అందుకు తమను తాము కుటుంబాల నుండి బహిష్కరించుకొని ఆ దేవదూత దిగొచ్చే వేళకోసం అక్కడే జీవితకాలమంతా అనాథలుగా బతుకుతున్నారు వాళ్లంతా! అంధవిశ్వాసానికి, అవిశ్వాసానికి పెద్దగా తేడా లేదు, రెండూ ఒకటే! మనిషి రాకెట్ వేగంతో అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నాడు. కాని మానసికంగా, భావనల పరంగా రకరకాల సంకెళ్లు అంధ విశ్వాసాల రూపంలో తగిలించుకొని బానిసవుతున్నాడు. లోకమంతటినీ ‘ఒక్కటి చేసిన ఈ ఇంటర్‌నెట్ యుగంలో కూడా కొందరు నిరుపేదల్ని కులం పేరుతో ‘సంఘబహిష్కరణ’ చేసే వారి అమానవీయతకు అసలు వివరణ ఏది? అయినా దేవుడి బిడ్డలూ! దేవుడే మీతో ఉంటే దేవదూతలు, కోనేటి నీళ్ళతో మీకేం పని?! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్