అంత డబ్బెక్కడిది? | special story to Corporate College education | Sakshi
Sakshi News home page

అంత డబ్బెక్కడిది?

Published Mon, Jun 26 2017 10:55 PM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

అంత డబ్బెక్కడిది? - Sakshi

అంత డబ్బెక్కడిది?

నెలాఖరు వస్తే.. నాన్న పర్స్, అమ్మ పోపు డబ్బా రెండూ కలిపి చూసినా.. చిల్లర తప్ప ఏం దొరకదు! నెలాఖరుదాకా ఎందుకులే.. ఫస్ట్‌ తారీఖున కటింగ్‌లన్నీ పోయి నెలఖర్చుల కోసం.. ఈఎమ్‌ఐలకు పోసిన తర్వాత సగటు మమ్మీడాడీ దగ్గరుండేది చిల్లరేగా? మరి వీడికి అంత డబ్బు ఎక్కడిది? ఈ గిప్ట్స్‌ ఎక్కడివి? వీడిలాగే మనోడు కూడానా...?

రాత్రి పన్నెండు దాటింది!
అరవింద్‌ పక్కమీద అస్థిమితంగా అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఏం చేస్తాడు మరి! ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. ఇలా లాభం లేదనుకుని కాసేపు వరండాలోకి వెళ్లి అటూ ఇటూ నడిచాడు. అయినా కలవరం.. కంటిమీదకు కునుకు రానివ్వడంలేదు. తన అవస్థ చూసి పదిసార్లు అడిగింది పద్మ... ‘ఏమైందండీ’ అని! ఏం చెప్తాడు? పొద్దున న్యూస్‌ పేపర్‌లోని వార్త గురించి చెబితే.. ఎలా రిసీవ్‌ చేసుకుంటుంది? అప్పటికీ.. కొడుకు ప్రవర్తన గురించి తను చెప్తూనే ఉంది.. వాడిలో ఏదో మార్పు వచ్చిందని! టెన్త్‌ వరకు బాగా చదివాడు. బోర్డ్‌ ఎగ్జామ్‌లో వాడు తెచ్చుకున్న మార్కులు కార్పోరేట్‌ కాలేజ్లో ఫ్రీ సీట్‌ను తెచ్చిపెట్టాయి.

నిజానికి వాడు ఆ మార్కులు సంపాదించలేకపోతే ఈ కొడుకును కార్పోరేట్‌ కాలేజ్‌లో చదివించేంత సీన్‌ ఉండేదా తనకి? వాడికి ఇంట్లో చదువుకోవడానికి ఓ స్టడీ రూమ్‌నైనా కేటాయిద్దామనే ఉద్దేశంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు... తనకు భారమైనా. వాడు కూడా ఇంటర్‌ ఫస్టియర్‌ వరకు బుద్ధిగానే ఉన్నాడు. సెకండియర్‌ వచ్చేసరికే కొద్దికొద్దిగా మారడం మొదలుపెట్టాడు. హెయిర్‌ స్టయిల్‌ నుంచి షూ వరకు అంతా కొత్తగా కనిపిస్తున్నాడు. అందుకే పద్మకూ బెంగ మొదలయింది.. వాడిలో రోజుకో రకంగా వస్తున్న మార్పును చూసి.

మ్యానేజ్‌ చెయ్యి మమ్మీ!
రాత్రి భోజనాలప్పుడు అడిగింది పద్మ... ‘ఏమండీ.. మధ్యాహ్నం వాడి గది సర్దుతుంటే కప్‌బోర్డ్‌లో కొత్త ట్యాబ్‌ దొరికింది. మీరేమైనా కొనిచ్చారా నాకు తెలియకుండా?’ అని. ‘లేదు.. రెండునెలల కిందట బాగానే వెంటపడ్డాడు కొనిమ్మని. నీకు తెలుసు కదా నా ఆర్థిక పరిస్థితి.. ఎక్కడ కొనగలను? అదేమాట వాడికీ చెప్పాను.. కొనలేను అని’.. పద్మకు సమాధానమైతే చెప్పాడు కాని.. అప్పటినుంచి అరవింద్‌ భయం, ఆందోళన ఇంకా ఎక్కువయ్యాయి. పద్మకూ మొదలైందేమో సేమ్‌ ఫీలింగ్‌... వంటిల్లు సర్దేసి బెడ్‌రూమ్‌లోకి వచ్చాకా.. ఆ టాపిక్కే కంటిన్యూ చేసింది.. ‘నేను ఇంతకుముందే చెప్పాను మీకు.. నెలకో కొత్త వస్తువు ఇంటికి తెస్తున్నాడు’ అని. ఒకసారి ఫ్రెండ్‌వాళ్ల అక్క అమెరికా నుంచి తెచ్చిందని రెండు  లీ జీన్స్‌ పాంట్స్‌ పట్టుకొచ్చాడు. ఇంకోసారి ఫ్రెండ్‌ కొనిపెట్టాడు అంటూ నైకీ షూతో వచ్చాడు. ఇదివరకు ఒకసారి మీతో అన్నాను కూడా. ‘పోనీలే.. నా మీదైతే భారం పడట్లేదు కదా’ అని మీరూ తప్పించుకున్నారు. ఈరోజు ఈ ట్యాబ్‌.. ఏంటో నాకేం అర్థంకావట్లేదు. అదీగాక ఈ ఆరునెలల్లో నాలుగుసార్లు గోవా వెళ్లాడు.

