పోలీసుల గాలింపు
ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
విజయవాడ సిటీ : వారిద్దరూ ఆర్థికంగా స్థితిమంతుల కుటుంబాలకు చెందిన వారు. తల్లిదండ్రులు కోరినంత డబ్బు ఇవ్వడంతో విలాసంగా ఖర్చులు పెట్టేవారు. ఈ క్రమంలోనే ఒకరికొకరు పరిచయమై ప్రేమగా మారింది. అంతే నాలుగు రోజుల కిందట తాము చదివే కార్పొరేట్ కాలేజీ నుంచి అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని చోట్లా గాలిస్తుంటే..ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన యువకుడు, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన యువతి ఈస్ట్‌జోన్ పరిధిలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరి కుటుంబాలు ఆర్థికంగా బలమైనవి కావడంతో డబ్బును లెక్కలేకుండా ఖర్చు చేసేవారు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో నాలుగు రోజుల కిందట కాలేజీ నుంచి వారు కనిపించకుండా పోయారు. కాలేజీ నిర్వాహకుల సమాచారంతో ఇక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు.. తమ పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గుంటూరు, అనంతపురం, ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గాలింపు జరిపారు. ఎక్కడా వీరి ఆచూకీ దొరకలేదు. మొబైల్ ఫోన్లు కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల ఆచూకీ తెలపాలంటూ పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. వీరి అదృశ్యం వెనుక కాలేజీ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలేం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన నిర్వాహకులు పట్టించుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి వద్ద ఉన్న డబ్బులు ఖర్చయితే తప్ప కాలేజీ, ఇల్లు గుర్తుకు రావనే అభిప్రాయం పోలీసుల్లో వ్యక్తమవుతోంది.
కార్పొరేట్ కాలేజీ విద్యార్థుల జంప్!
Published Tue, Jan 27 2015 1:29 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
Advertisement
Advertisement