ఇదిగో మళ్లీ ఇప్పుడూ ఫ్రెండ్స్‌ తీసుకెళ్తున్నారంటూ మీకు తెలియకుండా నాకు ఫోన్‌ చేసి చెప్పాడు. ‘డాడీ అడిగితే మ్యానేజ్‌ చెయ్యి మమ్మీ’ అని చెప్పి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లాడు. నాలుగు రోజులవుతోంది.. ఈ ఉదయం మీరు ఫోన్‌ చేసి గట్టిగా చెబితే ఈ రాత్రికి బయలుదేరుతున్నాడు కాని.. లేకుంటే వచ్చేవాడా?’ అని సుదీర్ఘంగా చెప్పి నిట్టూర్చింది పద్మ. ఆ సంభాషణ అరవింద్‌లో దిగులును, గాభరాను మరింత పెంచింది. ‘రానీ.. పొద్దున రానీ.. చెప్తా..’ అనుకొని కళ్లు గట్టిగా మూసుకున్నాడే కాని.. ఆదమరచి నిద్రలోకి జారుకోలేకపోయాడు!

అర్జెంటుగా ఓసారి వస్తావా?
ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ పడుకున్న అరవింద్‌ ఉదయం అయిదుగంటలకే పక్కమీద నుంచి లేచాడు. వాకింగ్‌కి వెళ్తూన్నట్టుగా బయటపడి..   ఎస్సై అయిన తన పోలీస్‌ బావ రఘుకి కాల్‌ చేశాడు.. ‘బావా.. నిన్ను అర్జంటుగా కలవాలి.. తొమ్మిదింటికల్లా ఇంటికి రాగలవా? టిఫిన్‌ చేస్తూ మాట్లాడుకుందాం?’ అని. ‘ఏంటీ బావా అంత అర్జెంట్‌? మా చెల్లి మీద ఏమైనా కంప్లయింట్సా ఏంటి కొంపదీసి? అయినా నేను మా చెల్లెలు సైడే... తెలుసు కదా..’ అంటూ చమత్కరించాడు రఘు. ‘అబ్బా... బావా! జోక్స్‌ కాదు... ఇది కొంచెం సీరియస్‌ విషయం... ప్రణవ్‌ గురించి మాట్లాడాలి’ అన్నాడు అరవింద్‌. ఆ మాట వినగానే స్వరాన్ని గంభీరం చేసుకుని ‘సరే బావా.. వస్తా’ అన్నాడు రఘు. ‘ఓకే’ అంటూ ఫోన్‌ కట్‌ చేశాడు అరవింద్‌.

వాడికేమిటి సంబంధం?
‘ఏంటీ.. బావా.. అర్జెంట్‌ అని రమ్మన్నావు... విషయమేంటి?’ అని అడిగాడు దోసెముక్కతో కొబ్బరి చట్నీ తీసుకుంటూ రఘు. అంతకుముందు రోజు తనను కుదిపేసిన వార్త ఉన్న పేపర్‌ కటింగ్‌ను రఘు ముందుంచాడు అరవింద్‌. అందుకుని చూశాడు రఘు. ‘డ్రగ్స్‌ స్మగ్లింగ్‌లో టీనేజర్స్‌.. గోవా కేంద్రంగా సాగుతున్న ఈ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు తెలుగురాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి వంటి పట్టణాల టీనేజ్‌ అబ్బాయిలను టార్గెట్‌ చేసుకుంటు న్నారని, ఈ పిల్లలకు గోవా పర్యటన, ఖరీదైన గాడ్జెట్స్, ట్యాబ్స్, బ్రాండెడ్‌ వాచెస్, దుస్తులు, కొన్నిసార్లు బైక్స్‌నీ ఎరగా చూపించి డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేయిస్తున్నారనీ... వార్త సారాంశం!

‘అవును బావా.. ఈ మధ్య చాలా ఎక్కువైంది. గోవా, ముంబై... ఔటింగ్‌లు, అక్కడ పబ్‌లు.. అంటూ ఆశపెట్టి.. అలవాటు చేసి వీళ్ల ద్వారా డ్రగ్స్‌ను ట్రాన్స్‌పోర్ట్‌ చేస్తున్నారు. అలాంటి ఎరలో పడొద్దని కాలేజ్‌ స్టూడెంట్స్‌కి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. పేరెంట్స్‌ కూడా ఓ కంట కనిపెడు తుండాలి.. పిల్లలు ఆల్‌ ఆఫ్‌ సడెన్‌ గోవా, ముంబై అని టూర్లు పెట్టుకోవడం.. ఫ్రెండ్స్‌ గిఫ్ట్స్‌ ఇచ్చారంటూ ఖరీదైన వస్తువులను ఇంటికి తేవడం చేస్తుంటే.. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. అలాగే కాలేజ్‌ అటెండెన్స్‌ ఎలా ఉందో కూడా చెక్‌ చేసుకోవాలి. అయినా  ఈ వార్తతో ప్రణవ్‌కి ఏంటీ.. సం..బం..ధం...’ అంటూ అడుగుతుండగానే రఘుకు విషయం బోధపడింది.. ఈ లోపే బయట కాలింగ్‌ బెల్లూ మోగింది. ‘ప్రణవ్‌ అనుకుంటా..’ అంటూ తలుపు తీయడానికి గబగబా పరిగెత్తింది పద్మ. ‘వచ్చాడు.. ’ దవడలు బిగదీసుకుంటూ అన్నాడు అరవింద్‌.

కొడుకుపై పట్టలేని కోపం
‘బావా.. కూల్‌.. వాడలాంటి పనులు చేయడనే నా నమ్మకం. అయినా నేనున్నాను కదా.. ఎలా దారిలోకి తేవాలో నాకు తెలుసు.. నువ్వు ఆవేశ పడకు’ అంటూ అరవింద్‌ ఆగ్రహాన్ని రఘు చల్లార్చే ప్రయత్నం  చేస్తుండగానే ప్రణవ్‌ లోపలికి వచ్చాడు. వాడిని చూడగానే అరవింద్‌లో ఆగ్రహం, ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. టేబుల్‌ దగ్గర్నుంచి ఒక్క ఉదుటన లేస్తూ.. ‘ఒరేయ్‌... ముందు ఆ బ్యాగ్‌ ఓపెన్‌ చెయ్‌’ అరిచాడు అరవింద్‌.

తండ్రి అరుపుకి బిక్కచచ్చిపోయాడు ప్రణవ్‌. ‘నిన్నే... చూస్తూ నిలబడ్డావేం.. ఆ బ్యాగ్‌ ఓపెన్‌ చెయ్‌’ మళ్లీ అరిచాడు. నాన్న పక్కనే సీఐ మావయ్య.. నాన్న ఆవేశం... ప్రణవ్‌కి ఒక్క క్షణం అయోమయం.. అంతలోకే అనుమానం.. తన గురించి ఏమైనా తెలిసిందా? లేక సందేహమా? అని ఆలోచిస్తూనే.. వణుకుతున్న చేతులతో బ్యాగ్‌ ఓపెన్‌ చేశాడు. ఐఫోన్‌ కంట పడింది. ‘ఈ ఫోన్‌ ఎక్కడిదిరా..?’అంటూ కొడుకు చెంపను ఛెళ్లుమనిపించాడు అరవింద్‌. ఆయనను వెనక్కి తోస్తూ ప్రణవ్‌ను తీసుకొని పక్కగదిలోకి వెళ్లిపోయాడు రఘు.. కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి.

తండ్రి అరుపుకి బిక్కచచ్చిపోయాడు ప్రణవ్‌. ‘నిన్నే... చూస్తూ నిలబడ్డావేం.. ఆ బ్యాగ్‌ ఓపెన్‌ చెయ్‌’ మళ్లీ అరిచాడు. నాన్న పక్కనే పోలీస్‌ మావయ్య.. నాన్న ఆవేశం... ప్రణవ్‌కి ఒక్క క్షణం అయోమయం..

ప్రణవ్‌కి ఏంటీ.. సం..బం..ధం...’ అంటూ అడుగుతుండగానే రఘుకు విషయం అతనికి బోధపడింది.. ఈ లోపే బయట కాలింగ్‌ బెల్లూ మోగింది.‘ప్రణవ్‌ అనుకుంటా.. ’అంటూ తలుపు తీయడానికి గబగబా పరిగెత్తింది పద్మ.
– శరాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement